క్యాన్సర్ మహమ్మారి కారణంగా మరో నటి, హాలీవుడ్‌కు చెందిన కెల్లీ ప్రెస్టన్ (57) మరణించారు. గత రెండేళ్లుగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె ఆదివారం కన్నుమూశారు. కెల్లీ భర్త జాన్ ట్రావోల్టా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషాదాన్ని వెల్లడించారు. దీనిపై హాలీవుడ్ నటీనటులు, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఎండీ అండర్సన్ క్యాన్సర్ సెంటర్ వైద్యులు, నర్సులు, సన్నిహితులు, స్నేహితుల మద్దతుతో సాహసోపేతమైన పోరాటం చేసి తన భార్య చివరికి ఓడిపోయిందంటూ ఇన్‌స్టాలో భావోద్వేగ పోస్ట్ పెట్టారు జాన్. కెల్లీ ప్రేమ, ఆమె జ్ఞాపకాలు ఎప‍్పటికీ తమతోనే ఉంటాయన్నారు. ఈ సందర్భంగా తమకు సాయపడిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వీరికి కుమార్తెఎల్లా (20), కుమారుడు బెంజమిన్ (9) ఉన్నారు. 2009 లో జెట్(16) అనే కుమారుడిని కోల్పోయారు కెల్లీ, జాన్ దంపతులు. కాగా స్పేస్‌క్యాంప్ (1986), జెర్రీ మాగైర్ (1996) ఫర్ లవ్ ఆఫ్ ది గేమ్ (1999) వంటి ప్రముఖ చిత్రాలలో కెల్లీ ప్రెస్టన్ నటించారు. ఆమె నటించిన చివరి చిత్రం గొట్టి (2018).
Comments
Please login to add a commentAdd a comment