అన్‌క్లెయిమ్డ్ మనీ... ఓ ఫిల్మ్ లెక్క! | 'Lacchimdeviki O Lekkundi' movie review | Sakshi
Sakshi News home page

అన్‌క్లెయిమ్డ్ మనీ... ఓ ఫిల్మ్ లెక్క!

Published Sat, Jan 30 2016 4:20 PM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

అన్‌క్లెయిమ్డ్ మనీ... ఓ ఫిల్మ్ లెక్క!

అన్‌క్లెయిమ్డ్ మనీ... ఓ ఫిల్మ్ లెక్క!

చిత్రం: ‘లచ్చిందేవికో లెక్కుంది’
తారాగణం:  నవీన్‌చంద్ర, లావణ్యా త్రిపాఠీ, జయప్రకాశ్‌రెడ్డి, అజయ్, బ్రహ్మాజీ
కెమేరా: ఈశ్వర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
నిర్మాత: సాయిప్రసాద్ కామినేని
రచన, దర్శకత్వం: జగదీశ్ తలశిల
 
కొత్తదైన చిన్న కాన్సెప్ట్‌ను స్క్రిప్ట్‌గా రాసుకుం టున్నప్పుడు దాన్ని సూటిగా, సాఫీగా చెప్పడం ముఖ్యం. కొత్త దర్శకుడు, కొత్త కథనంతో అయిన ప్పుడు మరీ మరీ ముఖ్యం. ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ చూసినప్పుడు ఈ ఆలోచనలన్నీ కలు గుతాయి. మన బ్యాంకుల్లో ఎవరూ ఆపరేట్ చేయకుండా కొన్ని వేల ఖాతాలు ఉండిపోతు న్నాయి. వాటిల్లో ఎవరూ క్లెయిమ్ చేయని సొమ్ము వేల కోట్ల కొద్దీ మూలుగుతోంది. ఆ ‘అన్‌క్లెయిమ్డ్ మనీ’ చుట్టూ రాసుకున్న కథ ఇది.
 
‘జనతా బ్యాంక్ ఆఫ్ ఇండియా’లో కూడా అలాంటి ఖాతాలు, అన్‌క్లెయిమ్డ్ మనీ ఎక్కువే. ఆ బ్యాంకులో పనిచేస్తుంటుంది దేవి (లావణ్యా త్రిపాఠీ). అమ్మానాన్న ఆ బ్యాంకులో పనిచేసి, చనిపోవడంతో, తానూ అదే బ్యాంకులో చేరి, దాన్ని గుడిగా భావించే సిన్సియర్ ఉద్యోగి ఆమె. అదే బ్యాంక్‌లో ‘హెల్ప్ డెస్క్’లో పనిచేస్తుంటాడు నవీన్ (నవీన్‌చంద్ర). సిగరెట్టు, మందుతో ఎంజాయ్ చేస్తూ, జీవితంలో బోలెడంత డబ్బు సునాయాసంగా సంపాదించేయాలనేది అతని ఆశ. ఇంతలో ఆ బ్యాంక్‌లోని అన్‌క్లెయిమ్డ్ ఖాతాల్లోని సొమ్ము కోసం ఇద్దరు (అజయ్, భానుశ్రీ) ప్లాన్ చేస్తారు. ఆ ఖాతాల డేటా కోసం నవీన్‌కు అందులో పర్సంటేజ్ ఇస్తామని ఎర వేస్తారు.

ఆ డేటా బ్యాంక్ మేనేజర్ సోమయా జులు (జయప్రకాశ్ రెడ్డి), హీరోయిన్ దగ్గరే ఉంటుంది. అప్పటి దాకా తనను అసహ్యించు కుంటున్న హీరోయిన్‌ని సైతం డబ్బు కోసం ప్రేమ ముగ్గులోకి దింపుతాడు హీరో. ఆ డేటాను తీసుకెళ్ళి, అజయ్ బృందానికి ఇస్తాడు. వాటిలో అంకాళమ్మ, ఉమాదేవి - అనే రెండు ఖాతాల్లో ఉన్న భారీ మొత్తాన్ని డ్రా చేసుకోవడానికి అజయ్ బృందం బ్యాంకుకు వస్తుంది. తీరా, వాళ్ళిద్దరూ ఆ ఖాతాల వారసులు కాదనే విషయం బయట పడుతుంది. అక్కడికి ఇంటర్వెల్.
 
ఇక, అక్కడ నుంచి కథ ఎన్నెన్నో మలుపులు తిరుగుతుంది. ఈ అన్‌క్లెయిమ్డ్ మనీ కోసం మరో బ్యాచ్ (నర్రా శ్రీను బృందం) కూడా బ్యాంక్ చుట్టూ తిరుగుతుంటుంది. మరోపక్క బ్యాంక్‌ను కాపాడుకోవాలని హీరోయిన్ భావిస్తుంటుంది. ఇన్ని కోణాల మధ్య అసలు కథ ఎటు నుంచి ఎటు, ఎలా మలుపు తిరిగిందన్నది పాతకాలం సినిమా ప్రకటనల్లో చెప్పినట్లు... ‘వెండితెరపై చూసి తీరవలసినదే కానీ, చెప్పతరము కానిది!’
 
‘అందాల రాక్షసి’తో సక్సెస్‌ఫుల్ అనిపించు కున్న నవీన్‌చంద్ర, లావణ్యా త్రిపాఠీ కాంబినే షన్‌లో ఇది మరో సినిమా. నవీన్‌చంద్ర హీరో అయినా, నెగిటివ్, పాజిటివ్‌ల మధ్య ఊగిసలాడే చిత్రమైన ప్రొటాగనిస్ట్ పాత్ర అతనిది. పాత్ర, భిన్నమైన గెటప్‌లు, నటన పరంగా లావణ్యా త్రిపాఠీకే ప్రాధాన్యముంది. ఆమె ఆ బాధ్యతను నెరవేర్చడానికి వీలైనంత చేశారు. అందరి కన్నా బాగా పేరొచ్చేది - స్వయంగా ఓ పాట కూడా పాడిన జయప్రకాశ్ రెడ్డికి! మిగిలిన నటులదీ, సాంకేతిక నిపుణులదీ... యథోచిత భాగ స్వామ్యం. ‘‘పందికేం తెలుసు పెర్‌ఫ్యూమ్ వాసన’’ (హీరోయిన్), ‘‘మ్యాగీ తిని పెరిగామమ్మా! ఏదైనా టూ మినిట్స్!’’ (హీరో) లాంటి డైలాగ్స్ జనం ఎంజాయ్ చేస్తారు.

కీరవాణి 221వ మ్యూజికల్ మ్యాజిక్ ఈ సినిమా అన్నారు. మ్యాజిక్ మాటెలా ఉన్నా, పరిధి దాటిన ప్రయోగశీలత, సృజనాత్మకత పాటల్లో వినిపిస్తుంది. సెకండాఫ్‌లో ఒక దశ దాటాక అది మరీ పరవళ్ళు తొక్కింది. కమర్షియాలిటీ కోసం ఫస్టాఫ్‌లో మొదట్లోనే ఐటమ్ సాంగ్ పెట్టారు. ‘జనాన్ని వదిలేసినవాడు సన్న్యాసి... జనం వదిలేసిన వాడు సన్నాసి’ అంటూ ఫిలసాఫికల్ టోన్‌లో మొదలై, తెరపై ప్యాచ్‌లతో డ్యాన్సర్ల ఒంటిని సెన్సార్‌వారు కొంత కప్పిపెట్టాల్సొచ్చిన ఈ క్లబ్‌సాంగ్ మాస్‌కు నచ్చుతుంది.
 
దర్శకుడు రాజమౌళి దగ్గర సహాయకుడిగా గతంలో కొన్ని చిత్రాలకు పనిచేసిన జగదీశ్ తల శిలకు డెరైక్టర్‌గా ఇది తొలి సినిమా. కథ అల్లికలో, ఆచరణలో ఆ విషయం అర్థమవుతూ ఉంటుంది. వరుస ట్విస్టులతో స్క్రిప్టు అల్లుకుంటూ వచ్చిన దర్శకుడు వాటిని అర్థవంతంగా, అర్థమయ్యేలా చూసుకొంటే, ఇంకా బాగుండేదన్నది ఊహించని ట్విస్ట్.

టైటిల్స్ వేస్తున్నప్పుడే క్లిష్టమైన ఈ అన్ క్లెయిమ్డ్ మనీ కాన్సెప్ట్ అంతా నిమిషంలో వివరిం చేశారు. కాబట్టి, తెర తీసే సమయానికే హాలులో ఉండడం సామాన్యులకు శ్రేయస్కరం. అలాగే, సినిమాలో అనేక మలుపులు కాబట్టి, వాటన్నిటికీ క్లైమాక్స్ తరువాత మళ్ళీ హీరో, హీరోయిన్ల సంభాషణల్లో తెలిసేలా వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. కాబట్టి, ఆఖరు దాకా చూడా ల్సిందే. అందుకే, సినిమా నిడివి రెండు గంటల లోపే ఉండడం రిలీఫ్ అనిపించే విషయం.
 - రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement