
సాక్షి, సినిమా : సిల్వర్ స్క్రీన్ పై ఆడే చిత్రాలే కాదు.. షార్ట్ ఫిల్మ్స్ కూడా ఈ మధ్య వివాదాల్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా కోలీవుడ్‌లో విడుదలైన లక్ష్మీ షార్ట్ ఫిలింపై విమర్శలు వినిపిస్తున్నాయి. వివాహేతర సంబంధం కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ లక్ష్మీ ప్రియా చంద్రమౌళి వాటిపై మీడియా ముందుకు వచ్చి స్పందించారు.
ఓ ఛానెల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... సినిమా చాలా మందికి నచ్చింది. వ్యక్తిగతంగా ఆ విషయాన్ని వారు నాకు చెప్పారు. కానీ, వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకునేందుకు వెనకాడుతున్నారు. చిత్రంలో ఉన్న కంటెంట్ అభ్యంతరకరమని కొందరు వాదిస్తున్నారు. అది వారి అభిప్రాయం అయి ఉండొచ్చు. కానీ, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు తిట్టం సంస్కారం కాదు. మీకు నచ్చితే చూడండి. లేకపోతే చూడకండి అని ఆమె తెలిపారు.
సర్జున్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిలింలో చంద్రమౌళి, నందన్, లియో తదితరులు నటించగా.. సుందరమూర్తి సంగీతాన్ని అందించాడు. ఇదిగాక నివిన్ పౌలీ హీరోగా తెరకెక్కిన మళయాళ చిత్రం రిచీ లో లక్ష్మీ నటిస్తోంది.