అప్పుడు ఫోన్ ఆఫ్ చేస్తా..!
‘‘నా సినిమా హిట్టయినా ఫ్లాపయినా ఒకేలా స్వీకరిస్తా. నా నటన పట్ల నేను హ్యాపీగా లేనప్పుడు నిరాశ పడతా. హిట్టూ ఫ్లాపూ నా వృత్తి జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించవు. అయితే సినిమా రిలీజ్‌కు ముందు మాత్రం టెన్షన్ పడతా. అందుకే ఫోన్ స్విచ్చాఫ్ చేసేస్తా’’ అన్నారు లావణ్యా త్రిపాఠి. శర్వానంద్‌కు జోడీగా ఆమె నటించిన సినిమా ‘రాధ’. చంద్రమోహన్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సమర్పణలో భోగవల్లి బాపినీడు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజవుతోంది. లావణ్య చెప్పిన కబుర్లు...
♦ సినిమాలో హీరో పేరు, నా పేరు రాధే. పేరు రాధ అయినా హీరోలో కృష్ణుడి పోలికలు ఎక్కువ. ఏ సినిమా చేసేటప్పుడైనా నా పాత్రకు ఇంపార్టెన్స్ ఎంతనేది ఆలోచిస్తా. ఈ ‘రాధ’ చిత్రకథ, అందులో నా పాత్ర, హీరో... మూడూ నచ్చాయి. ఓ ట్విస్ట్ బాగా నచ్చడంతో ఈ సినిమా చేశా. మంచి సస్పెన్స్, డ్రామా ఉన్నాయి.
♦ ఈ రోజుల్లో కాలేజీ అమ్మాయిలు ఎలా ఉంటున్నారు? ఇంట్లో చాలా సైలెంట్. తమ సీక్రెట్స్ ఏవీ చెప్పరు. ఇంట్లోంచి బయటకు వస్తే... ఫ్రెండ్స్, పార్టీలు, అదంతా డిఫరెంట్ లైఫ్ సై్టల్! ఇందులో నా పాత్ర అలానే ఉంటుంది. పక్కా కమర్షియల్ కథానాయికగా కనిపిస్తా. గత సినిమాలతో పోలిస్తే... నా క్యారెక్టర్, యాక్టింగ్, లుక్, సాంగ్స్ ప్రతిదీ పక్కా కమర్షియల్. ఫస్టాఫ్‌లో హీరో నా వెంట పడతాడు. తర్వాత సీన్ మారుతుంది. అప్పుడు భలే భలేగా ఉంటుంది. నా క్యారెక్టర్‌లో కొంచెం కామెడీ టచ్ ఉంటుంది. సిచ్యుయేషనల్ కామెడీ సీన్లు ఎక్కువ కావడంతో మంచి హ్యూమర్ వర్కౌట్ అయింది.
♦ శర్వానంద్‌తో నటించడం లవ్లీ ఎక్స్‌పీరియన్స్. ప్రతి హీరోయిన్ ఇదే మాట చెబుతుంటారు (నవ్వుతూ). అయితే సెట్స్‌లో శర్వా ఎక్కువ మాట్లాడడు. సిగ్గు ఎక్కువ. నేను మాట్లాడుతూనే ఉండేదాన్ని. అందువల్ల తను కూడా మాట్లాడవలసి వచ్చేది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే... శర్వా చాలా ఫన్నీ. నటన పట్ల అంకితభావం ఎక్కువ. దర్శకుడు చెప్పింది చేసేస్తే చాలు అనుకునే టైప్ కాదు. ఎలా నటిస్తే బాగుంటుందని ఆలోచిస్తాడు. సీన్స్ ఇంప్రొవైజ్ చేసేవాడు. దర్శకుడు చంద్రమోహన్‌కు ఇది మొదటి సినిమా అయినా ఎంతో బాగా తీశారు.
♦ ప్రస్తుతం నాగచైతన్యకు జోడీగా ఓ సినిమా చేస్తున్నా. నాగార్జునగారితో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చేసిన తర్వాత ఇంత త్వరగా చైతూతో చేసే ఛాన్స్ వస్తుందనుకోలేదు. తండ్రీకొడుకులతో సినిమాలు చేస్తున్నాననే ఫీలింగ్ నాకు లేదు. ఎందుకంటే... ప్రేక్షకులు తెరపై పాత్రలను కేవలం పాత్రలుగానే చూస్తారని ఆశిస్తున్నా. ‘మనం’లో చైతూతో ఓ సీన్ చేశా. ఇప్పుడు తన సరసన హీరోయిన్‌గా చేస్తున్నా. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశానో లెక్కేసుకోలేదు. మంచి సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నాను. బహుశా... 50 సినిమాలు చేరువైతే లెక్కలు వేసుకుంటానేమో!