
ఆ సినిమాపై స్టార్ల ప్రశంసల జల్లు
చెన్నై: రొటీన్‌కి భిన్నంగా సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన క్షణం సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. అడవి శేష్ అద్భుత నటన, కట్టి పడేసే స్క్రీన్ ప్లే తో విమర్శకుల అభిమానాన్ని చూరగొన్న ఈ సినిమాపై టాలీవుడ్ దర్శకులు, నటీనటులు సహా పలువురు పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు రవితేజ, సుధీర్ బాబు, సందీప్ కిషన్, సుశాంత్ సహా నటి లక్ష్మి మంచు చిత్ర యూనిట్ ను అభినందనల్లో ముంచెత్తారు. అలాగే దర్శకులు వంశీ పైడిపల్లి, దాసరి మారుతి, సుజీత్ తదితరుల మన్ననలను సైతం క్షణం సినిమా దోచుకుంది. వీరంతా రవికాంత్, అడివి శేష్ కృషిని అభినందించారు. దీంతో అటు సినిమా భారీ విజయం, ఇటు సినీ పరిశ్రమ నుంచి వస్తున్న అభినందనల వెల్లువతో చిత్ర యూనిట్ సంబరాల్లో మునిగి తేలుతోంది. తనదైన ముద్రతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో శేష్ ఈ విజయంతో మరో ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
మరోవైపు ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లేను కూడా అందించిన హీరో అడివి శేష్, సినిమా సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ పెట్టుబడి తమకు వచ్చిందని.. దీనిపై మొత్తం యూనిట్ అంతా చాలా హ్యాపీగా ఉన్నట్టు తెలిపారు. సామాన్య ప్రేక్షకుల దగ్గర నుంచి సినీ పండితుల నుంచి వస్తున్న స్పందన తనకు ఆనందాన్నిస్తోందన్నారు. కాగా అక్కినేని నాగార్జున, మహేష్ బాబు కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం.
హాట్ యాంకర్ అనసూయ ప్రధాన పాత్రలో నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో సత్యం రాజేష్, రవి వర్మ, వెన్నెల కిశోర్ తదితరులు నటించారు. పీవీపీ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో అడవి శేష్‌కు జంటగా అదా శర్మ నటించింది. గత వారం రిలీజైన ఈ సినిమా సక్సెస్ టాక్ తో ఫర్ఫెక్ట్ థ్రిల్లర్గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.