'మద్రాస్ కేఫే' సినిమా రివ్యూ!
'మద్రాస్ కేఫే' సినిమా రివ్యూ!
Published Fri, Aug 23 2013 4:03 PM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
‘విక్కి డోనర్’తో సంచలన విజయం సాధించిన శుజిత్ సర్కార్, జాన్ అబ్రహంలు మళ్లీ ‘మద్రాస్ కేఫే’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈసారి రెగ్యులర్ బాలీవుడ్ మసాలా చిత్రంతో కాకుండా.. శ్రీలంక ప్రభుత్వానికి, తమిళుల మధ్య జరిగిన అంతర్యుద్ధం, భారత్‌లో మాజీ ప్రధాని హత్యకు కుట్ర ఎలా జరిగిందనే నేపథ్యంతో తెరకెక్కిన ‘మద్రాస్ కేఫే’ అనే చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెగ్యులర్ పొలిటికల్ డ్రామా తెరెకెక్కిన ‘మద్రాస్ కేఫే’ చిత్ర కథను పరిశీలిద్దాం!
ప్రత్యేక తమిళ ఈలం కోసం పోరాటం చేస్తున్న ఎల్‌టీఎఫ్‌కు శ్రీలంక ప్రభుత్వానికి మధ్య భీకరమైన దాడులు జరగడం, అందులో వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడాన్ని అడ్డుకోవడానికి భారత ప్రభుత్వం శాంతి సైన్యాన్ని ఆదేశానికి పంపిస్తుంది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల శాంతి సైన్యాన్ని భారత్ వెనక్కి ర ప్పిస్తుంది. శాంతి సైన్యం వల్ల తమకు అన్యాయం జరిగిందని భావించిన ఎల్‌టీఎఫ్ భారత ప్రభుత్వంపై పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ సమయంలోనే భారత్‌లో ఎన్నికలు రావడం.. ఆ ఎన్నికల్లో మాజీ ప్రధాని హత్యకు కుట్రపన్ని ఎలా చంపారనేదే ఈ చిత్ర కథ.
ఈ చిత్రంలో విక్రమ్ సింగ్ పాత్రలో జాన్ అబ్రహం ‘రా’ అధికారిగా నటించాడు. జాఫ్నాలో ఎల్‌టీ ఎఫ్ అధినేత అన్న ప్రభాకర్ అధిపత్యానికి గండి కొట్టడానికి జాఫ్నాకు పంపిన అధికారి పాత్రలో జాన్ అబ్రహం అద్బుతంగా నటించాడు. ఇప్పటి వరకు జాన్ చేసిన పాత్రలు ఒక ఎత్తు.. విక్రమ్ సింగ్ పాత్ర మరో ఎత్తు. ఈ చిత్రం ద్వారా జాన్ మీద మంచి నటుడి గా ముద్ర పడటం ఖాయం. మద్రాస్ కేఫే లాంటి విభిన్న కథా చిత్రానికి జాన్ అబ్రహం నిర్మాతగా వ్యవహరించడం మరో పెద్ద సాహసం. ఇక ఈ చిత్రంలో జయ అనే జర్నలిస్ట్ పాత్రలో బాలీవుడ్ తార నర్గీస్ ఫక్రీ నటించింది. శ్రీలంకలో యుద్ద వార్తలను కవరేజ్ చేసే బ్రిటిష్ జర్నలిస్టుగా నర్గీస్ అందరికీ గుర్తుండిపోతుంది. ఈ చిత్రంలో ఇంటలిజెన్స్ అధికారి ఆర్‌డీ పాత్రలో క్విజ్ మాస్టర్ సిద్దార్థ బసు నటించాడు. సిద్ధార్థ బసు నటనలో చక్కటి పరిణతి ప్రదర్శించి ఫుల్ మార్కులు కొట్టేశాడు.
శ్రీలంకలో జరిగిన వాస్తవ సంఘటనలను, యాక్షన్ సీన్లను ఊపిరి బిగపెట్టి చూసేంతగా దర్శకుడు శుజిత్ సర్కార్ తెరకెక్కించాడు. వినోదానికి తావులేని స్క్రిప్ట్‌ను దర్శకుడు తెరపై నడిపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. చిత్ర తొలి భాగంలో శ్రీలంక ప్రభుత్వానికి, తమిళుల మధ్య జరిగే పోరాటాలు సహజసిద్దంగా ఉన్నాయి. ద్వితీయ భాగంలో భారత మాజీ ప్రధాని హత్యకు కుట్ర, ఆ కుట్రను భగ్నం చేసేందుకు ఇంటలిజెన్స్ అధికారుల ప్రయత్నాలు, క్లైమాక్స్ చిత్రీకరణ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి. సంగీత దర్శకుడు శంతను మోయిత్రా, క మల్‌జీత్ నేగి ఫోటోగ్రఫి, చంద్రశేఖర్ ప్రజాపతి ఎడిటింగ్ ‘మద్రాస్ కేఫే’ను హైరేంజ్‌లో నిలిపాయి. ఈ చిత్రంలో కొన్ని లోపాలు ఉన్నా.. పెద్దగా పట్టించుకునే రేంజ్‌లో లేకపోవడం మద్రాస్ కేఫేకు కలిసి వచ్చే అంశం. యాక్షన్, పొలిటికల్ డ్రామా, థ్రిల్లర్ సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ‘మద్రాస్ కేఫే’ తప్పక నచ్చుతుంది.
Advertisement
Advertisement