మణిరత్నం,రామ్‌చరణ్‌ల ద్విభాషా చిత్రం
తమిళసినిమా: ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం నూతన చిత్రానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. కాట్రువెలియిడై చిత్రం తరువాత ఆ దర్శకుడు తదుపరి చిత్ర పనుల్లో మునిగిపోయారు. ఈ సారి భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. టాలీవుడ్ యువ కథానాయకుడు రామ్‌చరణ్, మాలీవుడ్ నటుడు ఫాహద్ పాజిల్‌ల కాంబినేషన్‌లో తమిళం, తెలుగు భాషల్లో చిత్రం చేయబోతున్నట్లు తాజా సమాచారం. రామ్‌చరణ్ ప్రస్తుతం రగస్థలం అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు.
దీని తరువాత మణిరత్నం దర్శకత్వంలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో ఇద్దరు కథానాయికలు ఉంటారని, అందులో ఒకరుగా కాట్రువెలియిడై చిత్రం ఫేమ్ అదిథిరావు నటించనున్నారట. మరో కథానాయకి ఎంపిక జరుగుతున్నట్లు తెలిసింది. కాగా మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలు కట్టనున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంతోష్‌శివన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. ఇంతకుముందు మణిరత్నం చిత్రాలు దళపతి, రోజా, ఇరువర్, ఉయిరే, రావణన్ చిత్రాలకు సంతోష్‌శివన్ చాయాగ్రహణం అందించారన్నది గమనార్హం. కాగా ఈ క్రేజీ చిత్రం సెప్టెంబర్‌లో సెట్ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.