
ఆమె ప్రేమలో పడింది!
తమిళసినిమా: నటి మంజిమామోహన్ ప్రేమలో పడింది. ఏమిటీ ఇది రీల్ న్యూసా? రియల్ న్యూసా? అనేగా మీ సందేహం. మంజిమామోహన్ నిజంగానే ప్రేమలో పడ్డారనే ప్రచారం కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అచ్చంయన్భదు మడమయడా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు అదే చిత్రం (సాహసం శ్వాసగా సాగిపో)తో టాలీవుడ్‌కూ పరిచయమైన మలయాళీ నటి మంజిమామోహన్. ఆ తరువాత విక్రమ్‌ప్రభుకు జంటగా క్షత్రియన్ చిత్రంలో నటించింది.
ప్రస్తుతం ఉదయనిధిస్టాలిన్‌తో ఇప్పడై వెల్లుమ్ చిత్రంలో నటిస్తోంది. అంతకుమించి అవకాశాలు లేని ఈ కేరళా కుట్టి ప్రస్తుతం పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయ్యిందట. ఇంతకీ ఈ బ్యూటీని మోహించిన ఆ వ్యక్తి ఎవరనే ఆసక్తి కలుగుతోంది కదూ ‘వేలైఇల్లా పట్టాదారి చిత్రంలో నటుడు ధనుష్‌కు తమ్ముడిగా నటించిన రిషీఖేష్‌తోనే మంజిమామోహన్ ప్రేమకలాపాలు సాగిస్తోందట. వీరిద్దరూ చెన్నైలోని కాఫీ షాపుల్లో తరచూ కలుచుకుంటున్నారంటూ సోషల్‌మీడియాలో ప్రచారం వైరల్‌గా మారింది. అయితే ఈ విషయం గురించి అటు మంజిమామోహన్ గానీ, ఇటు రిషీఖేష్ గానీ స్పందించలేదు. వారిలో ఎవరో ఒకరు రియాక్ట్ అయితే గానీ ఈ ప్రచారంలో నిజమెంత అన్నది తెలుస్తుంది.