జర్నలిస్టుకు క్షమాపణ చెప్పిన మోహన్‌లాల్‌ | Mohanlal Apologises To A Journalist Over His Response | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 17 2018 9:07 AM | Last Updated on Mon, Sep 17 2018 10:42 AM

Mohanlal Apologises To A Journalist Over His Response - Sakshi

తిరువనంతపురం: మాలీవుడ్‌ సూపర్ స్టార్‌ మోహన్‌లాల్‌ ఓ జర్నలిస్టు ప్రశ్నకు తాను స్పందించిన తీరుపై క్షమాపణ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. శనివారం కొచిలో కేరళ వరద బాధితుల సహాయర్థం విశ్వశాంతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మోహన్‌లాల్‌ హాజరయ్యారు. ఆ సమయంలో ఓ జర్నలిస్టు క్రైస్తవ నన్‌పై జరిగిన అత్యాచారం ఘటన గురించి స్పందించాల్సిందిగా మోహన్‌లాల్‌ను కోరారు. దీనిపై ఒకింత ఆగ్రహానికి లోనైనా మోహన్‌లాల్‌.. ఇలాంటి కార్యక్రమం జరగుతున్నప్పుడు అలాంటి ప్రశ్న అడగటం సిగ్గుగా లేదా అని ఆ జర్నలిస్టుపై విరుచుకుపడ్డారు. మీరు అడిగినదానికి, ఈ కార్యక్రమానికి ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు. మోహన్‌ లాల్‌ వ్యాఖ్యలు వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు ఆయన వ్యవహార శైలిపై సోషల్‌ మీడియాలో విమర్శల వర్షం కురిపించారు. 

దీంతో ఈ ఘటనపై మోహన్‌లాల్‌  ఆదివారం తన ఫేస్‌బుక్‌లో స్పందిచారు. ‘నా సమాధానం మిమ్మల్ని బాధించి ఉంటే.. నన్ను మీ పెద్ద అన్నగా భావించి నా క్షమాపణను స్వీకరించగలరు. ఒక వ్యక్తినిగానీ, సంస్థనిగానీ కించపరచాలనే ఉద్దేశంతో నేను ఆ వ్యాఖ్యలు చేయలేదు. వరద బాధితుల సహాయక చర్యల గురించి నేను మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ ప్రశ్న ఎదురైంది. మీరు అడిగిన ప్రశ్న ప్రస్తుతం చర్చించాల్సిన అంశమే.. కానీ నేను ఆ సమయంలో ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేను. ఓ మనిషిగా, కొడుకుగా నేను వేరే ఆలోచనల్లో ఉండటం వల్ల అటువంటి సమాధానం వచ్చి ఉంటుంద’ని మోహన్‌ లాల్‌ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. తన తల్లిదండ్రుల పేరిట మోహన్‌లాల్‌ విశ్వశాంతి ఫౌండేషన్‌ అనే ఎన్జీవోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement