డబ్బు నన్ను కొనలేదు
డబ్బు నన్ను కొనలేదు
Published Sat, Jan 4 2014 10:49 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్ బాసుల్లో ఒకడైన ఆమిర్‌ఖాన్ ఇటీవలి సినిమాలన్నీ కోట్లు కుమ్మరించవచ్చుగాక. అయితే ఆయనకు మాత్రం డబ్బుపై పెద్దగా మోజు లేదు. అన్నింటికంటే భావాలు, ఆలోచనలే తనకు ముఖ్యమని చెబుతున్నాడు మిస్టర్ ఫర్ఫెక్షనిస్ట్. ‘ఈరోజు వరకు డబ్బు కోసం నేనేప్పుడూ పనిచేయలేదు. నాకున్న బలాల్లో అదొకటి. ధనం నన్ను కొనలేదు’ అని చెప్పిన ఆమిర్ తాజా సినిమా ధూమ్ 3 దుమ్మురేపే విజయం సాధించడం తెలిసిందే. తన 25 ఏళ్ల సినీజీవితంలో ఇతడు ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు, పాత్రల్లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు. ప్రేమికుడు మొదలుకొని టీచర్, విలన్, గ్రామయువకుడు.. ఇలా అన్ని రకాలుగా వినోదం పంచాడు. ఏదైనా కథ విన్నప్పుడు అది భావేద్వేగాలు రేకెత్తిస్తేనే ఓకే అంటానని తెలిపాడు. ‘నాకు అసలు డబ్బే అవసరం లేదని కాదు. మనందరికీ అది కావాల్సిందే! నేను సంపాదించేది చాలా తక్కువ.
మనసు చెప్పేదే చేస్తాను కాబట్టే వేరే వాళ్ల కంటే తక్కువ ఆర్జించినా సంతోషంగా ఉండగలుగుతాను. కథ నచ్చకుంటే రూ.100 కోట్లు ఇచ్చినా వద్దంటాను. నా విలువలకు సరిపోని సినిమాలను తప్పకుండా తిరస్కరిస్తాను’ అని వినమ్రంగా చెప్పాడు. మనదేశంలోని గొప్ప నటుల్లో ఒకరైన ఆమిర్ సినీప్రయాణం 1988లో విడుదలైన ఖయామత్ సే ఖయామత్ తక్‌తో మొదలయింది. ఆ తరువాత వచ్చిన దిల్ హై కే మానతా నహీ, జో జీతా వొహీ సికందర్, హమ్ హై రాహీ ప్యార్ కే, రాజా హిందుస్థానీ, సర్ఫరోష్, లగాన్, తారే జమీన్ పర్, దోభీఘాట్ వంటి సినిమాలు, సత్యమేవ జయతే టీవీ షో ఆమిర్‌ను అత్యున్నతస్థాయికి తీసుకెళ్లాయి. రాజకీయాలపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ తనకున్న శక్తితో సమాజానికి సేవ చేస్తున్నానని, ఆ రంగంపై ఆసక్తి లేదని చెప్పాడు.
Advertisement
Advertisement