
తుపాకుల నీడలో 'ఎంఎస్‌జి'
వివాదాస్పద చిత్రం ‘ఎంఎస్‌జి’ శుక్రవారం దేశంలోని మూడు వేల థియేటర్లలో విడుదలైంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) బోర్డు చీఫ్ లీలా శామ్‌సన్ సహా మొత్తం బోర్డు సభ్యుల రాజీనామాకు దారితీయడంతో పాటు రాజకీయ దుమారాన్ని కూడా రేపిన వివాదాస్పద చిత్రం ‘ఎంఎస్‌జి’ శుక్రవారం దేశంలోని మూడు వేల థియేటర్లలో విడుదలైంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో ఒకేరోజు విడదలైన ఈ చిత్రం ప్రోమోలు, పాటలు గత కొంతకాలంగా సామాజిక వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తున్నాయి. డేరా సచ్చాసౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఈ చిత్రానికి దర్శక, నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా హీరోగా నటించి స్వయంగా పాటలు కూడా పాడారు.
హర్యానాతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఈ చిత్రం విడుదలైన థియేటర్ల వద్ద ముందస్తు చర్యగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా గొడవలు జరిగితే తక్షణమే స్పందించి వాటిని అదుపు చేసేందుకు ప్రత్యేక భద్రతా బందాలను రంగంలోకి దించారు. ఈ చిత్రం విడుదల నేపథ్యంలో హర్యానా రాష్ట్రమంతా అలెర్ట్ ప్రకటించారు. చండీగఢ్‌లోకి ప్రవేశించే అన్ని రోడ్లవద్ద చెక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులను చూపిస్తే తప్ప లోపలికి రానీయడం లేదు. ఓ చిత్రం విడుదల సందర్భంగా ఎన్నడూ ఇంతటి భద్రతను ఏర్పాటు చేయలేదని, ఇదే మొదటిసారని పోలీసు వర్గాలు తెలిపాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తుపాకుల నీడలో చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా కేంద్ర సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిందంటూ కొన్ని సిక్కు సంస్థలు గతంలో ధర్నాలు, ఆందోళనలు జరపడమే ఇందుకు కారణం.
వివాదానికి కారణాలివీ..
1. హత్యా, అత్యాచార కేసులను ఎదుర్కొంటున్న డేరా సచ్చా సౌదా చీఫ్ ఈ చిత్రాన్ని నిర్మించి నటించడం.
2. చిత్రం టైటిల్‌లో ‘దేవదూత’ అనే పేరు ఉండడం (సెన్సార్ బోర్డు సూచన మేరకు ఈ ట్యాగ్‌ను తొలగించారు)
3. చిత్రంలోని సిక్కు హీరో రాక్ స్టార్ లాంటి దుస్తులే కాకుండా విచిత్ర వేషధారణలో చిత్ర విచిత్ర దుస్తులు ధరించడం.
4. మహిమలు, మంత్రాలు ప్రదర్శించడం, లాజిక్కులేని జిమ్మిక్కులు చేయడం.
ఇలాంటి మరికొన్ని కారణాల వల్ల ఢీల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ తదితర ప్రాంతాల్లో చిత్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు చెలరేగాయి. ఈ చిత్రం విడుదలను ఎలా అనుమతించారంటూ సెన్సార్ బోర్డుపై రాజకీయ ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడికి వ్యతిరేకంగా సెన్సార్ బోర్డు చీఫ్ లీలా శామ్‌సన్ తొలుత రాజీనామా చేశారు. ఆమెకు సంఘీభావంగా మిగతా సభ్యులంతా రాజీనామా చేశారు. గతంలో సామాజిక స్పృహ కలిగిన పలు చిత్రాలకు అభ్యంతరాలు పెట్టిన సెన్సార్ బోర్డు భావప్రకటనా స్వేచ్ఛకు పెద్దపీట వేస్తూ ‘ఓ మై గాడ్, పీకే’ లాంటి చిత్రాలకు క్లియరెన్స్ ఇవ్వడం హర్షించాల్సిందేగదా!
ఇంతకు ఎంఎస్‌జీలో ఏముందంటే ఏమీ ఉండదు. 1980వ దశకంలో వచ్చిన మాల్ మసాలా లాంటి చిత్రమే. కానీ, ‘కొందరంటారు నన్ను సాధువని...సన్యాసని, మరికొందరు గురువంటారు. ఇంకొందరు సాక్షాత్తు భగవంతుడే అంటారు. ఎవరేమన్నా మామూలు మనిషిని నేను’లాంటి కొన్ని డైలాగులుంటాయి.