అక్కడికెళితే ఆనందమే ఆనందం!
చేతినిండా పని దొరికితే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. కానీ, ఆ ఆనందం తాలూకు అలసట పోవాలంటే కాస్త గ్యాప్ కావాలి. బిజీ బిజీగా సినిమాలు చేసే కాజల్ అగర్వాల్‌కి కొంచెం గ్యాప్ దొరికితే ఏం చేస్తారో తెలుసా? విహార యాత్ర ప్లాన్ చేసేసుకుంటారు. ఆ విషయం గురించి కాజల్ మాట్లాడుతూ - ‘‘నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. షూటింగ్స్ కోసం బోల్డన్ని ప్రయాణాలు చేస్తుంటాను. కానీ, ఏ బాధ్యతా లేకుండా కేవలం ఎంజాయ్‌మెంటే లక్ష్యంగా హాలిడే ట్రిప్స్‌కి వెళతాం చూడండి..
అవంటే చాలా ఇష్టం. షూటింగ్స్‌కి బ్రేక్ దొరికితే ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటాను. వీలైనన్ని ఎక్కువ దేశాలు వెళ్లాలనుకుంటాను. కొత్త మనుషులను కలిసినప్పుడు కొత్త విషయాలు తెలుస్తాయి. అలాగే, కొత్త పరిసరాలు మనకు తెలీయకుండా కొత్త ఎనర్జీనిస్తాయి. నాకు బాగా ఇష్టమైన హాలిడే స్పాట్ ఇండోనేషియాలోని బాలి. అక్కడి వాతావరణం, మనుషులు ఇష్టం. ఫుడ్ కూడా బాగుంటుంది. అందుకే, అక్కడికెళ్లినప్పుడు, ‘ఇంతకు మించిన ఆనందం ఎక్కడ దొరుకుతుంది’ అనిపిస్తుంది’’ అన్నారు.