సంగీతం తప్ప నాకు వేరే ప్రపంచం తెలీదు : రాహుల్ నంబియార్
రాహుల్ నంబియార్ గానంలో గమ్మత్తు ఉంటుంది. దక్షిణాది శ్రోతలకు ఆయన్ను దగ్గర చేసింది అదే. ‘దూకుడు’లో ‘గురువారం మార్చి ఒకటి’, ‘సీతమ్మవాకిట్లో...’ లో ‘ఓఓఓ అమ్మాయీ’... ఇలా చెప్పుకుంటూ పోతే... రాహుల్ నంబియార్ హిట్ సాంగ్స్ ఎన్నో. గాయకునిగా బిజీగా ఉన్న రాహుల్... సామాజిక స్పృహతో తానే సొంతంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఓ మ్యూజికల్ ఆల్బమ్ రూపొందించారు. దాని తెలుగు వెర్షన్ పేరు ‘చెత్త’. మంగళవారం హైదరాబాద్‌లో సంగీత దర్శకుడు తమన్ చేతుల మీదుగా ఈ ఆల్బమ్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా రాహుల్ నంబియార్‌తో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్‌వ్యూ.
‘చెత్త’ అనగానే ఎవరికైనా నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది. ఆ టైటిల్ ఎందుకు పెట్టారు. నరేంద్రమోదీ ‘స్వచ్ఛ భారత్’ స్లోగన్ దీనికి ప్రేరణా?
లేదు..లేదు.. నేను ఈ ఆల్బమ్ ప్రారంభించి రెండేళ్లయ్యింది. మోదీ వీధుల్లో చెత్తను శుభ్రం చేసి దేశాన్ని శుభ్రంగా ఉంచమని చెబుతున్నారు. జనహృదయాల్లో ఉన్న చెత్తను తొలగించుకోమని నేను నా వీడియో ద్వారా చెబుతున్నాను. కేవలం ఇంట్రస్ట్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే ‘చెత్త’ అని పేరు పెట్టాను. ఇక్కడ చెత్త అంటే మానవ సంబంధాల్లోని సమస్యలు. చిన్న చిన్న సమస్యలను ప్రతి ఒక్కరు హృదయాల్లో దాచుకుంటారు. వాటిని నిర్భయంగా బయట పెట్టేస్తే, జీవితం నిశ్చింతగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. నా ‘చెత్త’ ఆల్బమ్ లక్ష్యం అదే. తెలుగు వెర్షన్‌కి అనంత శ్రీరాం సాహిత్యాన్ని అందించారు.
ఓసారి మీ ఫ్లాష్‌బ్యాక్‌లోకెళ్దాం... సంగీతం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి?
బాల్యం నుంచే సంగీతమంటే నాకు ప్రాణం. ఎంకామ్, ఎంబీఏ చదువుకున్నాను. పాటల కోసం బ్యాంక్ ఉద్యోగాన్నీ వదిలేశాను. మణి శర్మగారు గాయకునిగా నాకు తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, తమన్ వెన్నుతట్టారు. సంగీతం త ప్ప నాకు వేరే ప్రపంచం తెలీదు.
క్లాసికల్ నేర్చుకున్నారా?
ఏడాది పాటు నేర్చుకున్నాను. నాకు గురువు అంటూ ప్రత్యేకించి చెప్పడానికి ఎవరూ లేరు. ఎక్కువగా వినడం ద్వారానే సంగీతం నాకు అబ్బింది. కిశోర్ కుమార్, ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఏసుదాస్ పాటలంటే ప్రాణం. వాళ్లే నాకు ప్రేరణ.
ఇప్పటివరకూ ఎన్ని పాటలు పాడి ఉంటారు?
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం కలిపి దాదాపు 500 పాటలు పాడి ఉంటాను. అయితే... ఎక్కువ పాటలు మాత్రం తెలుగులోనే పాడాను. ‘గురువారం మార్చి ఒకటి’(దూకుడు).. ‘తూ ఆజా సరోజా’(ఆగడు).. ‘ఇలా ఎంతసేపు’ (శశిరేఖాపరిణయం) ఇలా నాకు పేరు తెచ్చిన పాటలు చాలానే ఉన్నాయి.
ప్రస్తుతం వస్తున్న పాటలు సంతృప్తినిస్తున్నాయా?
ట్రెండ్ డిఫరెంట్‌గా ఉందండీ. మనం కూడా దాన్నే ఫాలో అవ్వాలి. మనకు నచ్చని పాట హిట్ కావచ్చు. దాంట్లో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుని.. ఫాలో కావాల్సిన అవసరం ఉంది.
పాతపాటలు గొప్పవనీ, కొత్తపాటలకు లాంగ్విటీ ఉండదనీ వినిపిస్తున్న విమర్శలను ఏకీభవిస్తారా?
కచ్చితంగా పాత పాటలు గొప్పవే. వాటిల్లో గొప్ప మెలోడి ఉంటుంది. సౌండ్, మెలోడి సమ్మిళితం కొత్త పాటలు. పాటలు వినడానికి కొత్తగా సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ ద్వారా శ్రోతలకు పాట సులభంగా చేరుతోంది. అప్పట్లో ఈ సౌలభ్యం లేదు. అయినా సరే.. ఇప్పటికీ ఆ పాత మధురాలనే శ్రోతలు ఎంజాయ్ చేస్తున్నారంటే.. కచ్చితంగా అవి గొప్పవే.
మ్యూజిక్ డెరైక్షన్ చేసే అవకాశం ఉందా?.
మ్యూజిక్ డెరైక్షన్ కష్టమైన పని. మణిశర్మ సార్, తమన్ కష్టపడే తీరు చూస్తున్నాను. అది వేరే ప్రపంచం.
ఫలానా వారి మ్యూజిక్ డెరైక్షన్‌లో పాడాలనే కోరిక ఏమైనా మిగిలి ఉందా?
ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాడాలనుంది. ఇప్పటి వరకు ఆయనతో పనిచేయలేదు.