
నీచరాజకీయాలపై అస్త్రం ‘రాజ్యాధికారం’
రాజాం రూరల్: అటు రాష్ట్రం.. ఇటు కేంద్రంలో అక్రమ పొత్తులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న నాయకుల నీచరాజకీయాలను ప్రజలను వివరించడానికే ‘రాజ్యాధికారం’ సినిమా తీస్తున్నామని సినీ దర్శక నిర్మాత ఆర్.నారాయణమూర్తి చెప్పారు. సినిమా షూటింగ్ కోసం శ్రీకాకుళం జిల్లా రాజాం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
దేశ సంస్కృతికి పట్టుకొమ్మలైన పల్లె సీమల్లో నేతలు వైషమ్యాలు రేపుతున్నారని, ఎన్నికల అనంతరం తమ దారి తాము చూసుకుని ఓటర్లను ఘోరంగా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారికి ఓటుతో బుద్ధి చెప్పి ప్రజాస్వామ్యాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియజేయడానికి రాజ్యాధికారం సినిమా దోహదపడుతుందన్నారు.
సీమాంధ్రకు రాజధానిగా విశాఖపట్నాన్ని ఎంపిక చేస్తే అన్ని ప్రాంతాల వారికి మేలు చేకూరుతుందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఇక్కడ సముద్ర తీరప్రాంతంతోపాటు అధికంగా మైదాన ప్రాంతం ఉందని, దీనివల్ల త్వరితగతిన అభివృద్ధి చెందవచ్చని తెలిపారు. సినీరంగానికి కూడా విశాఖపట్నం అనువైన ప్రాంతమని అన్నారు.