
నాన్ అవళై సందిత్త పోదు
పాత నీరు పోతుంటే కొత్త నీరు వస్తుందన్నది సామెత. అయితే కోలీవుడ్‌లో పాత నీరు నిలకడగా, నిండుగా ఉన్నా, కొత్త నీరు ప్రవహిస్తూనే ఉంది. ఇక యువ తారలు నిలదొక్కుకుంటూనే ఉన్నారు. అలా కథై తిరైక్కథై వచనం ఇయక్కమ్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన సంతోష్ కోలీవుడ్‌లో అవకాశాలను రాబట్టుకుంటున్నారు.
తాజాగా నటించనున్న చిత్రం నాన్ అవళై సందిత్త పోదు. ఇందులో అతనికి జంటగా సిద్ధూ+2, అంబు, నయాపుడై తదితర చిత్రాల నాయకి చాందిని నటించనుంది. దీనిని సినీ ప్లాట్‌ఫాం పతాకంపై వీటీ.రితీష్‌కుమార్ నిర్మించనున్నారు. దీనికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని ఎల్‌జీ.రవిచంద్రన్ నిర్వహించనున్నారు.
ఈయన ఇంతకు ముందు మాసాణి, ఐందామ్ తలైమురై సిద్ధ వైద్ది శిఖామణి చిత్రాలను తరకెక్కించారన్నది గమనార్హం. నాన్ అవళై సందిత్త పోదు చిత్రం వైవిధ్య ప్రేమ కథా చిత్రంగా రూపొందనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.