ముందు చర్చిలో...తర్వాత గుళ్లో!
నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఈ నెల 11న విడుదలవు తోంది. ‘ఏ మాయ చేసావె’ తర్వాత చైతూ, గౌతమ్ మీనన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. చైతూ చెప్పిన విశేషాలు...
నేను కాదు.. సమంతే!
► నా కంటే ముందు తమ్ముడు అఖిల్ పెళ్లి జరగడం హ్యాపీ (నవ్వుతూ) అందరి దృష్టి అఖిల్‌పై ఉంటుంది కదా! ఆ తర్వాత నేను హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. తమ్ముడి పెళ్లి రోమ్, ఇటలీలో జరగనుందనేది నిజమే. నా పెళ్లి ఇండియాలోనే ఉంటుంది. అయితే... చెన్నైలోనా? హైదరాబాద్‌లోనా? అనేది ఇప్పుడే చెప్పలేను. ‘ఏ మాయ చేసావె’ స్టైల్‌లో ముందు చర్చిలో, ఆ తర్వాత గుడిలో మా పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో!
► పెళ్లికి ముందు, తర్వాత.. ఎప్పుడైనా మంచి కథ వస్తే సమంతతో కలసి నటించడానికి నేను రెడీ.
► ‘చైతన్య- మస్కతి ఐస్‌క్రీమ్ - వర్క్... లేకుండా నేనుండలేను’ అన్నారు సమంత. మీకు ఐస్‌క్రీమ్ అంటే ఇష్టమేనా? అనడిగితే.. ‘లేదండీ! నేను కాదు.. సమంతే ఐస్‌క్రీమ్‌లకు పెద్ద ఫ్యాన్’ అని చైతూ చెప్పారు.
► సాదాసీదా కుర్రాడు అనూహ్యంగా ఓ ఆపదలో చిక్కుకుంటే... ఏం చేస్తాడు? అని గౌతమ్ మీనన్‌కు వచ్చిన ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. ఫస్టాఫ్ ‘ఏ మాయ చేసావె’ తరహాలో, సెకండాఫ్ యాక్షన్ థ్రిల్లర్‌లా ఉంటుంది. నా పాత్రతో పాటు ప్రేక్షకుడు ప్రయాణం చేసేలా దర్శకుడు ఈ సినిమాను తీశారు.
► ‘ఏ మాయ చేసావె’ టైమ్‌లో ఎక్కువ టేకులు తీసుకునేవాణ్ణి. నటుడిగా గత ఐదేళ్లలో కాస్త మెచ్యూరిటీ వచ్చింది (నవ్వుతూ...). ఇప్పుడాయనను అంత ఇబ్బంది పెట్టలేదనుకుంటున్నా. విడుదల ఆలస్యమైనా నిర్మాత రవీందర్ రెడ్డి ఎంతో సహకరించారు.
► నా నటనలో మెచ్యూరిటీ లేకపోవడమో, కథలు బాగోలేదో.. గతంలో నేను చేసిన యాక్షన్ సినిమాలు సరిగా ఆడకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఇందులో ఫోర్డ్స్ యాక్షన్ ఏమీ ఉండదు. రియలిస్టిక్ యాక్షన్ మూవీ. వ్యక్తిగతంగా నాకు ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం. దీంతో నాకు కొత్త ఇమేజ్ వస్తుందని ఆశిస్తున్నా.
► కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నటించబోయే సినిమా షూటింగ్ నేడు మొదలవుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్‌లో చేయబోయే సినిమాకి ‘జెంటిల్‌మన్’ రచయిత డేవిడ్ నాథన్ కథ అందిస్తున్నారు. ‘హలో బ్రదర్’ సినిమాను రీమేక్ చేయకపోవడమే మంచిది.