Manzil Mohan
-
విష్ణువిశాల్‌తో మంజిమా మోహన్
యువ నటుడు విష్ణువిశాల్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతోంది నటుడు శింబు హీరోయిన్ . మాలీవుడ్ ముద్దుగుమ్మ మంజిమా మోహన్ శింబు హీరోగా నటించిన అచ్చంయన్బదు మడమైయడా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రం మంచి ప్రేక్షకాదరణను పొందడంతో ఈ అమ్మడికి ఇక్కడ అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్‌ప్రభుకు జంటగా క్షత్రియన్ చిత్రంలోనూ, ఉదయనిదిస్టాలిన్ సన ఇప్పడై వెల్లుమ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇందులో క్షత్రియన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తాజాగా విష్ణువిశాల్‌తో డ్యూయెట్లు పాడడానికి మంజిమామోహన్ మాచారం. విష్ణువిశాల్ ప్రస్తుతం కథానాయకన్ అనే చిత్రాన్ని సొంతంగా నిర్మిస్తూ, హీరోగా నటిస్తున్నారు. ఇందులో క్యాథరిన్ ట్రెసా నాయకి. మురుగానందం దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దివంగత మహానటుడు శివాజీగణేశన్ మనవడు, నటుడు దుష్యంత్ సొంతంగా ఈశన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్రం నిర్మాణం చేపట్టి ఇప్పటికే కాళిదాస్ జయరాం, ప్రభు ప్రధాన పాత్రలు పోషించిన మీన్ కుళంబుం మణŠ పానయం చిత్రాన్ని నిర్మించారు.తాజాగా మరో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అయ్యారు. ఇందులో విష్ణువిశాల్ హీరోగా నటించనున్నారు. ఆయనకు జంటగా మలయాళ కుట్టి మంజిమామోహన్ నాయకిగా ఎంపికైంది.ఈ విషయాన్ని చిత్ర హీరో విష్ణువిశాల్ ధ్రువపరిచారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
చక్రం తిప్పుతోన్న రాధిక!
ఆడవాళ్లు ద్విచక్ర వాహనం నడిపితే విచిత్రంగా చూస్తారు. కారు నడిపినా అంతే. ఏకంగా బస్సు నడిపితే అదో పెద్ద వింతలా చూస్తారు. ఈ మధ్య నటి రాధికను చాలామంది అలానే చూశారు. గిర గిరా స్టీరింగ్ తిప్పుతూ రాధిక బస్సు నడిపారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఇప్పడి వెల్లుమ్’. ఇందులో రాధిక బస్సు డ్రైవర్ పాత్రలో కనిపిస్తారు. ఉదయనిధి స్టాలిన్, మంజిమా మోహన్ జంటగా గౌరవ్ నారాయణన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రం నిర్మిస్తోంది. బస్సు నడపడమంటే ఆషామాషీ వ్యవహారం కాదుగా. అందుకని, సినిమా చిత్రీకరణ ప్రారంభానికి ముందే నిపుణుల సమక్షంలో రాధికా బస్సు నడపడంలో శిక్షణ తీసుకున్నారు. ఎంతో పట్టుదలగా రెండు వారాల్లో నేర్చేసుకున్నారు. తక్కువ టైమ్‌లో మేడమ్ బస్సు నడపడం చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యానికి లోనయ్యారట. మరి.. రాధికా మజాకా! -
ముందు చర్చిలో...తర్వాత గుళ్లో!
నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఈ నెల 11న విడుదలవు తోంది. ‘ఏ మాయ చేసావె’ తర్వాత చైతూ, గౌతమ్ మీనన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. చైతూ చెప్పిన విశేషాలు... నేను కాదు.. సమంతే! ► నా కంటే ముందు తమ్ముడు అఖిల్ పెళ్లి జరగడం హ్యాపీ (నవ్వుతూ) అందరి దృష్టి అఖిల్‌పై ఉంటుంది కదా! ఆ తర్వాత నేను హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు. తమ్ముడి పెళ్లి రోమ్, ఇటలీలో జరగనుందనేది నిజమే. నా పెళ్లి ఇండియాలోనే ఉంటుంది. అయితే... చెన్నైలోనా? హైదరాబాద్‌లోనా? అనేది ఇప్పుడే చెప్పలేను. ‘ఏ మాయ చేసావె’ స్టైల్లో ముందు చర్చిలో, ఆ తర్వాత గుడిలో మా పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో! ► పెళ్లికి ముందు, తర్వాత.. ఎప్పుడైనా మంచి కథ వస్తే సమంతతో కలసి నటించడానికి నేను రెడీ. ► ‘చైతన్య- మస్కతి ఐస్‌క్రీమ్ - వర్క్... లేకుండా నేనుండలేను’ అన్నారు సమంత. మీకు ఐస్‌క్రీమ్ అంటే ఇష్టమేనా? అనడిగితే.. ‘లేదండీ! నేను కాదు.. సమంతే ఐస్‌క్రీమ్‌లకు పెద్ద ఫ్యాన్’ అని చైతూ చెప్పారు. ► సాదాసీదా కుర్రాడు అనూహ్యంగా ఓ ఆపదలో చిక్కుకుంటే... ఏం చేస్తాడు? అని గౌతమ్ మీనన్‌కు వచ్చిన ఆలోచన నుంచి పుట్టిన కథ ఇది. ఫస్టాఫ్ ‘ఏ మాయ చేసావె’ తరహాలో, సెకండాఫ్ యాక్షన్ థ్రిల్లర్‌లా ఉంటుంది. నా పాత్రతో పాటు ప్రేక్షకుడు ప్రయాణం చేసేలా దర్శకుడు ఈ సినిమాను తీశారు. ► ‘ఏ మాయ చేసావె’ టైమ్‌లో ఎక్కువ టేకులు తీసుకునేవాణ్ణి. నటుడిగా గత ఐదేళ్లలో కాస్త మెచ్యూరిటీ వచ్చింది (నవ్వుతూ...). ఇప్పుడాయనను అంత ఇబ్బంది పెట్టలేదనుకుంటున్నా. విడుదల ఆలస్యమైనా నిర్మాత రవీందర్ రెడ్డి ఎంతో సహకరించారు. ► నా నటనలో మెచ్యూరిటీ లేకపోవడమో, కథలు బాగోలేదో.. గతంలో నేను చేసిన యాక్షన్ సినిమాలు సరిగా ఆడకపోవడానికి చాలా కారణాలున్నాయి. ఇందులో ఫోర్డ్స్ యాక్షన్ ఏమీ ఉండదు. రియలిస్టిక్ యాక్షన్ మూవీ. వ్యక్తిగతంగా నాకు ఇలాంటి సినిమాలు చాలా ఇష్టం. దీంతో నాకు కొత్త ఇమేజ్ వస్తుందని ఆశిస్తున్నా. ► కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నటించబోయే సినిమా షూటింగ్ నేడు మొదలవుతోంది. సురేశ్ ప్రొడక్షన్స్‌లో చేయబోయే సినిమాకి ‘జెంటిల్మన్’ రచయిత డేవిడ్ నాథన్ కథ అందిస్తున్నారు. ‘హలో బ్రదర్’ సినిమాను రీమేక్ చేయకపోవడమే మంచిది. -
రామ్‌చరణ్ చాన్స్ ఇస్తే...
‘‘హీరో హీరోయిన్లు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమకు ఓ సమస్య వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించడానికి హీరో ఎలాంటి సాహసం చేశాడనేది మా సినిమా’’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఈ నెల 11న విడుదలవుతోంది. రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ - ‘‘దర్శకుడు కావాలని వచ్చా. కొన్నాళ్లు సహాయ దర్శకుడిగా చేశా. దర్శకులు శ్రీవాస్‌తో మంచి అనుబంధం ఉంది. ‘డిక్టేటర్’ షూటింగ్లో ఆయనను కలసినప్పుడు కోన వెంకట్ ‘సాహసం శ్వాసగా సాగిపో’ గురించి చెప్పారు. కథ నచ్చడంతో నిర్మాతగా మారా. ఫస్టాఫ్‌లో అందమైన ప్రేమకథ, సెకండాఫ్‌లో థ్రిల్లింగ్ యాక్షన్ ఉంటాయి. ‘ప్రేమమ్’ హిట్ తర్వాత చైతూ నుంచి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అదే స్థాయిలో అలరిస్తుంది. రామ్‌చరణ్‌తో సినిమా చేయాలనేది నా కోరిక. ఆయన చాన్స్ ఇస్తే కచ్చితంగా చేస్తా. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా నిర్మిస్తున్నా. ఫిబ్రవరిలో గోపీచంద్‌తో ఓ సినిమా ఉంటుంది. విజయ్ ఆంటోని ‘యమన్’ను తెలుగులో రిలీజ్ చేస్తున్నా. తమిళ ‘ఈట్టి’ రీమేక్ రైట్స్ తీసుకున్నాం’’ అన్నారు. -
క్యాష్ కంటే...క్యారెక్టర్ ముఖ్యం!
నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్న మలయాళ బ్యూటీ మంజిమా మోహన్ చెప్పిన ముచ్చట్లు... ► నాన్న విపిన్ మోహన్ ప్రముఖ మలయాళీ సినిమాటోగ్రాఫర్. ఆయన వల్లే యాక్టర్నయ్యా. నాన్నతో కలసి ఓరోజు షూటింగ్‌కి వెళ్లా. చిన్న అమ్మాయి ఎవరో రాలేదు. నాన్న చెప్పినట్టు కెమేరా ముందు పరిగెత్తాను. అలా మూడేళ్ల వయసులోనే తొలిసారి నటించా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 8 సినిమాలు చేశా. ► నాన్నకు నేను హీరోయిన్ కావడం ఇష్టం లేదు. ఇండస్ట్రీ గురించి ఆయనకు బాగా తెలుసు. హీరోయిన్లు ఎలాంటి కష్టాలు పడతారు, వాళ్ల ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసు. బహుశా.. నా కూతురుకి అటువంటి కష్టాలెందుకు? అని వద్దన్నారేమో! (నవ్వుతూ..) చివరకు, ‘నీ ఇష్టాన్ని కాదనను. కానీ, ముందు డిగ్రీ కంప్లీట్ చేయ్’ అన్నారు. ► ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే మలయాళ సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యా. ఆ సినిమా ట్రైలర్ చూసి గౌతమ్ మీనన్ ఆడిషన్‌కి పిలిచారు. తమిళ సినిమాకే నన్ను సెలెక్ట్ చేశారనుకున్నా. అగ్రిమెంట్ మీద సంతకం చేసేటప్పుడు తమిళం, తెలుగు - రెండు భాషల్లో అని అర్థమైంది. చెన్నైలో చదివా కాబట్టి తమిళ్ వచ్చు. తెలుగు రాదు. సో, తెలుగులో నటించలేనని చెప్పా. గౌతమ్ మీనన్ నువ్వు చేయగలవని ప్రోత్సహించారు. నిజానికి, ‘ఏ మాయ చేసావె’ విడుదలైన తర్వాత ఓ కెఫేకి వెళ్లా. అక్కడికి గౌతమ్ మీనన్ వచ్చారు. నేను ఎగ్జయిటయ్యా. కానీ, ఏదో ఒక రోజు ఆయన సినిమాలో నటిస్తానని అనుకోలేదు. నాగచైతన్య వెరీ ఫ్రెండ్లీ కో-స్టార్. ► ఓసారి చేసిన సీన్లో మళ్లీ సేమ్ ఫీలింగ్‌తో నటించడం చాలా కష్టం. రెండు భాషల్లో డైలాగులను గుర్తు పెట్టుకోవాలి. షూటింగ్‌కి ఓ రోజు ముందు తెలుగు డైలాగ్స్ నేర్చుకునేదాన్ని. తమిళ్ సీన్ షూట్ చేసిన తర్వాత తెలుగు తీసుంటే బాగుండేదేమో! కానీ, ఫస్ట్‌డే చైతన్యతో ఓ సీన్ షూట్ చేశాం. రెండో రోజు శింబుతో తమిళ్ సీన్ షూటింగ్... సినిమా అంతా ఇంతే. ► క్యాష్ కంటే సినిమాలో నా క్యారెక్టర్ ముఖ్యం. కమర్షియల్ సినిమాలు కూడా ముఖ్యమే. నాకు అసౌకర్యంగా అనిపించే సినిమాలు చేయను. గ్లామర్ పేరుతో చిట్టిపొట్టి బట్టలు వేసుకోవడం నాకిష్టం లేదు. -
మల్టీ స్టారర్ చిత్రానికి ముహూర్తం
ప్రస్తుతం తమిళ చిత్రపరిశ్రమ భిన్న చిత్రాల మయంగా మారింది. ఒక పక్క హారర్ చిత్రాల దాడి కొనసాగుతోంది. మరో పక్క 2.ఓ లాంటి బ్రహ్మాండ చిత్రాల రూపకల్పన, ఇంకో పక్క హీరోల ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయంతో మంచి కమర్షియల్ చిత్రాల నిర్మాణాలు తెరకెక్కుతున్నాయి.అలాంటి వాటికి మధ్య తాజాగా ఒక మల్టీస్టారర్ చిత్రం ఆరంభం కానుంది. అదే యువ నటులు ఉదయనిధిస్టాలిన్, విష్ణువిశాల్ కలసి నటించనున్న చిత్రం.సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు మన్మదన్ అండు,7ఆమ్ అరివు,ఒరుకల్ ఒరు కన్నాడి వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఉదయనిధిస్టాలిన్ రెడ్‌జెయింట్ సంస్థ నిర్మిస్తున్న 12వ చిత్రం ఇది. ఇందులో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మలయాళ కుట్టి మంజిమా మోహన్ నటిస్తోంది. ఈమె ఇప్పటికే శింబుతో అచ్చం ఎంబది మడమయడా చిత్రంలో నటించిందన్నది గమనార్హం. విష్ణువిశాల్‌తో మేఘా ఆకాశ్ రొమాన్స్ చేయనుంది. ఈ అమ్మడు ఇప్పటికే బాలాజీ ధరణీ ధరణ్ దర్శకత్వం వహిస్తున్న ఒరు పక్క కథై చిత్రంలో నాయకిగా నటిస్తోంది. ఈ మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ సోమవారం మొదలైంది.దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని, మది చాయాగ్రహణం, కాశీవిశ్వనాథన్ కూర్పు బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. మంచి కథ లభిస్తే ఉదయనిధిస్టాలిన్‌తో చేయాలన్న ఆకాంక్ష ఈ చిత్రంతో నెరవేరుతోందని దర్శకుడు సుశీంద్రన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.