చక్రం తిప్పుతోన్న రాధిక!
ఆడవాళ్లు ద్విచక్ర వాహనం నడిపితే విచిత్రంగా చూస్తారు. కారు నడిపినా అంతే. ఏకంగా బస్సు నడిపితే అదో పెద్ద వింతలా చూస్తారు. ఈ మధ్య నటి రాధికను చాలామంది అలానే చూశారు. గిర గిరా స్టీరింగ్ తిప్పుతూ రాధిక బస్సు నడిపారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘ఇప్పడి వెల్లుమ్’. ఇందులో రాధిక బస్సు డ్రైవర్ పాత్రలో కనిపిస్తారు. ఉదయనిధి స్టాలిన్, మంజిమా మోహన్ జంటగా గౌరవ్ నారాయణన్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రం నిర్మిస్తోంది.
బస్సు నడపడమంటే ఆషామాషీ వ్యవహారం కాదుగా. అందుకని, సినిమా చిత్రీకరణ ప్రారంభానికి ముందే నిపుణుల సమక్షంలో రాధికా బస్సు నడపడంలో శిక్షణ తీసుకున్నారు. ఎంతో పట్టుదలగా రెండు వారాల్లో నేర్చేసుకున్నారు. తక్కువ టైమ్‌లో మేడమ్ బస్సు నడపడం చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యానికి లోనయ్యారట. మరి.. రాధికా మజాకా!