రామ్‌చరణ్ చాన్స్ ఇస్తే...
‘‘హీరో హీరోయిన్లు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమకు ఓ సమస్య వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించడానికి హీరో ఎలాంటి సాహసం చేశాడనేది మా సినిమా’’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఈ నెల 11న విడుదలవుతోంది. రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ - ‘‘దర్శకుడు కావాలని వచ్చా. కొన్నాళ్లు సహాయ దర్శకుడిగా చేశా. దర్శకులు శ్రీవాస్‌తో మంచి అనుబంధం ఉంది. ‘డిక్టేటర్’ షూటింగ్‌లో ఆయనను కలసినప్పుడు కోన వెంకట్ ‘సాహసం శ్వాసగా సాగిపో’ గురించి చెప్పారు. కథ నచ్చడంతో నిర్మాతగా మారా.
ఫస్టాఫ్‌లో అందమైన ప్రేమకథ, సెకండాఫ్‌లో థ్రిల్లింగ్ యాక్షన్ ఉంటాయి. ‘ప్రేమమ్’ హిట్ తర్వాత చైతూ నుంచి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను అదే స్థాయిలో అలరిస్తుంది. రామ్‌చరణ్‌తో సినిమా చేయాలనేది నా కోరిక. ఆయన చాన్స్ ఇస్తే కచ్చితంగా చేస్తా. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సినిమా నిర్మిస్తున్నా. ఫిబ్రవరిలో గోపీచంద్‌తో ఓ సినిమా ఉంటుంది. విజయ్ ఆంటోని ‘యమన్’ను తెలుగులో రిలీజ్ చేస్తున్నా. తమిళ ‘ఈట్టి’ రీమేక్ రైట్స్ తీసుకున్నాం’’ అన్నారు.