Upcoming Top Tollywood Heroes Movies In Backdrop Of Coastal, Deets Inside - Sakshi
Sakshi News home page

Telugu New Movies In Coastal Backdrop: స్టార్ హీరోలందరూ అలాంటి స్టోరీలతోనే!

Published Wed, Jul 26 2023 1:36 AM | Last Updated on Wed, Jul 26 2023 11:01 AM

Movies set against the backdrop of coastal  - Sakshi

ప్రతీకారం కోసం ఒకరు... ఆట కోసం ఇంకొకరు. 

ప్రేమ కోసమై మరొకరు... ఇలా ఒక్కో కారణం కోసం ఒక్కో స్టార్‌ 

తీరప్రాంతాలకు పయనమవుతున్నారు. తీరప్రాంతాల నేపథ్యంలో ఆ తారలు చేస్తున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం. 

గోవా...కంగువా
ఇటీవల విడుదలైన ‘కంగువా’ సినిమా గ్లింప్స్‌ వీడియోను బట్టి ఈ చిత్రం చారిత్రాత్మక నేపథ్యంతో సాగుతుందని ఊహించవచ్చు. కానీ కథ పరంగా ఈ చారిత్రాత్మక నేపథ్యం సినిమాలో కొంత భాగం వరకే ఉంటుందని, ఈ సినిమా కథ ప్రధానంగా తీరప్రాంతమైన గోవా నేపథ్యంలో ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో ‘కంగువా’ సినిమా గోవాలో ఓ భారీ షెడ్యూల్‌ చిత్రీకరణను పూర్తి చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక సూర్య, దిశా పటానీ హీరో హీరోయిన్లుగా శివ దర్శకత్వంలో ‘కంగువా’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్‌ జ్ఞానవేల్‌ రాజా ఈ సినిమా నిర్మిస్తున్నారు. ‘కంగువా’ రెండు భాగాలుగా రిలీజ్‌ కానుంది, తొలి భాగం తమిళ సంవత్సరాదికి ఏప్రిల్‌ 12న విడుదల కానుందనే టాక్‌ వినిపిస్తోంది.  

గేమ్‌ స్టార్ట్‌
సముద్రతీరప్రాంతాల్లో కబడ్డీ ఆడనున్నారట హీరో రామ్‌చరణ్‌. తొలి చిత్రం ‘ఉప్పెన’తో దర్శకుడిగా ప్రేక్షకుల మెప్పు పొందిన బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్‌చరణ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వెంకట్‌ సతీష్‌ కిలారు ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇది స్పోర్ట్స్‌ డ్రామా అని సమాచారం. అలాగే ఈ సినిమా కథ ‘ఉప్పెన’ తరహాలో మత్స్యకారుల నేపథ్యంలో సాగుతుందట. అందుకే వైజాగ్, కాకినాడ వంటి లొకేషన్స్‌లో ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ని జరిపేలా చిత్ర యూనిట్‌ ప్లాన్‌ చేస్తోందనే టాక్‌ వినిపిస్తోంది.

అంతే కాదు.. కథ రీత్యా ఈ సినిమాలో రామ్‌చరణ్‌ అన్నదమ్ములుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ 
అన్నదమ్ముల్లో ఓ పాత్ర దివ్యాంగుడని భోగట్టా. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్, రష్మికా మందన్న, జాన్వీ కపూర్‌ వంటివార్ల పేర్లు తెర పైకి వచ్చాయి. వచ్చే ఏడాదిప్రారంభంలో ఈ సినిమా షూటింగ్‌ ఆరంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

తీరప్రాంత దేవర
‘జనతా గ్యారేజ్‌’ వంటి హిట్‌ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రకథ సముద్ర తీరప్రాంతం నేపథ్యంలో ఉంటుందని ఈ సినిమాప్రారంభోత్సవంలో కొరటాల శివ వెల్లడించిన సంగతి గుర్తుండే ఉంటుంది. దేశంలో విస్మరణకు గురైన సముద్ర తీరప్రాంతంవారి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. ఇందులో తండ్రీకొడుకులుగా ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎన్టీఆర్‌ సీన్స్‌ సినిమాకు ప్రధాన హైలైట్‌గా ఉంటాయని టాక్‌.

అలాగే ‘దేవర’ సినిమాకు సంబంధించిన ఓ షూటింగ్‌ షెడ్యూల్‌  గోవాలో జరగనుందని తెలిసింది. కాగా ఈ సినిమా ఆరంభం అయిన దగ్గర్నుంచి ఎక్కువగా యాక్షన్‌ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారు. స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ కెన్నీ బెట్స్, సాల్మోన్, పీటర్‌ హెయిన్స్‌ కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లను డిజైన్‌ చేశారు. ఈ సన్నివేశాలను ఎక్కువగా సెట్స్‌లోనే తీశారు. అయితే మేజర్‌ యాక్షన్‌ సీన్స్‌ను తీసిన తర్వాత టాకీ, సాంగ్స్‌పై ఫోకస్‌ పెడతారట. కల్యాణ్‌ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల కానుంది.

ప్రేమ తీరం
ప్రేమ తీరం చేరేందుకు సముద్రంలో బోటు డ్రైవర్‌గా ప్రయాణం చేయనున్నారట నాగచైతన్య. లవ్‌స్టోరీస్‌ సినిమాల్లో ఆడియన్స్‌ను ఎక్కువగా అలరిస్తుంటారు నాగచైతన్య. ‘ఏ మాయ చేసావె’, ‘ప్రేమమ్‌’ వంటి ప్రేమ కథా చిత్రాలతో ఇప్పటికే ఈ విషయాన్ని నాగచైతన్య నిరూపించుకున్నారు. కాగా దర్శకుడు చందు మొండేటి ఇటీవల నాగచైతన్యకు ఓ ప్రేమకథ వినిపించారని, ఇందులో బోటు డ్రైవర్‌ అయిన మత్స్యకారుడి పాత్రలో నాగచైతన్య నటిస్తారనీ ప్రచారం జరుగుతోంది.

సూరత్‌లో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుందనే టాక్‌ కూడా వినిపిస్తోంది. నాగచైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో గీతా ఆర్ట్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందని, ఇందులో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌గా నటిస్తారనే ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement