మల్టీ స్టారర్ చిత్రానికి ముహూర్తం
ప్రస్తుతం తమిళ చిత్రపరిశ్రమ భిన్న చిత్రాల మయంగా మారింది. ఒక పక్క హారర్ చిత్రాల దాడి కొనసాగుతోంది. మరో పక్క 2.ఓ లాంటి బ్రహ్మాండ చిత్రాల రూపకల్పన, ఇంకో పక్క హీరోల ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయంతో మంచి కమర్షియల్ చిత్రాల నిర్మాణాలు తెరకెక్కుతున్నాయి.అలాంటి వాటికి మధ్య తాజాగా ఒక మల్టీస్టారర్ చిత్రం ఆరంభం కానుంది. అదే యువ నటులు ఉదయనిధిస్టాలిన్, విష్ణువిశాల్ కలసి నటించనున్న చిత్రం.సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఇంతకు ముందు మన్మదన్ అండు,7ఆమ్ అరివు,ఒరుకల్ ఒరు కన్నాడి వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఉదయనిధిస్టాలిన్ రెడ్‌జెయింట్ సంస్థ నిర్మిస్తున్న 12వ చిత్రం ఇది.
ఇందులో ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా మలయాళ కుట్టి మంజిమా మోహన్ నటిస్తోంది. ఈమె ఇప్పటికే శింబుతో అచ్చం ఎంబది మడమయడా చిత్రంలో నటించిందన్నది గమనార్హం. విష్ణువిశాల్‌తో మేఘా ఆకాశ్ రొమాన్స్ చేయనుంది. ఈ అమ్మడు ఇప్పటికే బాలాజీ ధరణీ ధరణ్ దర్శకత్వం వహిస్తున్న ఒరు పక్క కథై చిత్రంలో నాయకిగా నటిస్తోంది. ఈ మల్టీస్టారర్ చిత్రం షూటింగ్ సోమవారం మొదలైంది.దీనికి డి.ఇమాన్ సంగీతాన్ని, మది చాయాగ్రహణం, కాశీవిశ్వనాథన్ కూర్పు బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. మంచి కథ లభిస్తే ఉదయనిధిస్టాలిన్‌తో చేయాలన్న ఆకాంక్ష ఈ చిత్రంతో నెరవేరుతోందని దర్శకుడు సుశీంద్రన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.