Needi Naadi Oke Katha Review | నీది నాది ఒకే కథ మూవీ రివ్యూ | Needi Naadi Oke Katha Review in Telugu - Sakshi
Sakshi News home page

Published Fri, Mar 23 2018 7:09 AM | Last Updated on Fri, Mar 23 2018 4:24 PM

Needi Naadi Oke Katha Movie Review In Telugu - Sakshi

టైటిల్ : నీదీ నాదీ ఒకే కథ
జానర్ : ఫ్యామిలీ డ్రామా
తారాగణం : శ్రీ విష్ణు, సాట్నా టిటస్‌, దేవీ ప్రసాద్‌, పోసాని కృష్ణ మురళీ
సంగీతం : సురేష్‌ బొబ్బిలి
దర్శకత్వం : వేణు ఊడుగుల
నిర్మాత : నారా రోహిత్‌, ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు

అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో లాంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు.. లీడ్‌ రోల్‌ లో తెరకెక్కిన తాజా చిత్రం నీదీ నాదీ ఒకే కథ. మధ్య తరగతి కుటుంబాల్లో ఉండే సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో చదువులు, ర్యాంకుల కోసం పరుగులు, పరువు ప్రతిష్టల కోసం తల్లిదండ్రులు పిల్లలను పెట్టే ఇబ్బందులు ప్రధానంగా ప్రస్థావించారు. ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా శ్రీ విష్ణుకు మరో విజయాన్ని అందించిందా..?

కథ :
రుద్రరాజు దేవీ ప్రసాద్‌ (దేవీ ప్రసాద్‌) ప్రొఫెసర్‌. ఉ‍న్నత మైన చదువు చదుకొని సమాజంలో పరువు ప్రతిష్ట ఉన్న మధ్య తరగతి తండ్రి. తన కొడుకు జీవితంలో మంచి స్థాయిలో సెటిల్‌ అవ్వాలని తపన పడే తండ్రి. సాగర్‌ (శ్రీ విష్ణు) డిగ్రీ మూడు సార్లు ఫెయిల్‌ అయ్యి తన చెల్లెలితో కలిసి మళ్లీ ఎగ్జామ్స్‌ రాసే కుర్రాడు. జీవితం మీద, భవిష్యత్తు మీద క్లారిటీ లేకుండా టైం పాస్‌ చేసేస్తుంటాడు. కానీ తండ్రి బాధ తెలుసుకున్న సాగర్‌ ఎలాగైనా తండ్రి కోరుకున్నట్టుగా మారాలని ప్రయత్నిస్తాడు. అందుకోసం ధార్మిక (సాట్నా టిటస్) సాయం తీసుకుంటాడు. కానీ ఈ ప్రయత్నాల్లో తనని తాను కోల్పోవడం ఇష్టం లేక.. తండ్రి ఆశించినట్టుగా మారలేక నలిగిపోతుంటాడు. చివరకు సాగర్‌.. తండ్రి కోరుకున్నట్టుగా మారాడా..? లేక తనలాగే తాను ఉండిపోయాడా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
సినిమా అంతా తండ్రీ కొడుకుల మధ్యే నడిచే కథ కావటంలో ప్రధానం గా రెండు పాత్రలే తెరమీదే కనిపిస్తుంటాయి. జీవితంలో ఏది సాధించలేననే నిరుత్సాహంలో బతికే కుర్రాడిగా శ్రీవిష్ణు అద్భుతంగా నటించాడు. తన కొడుకు జీవితంలో ఉన్నతంగా సెటిల్ అవ్వాలన్న తండ్రి కోరిక నేరవేర్చలేక.. తనని తాను కోల్పోలేక సతమతమ్యే పాత్రలో మంచి భావోద్వేగాలను పండించాడు. తొలిసారిగా తెరపైన కనిపించిన దర్శకుడు దేవీ ప్రసాద్‌.. నటుడిగానూ మంచి మార్కులు సాధించాడు. మధ్య తరగతి మనుషుల మనస్థత్వాలకు, ఆలోచనలకు, ఆశలకు ప్రతిరూపంగా నటించి మెప్పించారు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాట్నా టిటస్‌కు ఈ సినిమాలో కూడా నటనకు ఆస్కారమున్న పాత్రే దక్కింది. ఫస్ట్ హాఫ్‌లో నవ్వించే ప్రయత్నం చేసిన సాట్నా.. ద్వితీయార్థంలో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో మంచి నటన కనబరిచింది. 

విశ్లేషణ :
మధ్య తరగతి కుటుంబాల్లో ప్రతీ ఇంట్లోను ఉండే సమస్యలనే కథా వస్తువుగా తీసుకున్న దర్శకుడు వేణు ఊడుగుల తొలి ప్రయత్నంలోనే మంచి విజయం సాధించాడు. ప్రతీ ప్రేక్షకుడు ఏదో ఒక సన్నివేశంలో ఇది నా కథే అనిపించేలా ఉంది కథనం. ప్రస్తుత సమాజంలో అందరు మనుషులు ముసుగులు వేసుకునే బతుకున్నారన్న అంశాన్ని మనసుకు హత్తుకునేలా ప్రజెంట్‌ చేశాడు. పోటీ ప్రపంచంలో ర్యాంకుల కోసం, పరువు ప్రతిష్టల కోసం తల్లిదండ్రులు పిల్లలను ఎంత ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆ ఒత్తిడి వల్ల పిల్లలు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తున్నారన్న అంశాలను బలమైన ఎమోషనల్‌ సీన్స్‌తో తెర మీద ఆవిష్కరించాడు.. సంగీతం కూడా సినిమాకు తగ్గట్టుగా కుదిరింది. ఎక్కడ కమర్షియల్ లెక్కల కోసం పాటలను ఇరికించకుండా ప్రతీ పాట కథలో భాగంగా వచ్చిపోతుంటాయి. సినిమాకు మరో ప్రధానబలం నేపథ్య సంగీతం. సంగీత దర్శకుడు సురేష్‌ బొబ్బిలి తన నేపథ్య సంగీతంతో కథలోని భావోద్వేగాలను మరింతగా ఎలివేట్ చేశాడు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటింగ్‌ బాగుంది. సినిమాటోగ్రఫి, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

ప్లస్ పాయింట్స్ :
కథా కథనం
శ్రీ విష్ణు నటన
సంగీతం

మైనస్ పాయింట్స్ :
సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌


- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement