శ్రీవిష్ణు
‘‘చదువు సరిగ్గా రాని కుర్రాడి జీవితంలో చదువు పూర్తయినప్పటి నుంచి సెటిలయ్యే వరకు ఏం జరిగిందన్నదే ‘నీది నాది ఒకే కథ’. వేణుగారు ఫుల్ క్లారిటీతో మంచి సినిమా తీశారు’’ అని హీరో శ్రీవిష్ణు అన్నారు. శ్రీవిష్ణు, సాట్నా టైటస్ జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నీది నాది ఒకే కథ’. ప్రశాంతి, కృష్ణ విజయ్, అట్లూరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23న విడుదలవుతోంది. శ్రీవిష్ణు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ని చూసి, చాలామంది కుర్రాళ్లు వాళ్లను వాళ్లు చూసుకుంటున్నట్లుగా భావిస్తారు.
జీవితంలో కీలక సమయాల్లో సొసైటీ గురించి ఆలోచిస్తాం. కానీ, సొసైటీ మనకేమీ చేయదు. అందుకే.. అన్ని సందర్భాల్లో సమాజం గురించి ఆలోచించి, మన ఇష్టాయిష్టాలను చంపేసుకోవాల్సిన అవసరం లేదని మా చిత్రంలో చెబుతున్నాం. దర్శకులు దేవి ప్రసాద్‌గారు నా తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన పాత్రతో పెద్దవాళ్లు కనెక్ట్ అవుతారు. ఆయన ఓ డైరెక్టర్‌లా కాకుండా మాతో ఓ నటుడిలా కలిసిపోయారు. ఆయన పాత్ర చూసి థ్రిల్ అవుతారు. మాస్ హీరో అయిపోవాలనే ఆలోచనతో ఇలాంటి పాత్రలు ఎంచుకోవడం లేదు. కథ నచ్చే ఒప్పుకుంటున్నా. అయినా.. మాస్ హీరో అవ్వడం చాలా కష్టం.
ఈ చిత్రంలో డోగ్మే 95 టెక్నిక్ వాడారు. అది 1995 టెక్నిక్.తక్కువ బడ్జెట్‌లో సినిమా తీయడం ఎలా అనేది అందులో మెయిన్. ట్రాలీలు, జిమ్మీలు, సెట్‌లు వంటివి లేకుండా చాలా తక్కువలో సినిమా చేశాం. ఆ టెక్నిక్ వాడి తెలుగులో తీసిన మొదటి సినిమా మాదే. ఒకే తరహా సినిమాలు, పాత్రలు చేస్తే ‘వీడు ఒకే టైప్ క్యారెక్టర్స్ చేస్తున్నాడ్రా’ అంటారు. ఆ మాట అనిపించుకోకూడదన్నదే నా ప్రయత్నం. అందుకే డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నాకు వెంకటేష్‌గారంటే చాలా ఇష్టం. ప్రస్తుతం ‘వీరభోగ వసంతరాయలు’ సినిమా చేస్తున్నాను. తర్వాత ‘అసుర’ దర్శకుడితో ‘తిప్పరా మీసం’ చేస్తా. ఆ తర్వాత కొత్త డైరెక్టర్‌తో ఓ పోలీస్ స్టోరీ చేయనున్నా’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment