‘‘నేను కేవలం కమర్షియల్ సినిమాలే చేయాలని రూల్ పెట్టుకోలేదు. డిఫరెంట్ మూవీస్ చేయాలనుకుంటున్నా. అందుకే ‘ఒక్కడు మిగిలాడు’ చేశా. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ, ఇలాంటివి ఎప్పుడో కానీ రావు’’ అని కథానాయిక అనీషా ఆంబ్రోస్ అన్నారు. మనోజ్, అనీషా ఆంబ్రోస్ జంటగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ నిర్మించిన ‘ఒక్కడు మిగిలాడు’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనీషా ఆంబ్రోస్ చెప్పిన చిత్ర విశేషాలు...
►రెండు ఫ్రేమ్స్‌లో జరిగే సినిమా ఇది. ఒక ఫ్రేమ్ 1990 ఎల్టీటీఈ నేత ప్రభాకరన్ కోణంలో ఉంటే ఇంకొకటి ప్రస్తుతంలో ఉంటుంది. నేను ప్రస్తుతంలో జర్నలిస్టుగా కనిపిస్తాను. 1990కి, ప్రస్తుతానికి సంబంధం ఏమిటన్నది సస్పెన్స్. కథ సీరియస్‌గా ఉంటుంది. పాటలు, కామెడీ అస్సలు ఉండవు
►అజయ్ ఆండ్రూస్ ఈ సినిమా కోసం బాగా రీసెర్చ్ చేశారు. ఎల్టీటీఈ సభ్యుల వద్దకు వెళ్లి వాళ్ల అనుభవాల్ని, అప్పటి పరిస్థితుల్ని తెలుసుకుని, వాస్తవ ఘటనలతో రూపొందించారు. దర్శకుడు కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఇలాంటి కథలను దర్శకుడి మీద నమ్మకం ఉన్నవాళ్లు మాత్రమే చేస్తారు
►మనోజ్ పవర్‌ఫుల్ యాక్టర్. సినిమా కోసం తను పడే కష్టం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఈ చిత్రంలో మా మధ్య లవ్‌ట్రాక్ ఉన్నా అదే ప్రధానాంశం కాదు. ఎన్ని సినిమాలు చేసినా నాకు బ్రేక్ ఎందుకు రాలేదో తెలియదు. బ్రేక్ రాలేదని ఎప్పుడూ బాధపడలేదు. నాకు వచ్చిన, నచ్చిన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా.
►‘విఠలాచార్య’తో పాటు మరో తెలుగు సినిమా చేస్తున్నా. తమిళంలో ఒక సినిమా షూటింగ్ పూర్తయింది.
Comments
Please login to add a commentAdd a comment