తిరుగుబాటు తీవ్రవాదంగా మారే లోపు...! | Okkadu Migiladu Hero Manchu Manoj Exclusive Interview | Sakshi
Sakshi News home page

తిరుగుబాటు తీవ్రవాదంగా మారే లోపు...!

Published Thu, Nov 9 2017 12:27 AM | Last Updated on Thu, Nov 9 2017 6:00 AM

Okkadu Migiladu Hero Manchu Manoj Exclusive Interview  - Sakshi

‘‘హీరోలు, దర్శకులు... ప్రతి ఒక్కరం అన్నదమ్ముల్లా, స్నేహితుల్లా కలసిమెలిసి ఉంటున్నాం. ఇదే సంస్కృతి ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్‌ రంగాల్లో వచ్చి, అందరూ ఓచోట చేరితే బాగుంటుంది. ఇదొక సలహా మాత్రమే. సలహాను తప్పకుండా సీరియస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితులొచ్చాయి’’ అన్నారు మంచు మనోజ్‌. ఆయన హీరోగా అజయ్‌ ఆండ్రూస్‌ దర్శకత్వంలో ఎస్‌.ఎన్‌. రెడ్డి, లక్ష్మీకాంత్‌ నిర్మించిన ‘ఒక్కడు మిగిలాడు’ రేపు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సినిమా గురించి, థియేటర్ల సమస్య గురించి మనోజ్‌ చెప్పిన ముచ్చట్లు...

కమర్షియల్‌ ఫిల్మ్‌ కాదిది... హార్ట్‌ టచింగ్‌ హై ఇంటెన్స్‌ ఎమోషనల్‌ డ్రామా! నో కామెడీ, నో సాంగ్స్‌. ఇందులో సూర్య, పీటర్‌... రెండు పాత్రలు చేశా. ఓ వర్గానికి దేవుడైన పీటర్‌ (ఎల్టీటీఈ ప్రభాకరన్‌!) కథను తెరపై చూపిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని రీసెర్చ్‌ చేశా. దర్శకుడు ఇచ్చిన నోట్స్‌ హెల్ప్‌ అయ్యాయి. సెకండాఫ్‌లో 40 నిమిషాలు నేనుండను. అయినా... కథకు రెస్పెక్ట్‌ ఇచ్చి చేశా. ఇలాంటి కథలు కొత్తవాళ్లు చేస్తే అంత రీచ్‌ ఉండదు. అందుకని చేశా ∙ఆర్నెల్లుగా కలల్లోనూ యుద్ధం చేస్తున్నా. అంతలా వెంటాడుతోందీ కథ. క్యారెక్టర్‌ మూడ్‌లోనే ఉంటున్నా. (నవ్వుతూ...) చైనాలోనూ యుద్ధానికి వెళ్లా. కలల్లో మనకిష్టమైన వ్యక్తులు, కుటుంబ సభ్యులు వస్తారు కదా.

ప్రతి రాత్రి కలలో ఫ్యామిలీని సేవ్‌ చేయడమే నా పని! అంత డెప్త్‌ ఉందీ సినిమాలో. తెరౖపై చూసిన తర్వాత మనుషుల మధ్య దూరం పెరిగిందా? నిజంగా మనిషికి మనిషి తోడుంటున్నాడా? అనేది ఆలోచిస్తారు ∙రియలిస్టిక్‌గా సినిమా తీశాం. సమాజంలో జరిగినదాంట్లో ఒక్క శాతమే చూపించాం... సినిమాటిక్‌గా! ఇటువంటి సినిమాలు తీయడమే కష్టమంటే... సెన్సార్‌ వాళ్లు చుక్కలు చూపించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఉద్దేశంతో ఇంకా తమిళ సెన్సార్‌ చేయించలేదు. రెండు వారాల తర్వాత తమిళంలో విడుదల చేయాలనుకుంటున్నాం ∙ఈ సినిమా చేసిన తర్వాత జనాల్లోకి వెళ్లి, సేవ చేయాలనుకున్నా. దేశాన్ని ఉద్ధరించలేం. నా ఏరియాను ఉద్ధరించగలుగుతాను కదా! కనీసం ప్రయత్నించగలను కదా! ఇంట్లో విష్ణు అన్న ఓ తన్ను తన్ని చక్కగా సినిమాలు చేయమన్నారు. ఏదో రోజున సేవ చేయడానికి వస్తా.

నైజాంలో థియేటర్స్‌ కోసం మావాళ్లు (దర్శక–నిర్మాతలు) ఫైట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏం జరిగిందో? నాకు క్లియర్‌గా తెలీదు. తెలిసినంత వరకూ... ఫస్ట్‌ కొంతమందిని అడిగారు. టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ నచ్చక, ఎక్కువ అమౌంట్‌ ఆఫర్‌ చేసిన కొత్త డిస్ట్రిబ్యూటర్స్‌కి మావాళ్లు సినిమాను ఇచ్చారు. ఫస్ట్‌ అడిగిన వాళ్ల దగ్గరే థియేటర్లున్నాయి. మళ్లీ థియేటర్ల కోసం వాళ్ల దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. ముందు అడిగితే... 50 థియేటర్లు ఇస్తామన్నారు. సడన్‌గా రెండు డబ్బింగ్‌ (తమిళ్‌) సినిమాలు రావడంతో థియేటర్లు లేవన్నారట! దర్శకుడు అజయ్‌ సెన్సిటివ్‌ అండ్‌ వెరీ సీరియస్‌ పర్సన్‌. క్వశ్చన్‌ చేయడానికి వెళితే... రెచ్చగొట్టేలా మాట్లాడి, మాటల్లో పెట్టి పోలీసుల్ని పిలిచారట.

ఇండస్ట్రీలో ఇంతమంది పెద్దలు ఉండగా పోలీసుల్ని పిలవడం ఏంటి? ఒక పరిష్కారం కావాలి కదా! ఇలాంటి సమస్యలు మున్ముందు రాకుండా పెద్దలందరూ కూర్చుని, పరిష్కార మార్గం ఆలోచిస్తారని ఆశిస్తున్నా. పోలీసులు, కొట్టుకోవడాలు అయితే ఎంతసేపు! సినిమాలు మానేసి అందరూ అదే పనిలో ఉండాలి. ‘ఒక్కడు మిగి14లాడు’ విడుదల తర్వాత, అతి త్వరలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస యాదవ్‌లను కలసి ప్రభుత్వం తరపున ఓ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేయవలసిందిగా రిక్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నా. ఫిల్మ్‌ ఛాంబర్‌ ఉంది కదా! అందులోనే డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీస్‌ పెడితే... పెద్దవాళ్లు అయినా, చిన్నవాళ్లు అయినా అక్కడికి వెళతారు.

సినిమా విడుదలవుతుందని చెబితే... ఎన్ని థియేటర్లు ఉన్నాయనేది చాంబర్‌ డిసైడ్‌ చేస్తుంది. ఇప్పుడు కొత్తవాళ్లు సినిమా విడుదల చేయాలంటే వందచోట్ల తిరగాల్సి వస్తుంది. నా బాధ ఒకటే... రెచ్చగొడితే ఓ నాయకుడు పుడతాడు. నాయకుడి మాటల్ని అణచి వేయాలనుకుంటే తిరుగుబాటు మొదలవుతుంది. తిరుగుబాటును తొక్కేయాలనుకుంటే... తీవ్రవాదంగా మారుతుంది, మొదలవుతుంది. ఇప్పుడు చిత్రపరిశ్రమలో తిరుగుబాటు పరిస్థితులొచ్చాయి. అది తీవ్రవాదంగా మారడానికి ఎంతోసేపు పట్టదు. కడుపు కాలితే... ఏ ఫ్యామిలీ వల్ల తను నాశనం అయితే వాళ్లపై పగ తీర్చుకుంటాడు. అప్పుడు మన ఇండస్ట్రీకి ఎంత చెడ్డపేరు వస్తుందో ఆలోచించుకోండి! ‘ఫలనా నిర్మాత ఎవర్నో చంపేశాడంట’ అంటే... ఎంత దరిద్రంగా ఉంటుందో చెప్పండి!

 fv

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement