ajay andrews direction
-
'ఒక్కడు మిగిలాడు' మూవీ రివ్యూ
టైటిల్ : ఒక్కడు మిగిలాడు జానర్ : ఎమోషనల్ డ్రామా తారాగణం : మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస, అజయ్ ఆండ్రూస్ నూతక్కి, మిలింద్‌గునాజీ, పోసాని కృష్ణమురళీ సంగీతం : శివ ఆర్ నందిగాం దర్శకత్వం : అజయ్ ఆండ్రూస్ నూతక్కి నిర్మాత : ఎస్ఎన్ రెడ్డి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్ హీరోగా ఓ భారీ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. కమర్షియల్ ఫార్ములా సినిమాల కన్నా ప్రయోగాత్మక చిత్రాలు చేసేందుకు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపించే మనోజ్, మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీలంక శరణార్థుల నేపథ్యంలో తెరకెక్కిన ఒక్కడు మిగిలాడు సినిమాలో రెండు విభిన్న పాత్రలో నటించిన మనోజ్ ఆకట్టుకున్నాడా..? నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ సాదించాడా..? కథ : తన ప్రమోషన్ కోసం ఓ కాలేజ్ ప్రొఫెసర్ తన స్టూడెంట్స్ అయిన ముగ్గురమ్మాయిలను మోసం చేసి ఓ మినిస్టర్ (మిలింద్ గునాజీ) కొడుకుల దగ్గరకు పంపిస్తాడు. విషయం తెలుసుకున్న అమ్మాయిలు వాళ్లనుంచి తప్పించుకునేందుకు మరో దారిలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారు. బయటి ప్రపంచానికి అసలు విషయం తెలియకుండా వాళ్ల వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్టుగా చిత్రీకరిస్తారు. నిజం తెలుసుకున్న విద్యార్థి నాయకుడు సూర్య(మంచు మనోజ్) విద్యార్థి ఉద్యమానికి పిలుపునిస్తాడు. కానీ మినిస్టర్ తన బలాన్ని ఉపయోగించి ఉద్యమాన్ని అనచివేసి సూర్యని అరెస్ట్ చేయిస్తాడు. కేసు కూడా నమోదు చేయకుండా చిత్ర హింసలు పెట్టి ఎన్కౌంటర్ చేయాలని ప్లాన్ చేస్తారు. (సాక్షి రివ్యూస్) వారి కుట్రల నుంచి సూర్య ఎలా తప్పించుకున్నాడు..? సూర్యకు శ్రీలంక శరణార్థలు కోసం పోరాడిన విప్లవనాయకుడు పీటర్ (మంచు మనోజ్)కు సంబంధం ఏంటి..? ఈ పోరాటంలో చివరకు సూర్య గెలిచాడా..లేదా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇప్పటికే నటుడిగా ప్రూవ్ చేసుకున్న మంచు మనోజ్ ఈ సినిమాతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. విద్యార్థి నాయకుడిగా మనోజ్ నటన చాలా సహజంగా అనిపించింది. ఎక్కువగా అల్లరి క్యారెక్టర్ లు మాత్రమే చేసిన మనోజ్ ఈ సినిమాతో బరువైన ఎమోషన్లు కూడా పండించగలడని ప్రూవ్ చేసుకున్నాడు. సూర్య పాత్రలో నేచురల్ గా కనిపించిన మనోజ్, పీటర్ పాత్రలో కాస్త డ్రమెటిక్‌గా కనిపించాడు. మరో కీలక పాత్రలో నటించిన దర్శకుడు అజయ్ ఆండ్రోస్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సముద్రం మీద తెరకెక్కిన సన్నివేశాల్లో అజయ్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. (సాక్షి రివ్యూస్)బోట్ ప్రయాణంలో కనిపించిన వారంతా నేచురల్ గా నటించి మెప్పించారు. సిన్సియర్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో పోసాని కృష్ణమురళీ మరోసారి తన మార్క్ చూపించాడు. జర్నలిస్ట్ పాత్రలో అనీష ఆంబ్రోస్ పరవాలేదనిపించింది. ఇతర పాత్రల్లో సుహాసిని, మిలింద్ గునాజీ, బెనర్జీ తమ పాత్రలకు న్యాయం చేశారు. విశ్లేషణ : శ్రీలంకలో శరణార్థుల సమస్యల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు అజయ్, సినిమాను రియలిస్టిక్‌గా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అక్కడి ప్రజల సమస్యలను వాళ్లు పడుతున్న ఇబ్బందులను, అక్కడి నుంచి శరణార్థులగా తప్పించుకొని వస్తున్న వారు ఆ ప్రయత్నంలో ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో కళ్లకు కట్టినట్టుగా చూపించాడు. సినిమాను రియలిస్టిక్ గా తెరకెక్కించటంతో కమర్షియల్ సినిమాగా కన్నా ఓ డాక్యుమెంటరీ సినిమాలా అనిపించింది. ఇక శ్రీలంక పోరాటం నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాల్లో పాత్రల నటన చాలా డ్రమెటిక్ గా అనిపిస్తుంది. బోట్ ప్రయాణం నేపథ్యంలో తెరకెక్కిన సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కినా.. నిడివి కాస్త తగ్గించి ఉంటే బాగుండేది. ఎమోషనల్ డ్రాగా తెరకెక్కిన సినిమాలో కథను పక్కదారి పట్టించే పాటలు లేకపోవటంతో సినిమా అంతా ఒకే మూడ్‌లో సాగుతుంది.(సాక్షి రివ్యూస్) అక్కడక్కడ వినిపించిన బిట్ సాంగ్స్ సన్నివేశాలు మరింత ఎలివేట్ అయ్యేందుకు హెల్ప్ అయ్యాయి. నేపథ్యం సంగీతం కూడా సినిమా మూడ్ ను క్యారీ చేసింది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫి, శ్రీలంకలోని పోరాట సన్నివేశాలతో పాటు బోటు ప్రయాణం సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : మంచు మనోజ్ నటన కథ నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : మితిమీరిన డ్రామా సినిమా నిడివి - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
తిరుగుబాటు తీవ్రవాదంగా మారే లోపు...!
‘‘హీరోలు, దర్శకులు... ప్రతి ఒక్కరం అన్నదమ్ముల్లా, స్నేహితుల్లా కలసిమెలిసి ఉంటున్నాం. ఇదే సంస్కృతి ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో వచ్చి, అందరూ ఓచోట చేరితే బాగుంటుంది. ఇదొక సలహా మాత్రమే. సలహాను తప్పకుండా సీరియస్‌గా తీసుకోవాల్సిన పరిస్థితులొచ్చాయి’’ అన్నారు మంచు మనోజ్. ఆయన హీరోగా అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ నిర్మించిన ‘ఒక్కడు మిగిలాడు’ రేపు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సినిమా గురించి, థియేటర్ల సమస్య గురించి మనోజ్ చెప్పిన ముచ్చట్లు... కమర్షియల్ ఫిల్మ్ కాదిది... హార్ట్ టచింగ్ హై ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా! నో కామెడీ, నో సాంగ్స్. ఇందులో సూర్య, పీటర్... రెండు పాత్రలు చేశా. ఓ వర్గానికి దేవుడైన పీటర్ (ఎల్టీటీఈ ప్రభాకరన్!) కథను తెరపై చూపిస్తున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని రీసెర్చ్ చేశా. దర్శకుడు ఇచ్చిన నోట్స్ హెల్ప్ అయ్యాయి. సెకండాఫ్‌లో 40 నిమిషాలు నేనుండను. అయినా... కథకు రెస్పెక్ట్ ఇచ్చి చేశా. ఇలాంటి కథలు కొత్తవాళ్లు చేస్తే అంత రీచ్ ఉండదు. అందుకని చేశా ∙ఆర్నెల్లుగా కలల్లోనూ యుద్ధం చేస్తున్నా. అంతలా వెంటాడుతోందీ కథ. క్యారెక్టర్ మూడ్‌లోనే ఉంటున్నా. (నవ్వుతూ...) చైనాలోనూ యుద్ధానికి వెళ్లా. కలల్లో మనకిష్టమైన వ్యక్తులు, కుటుంబ సభ్యులు వస్తారు కదా. ప్రతి రాత్రి కలలో ఫ్యామిలీని సేవ్ చేయడమే నా పని! అంత డెప్త్ ఉందీ సినిమాలో. తెరౖపై చూసిన తర్వాత మనుషుల మధ్య దూరం పెరిగిందా? నిజంగా మనిషికి మనిషి తోడుంటున్నాడా? అనేది ఆలోచిస్తారు ∙రియలిస్టిక్‌గా సినిమా తీశాం. సమాజంలో జరిగినదాంట్లో ఒక్క శాతమే చూపించాం... సినిమాటిక్‌గా! ఇటువంటి సినిమాలు తీయడమే కష్టమంటే... సెన్సార్ వాళ్లు చుక్కలు చూపించారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఉద్దేశంతో ఇంకా తమిళ సెన్సార్ చేయించలేదు. రెండు వారాల తర్వాత తమిళంలో విడుదల చేయాలనుకుంటున్నాం ∙ఈ సినిమా చేసిన తర్వాత జనాల్లోకి వెళ్లి, సేవ చేయాలనుకున్నా. దేశాన్ని ఉద్ధరించలేం. నా ఏరియాను ఉద్ధరించగలుగుతాను కదా! కనీసం ప్రయత్నించగలను కదా! ఇంట్లో విష్ణు అన్న ఓ తన్ను తన్ని చక్కగా సినిమాలు చేయమన్నారు. ఏదో రోజున సేవ చేయడానికి వస్తా. నైజాంలో థియేటర్స్ కోసం మావాళ్లు (దర్శక–నిర్మాతలు) ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఏం జరిగిందో? నాకు క్లియర్‌గా తెలీదు. తెలిసినంత వరకూ... ఫస్ట్ కొంతమందిని అడిగారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చక, ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేసిన కొత్త డిస్ట్రిబ్యూటర్స్‌కి మావాళ్లు సినిమాను ఇచ్చారు. ఫస్ట్ అడిగిన వాళ్ల దగ్గరే థియేటర్లున్నాయి. మళ్లీ థియేటర్ల కోసం వాళ్ల దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది. ముందు అడిగితే... 50 థియేటర్లు ఇస్తామన్నారు. సడన్‌గా రెండు డబ్బింగ్ (తమిళ్) సినిమాలు రావడంతో థియేటర్లు లేవన్నారట! దర్శకుడు అజయ్ సెన్సిటివ్ అండ్ వెరీ సీరియస్ పర్సన్. క్వశ్చన్ చేయడానికి వెళితే... రెచ్చగొట్టేలా మాట్లాడి, మాటల్లో పెట్టి పోలీసుల్ని పిలిచారట. ఇండస్ట్రీలో ఇంతమంది పెద్దలు ఉండగా పోలీసుల్ని పిలవడం ఏంటి? ఒక పరిష్కారం కావాలి కదా! ఇలాంటి సమస్యలు మున్ముందు రాకుండా పెద్దలందరూ కూర్చుని, పరిష్కార మార్గం ఆలోచిస్తారని ఆశిస్తున్నా. పోలీసులు, కొట్టుకోవడాలు అయితే ఎంతసేపు! సినిమాలు మానేసి అందరూ అదే పనిలో ఉండాలి. ‘ఒక్కడు మిగి14లాడు’ విడుదల తర్వాత, అతి త్వరలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస యాదవ్‌లను కలసి ప్రభుత్వం తరపున ఓ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఏర్పాటు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేద్దామనుకుంటున్నా. ఫిల్మ్ ఛాంబర్ ఉంది కదా! అందులోనే డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడితే... పెద్దవాళ్లు అయినా, చిన్నవాళ్లు అయినా అక్కడికి వెళతారు. సినిమా విడుదలవుతుందని చెబితే... ఎన్ని థియేటర్లు ఉన్నాయనేది చాంబర్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు కొత్తవాళ్లు సినిమా విడుదల చేయాలంటే వందచోట్ల తిరగాల్సి వస్తుంది. నా బాధ ఒకటే... రెచ్చగొడితే ఓ నాయకుడు పుడతాడు. నాయకుడి మాటల్ని అణచి వేయాలనుకుంటే తిరుగుబాటు మొదలవుతుంది. తిరుగుబాటును తొక్కేయాలనుకుంటే... తీవ్రవాదంగా మారుతుంది, మొదలవుతుంది. ఇప్పుడు చిత్రపరిశ్రమలో తిరుగుబాటు పరిస్థితులొచ్చాయి. అది తీవ్రవాదంగా మారడానికి ఎంతోసేపు పట్టదు. కడుపు కాలితే... ఏ ఫ్యామిలీ వల్ల తను నాశనం అయితే వాళ్లపై పగ తీర్చుకుంటాడు. అప్పుడు మన ఇండస్ట్రీకి ఎంత చెడ్డపేరు వస్తుందో ఆలోచించుకోండి! ‘ఫలనా నిర్మాత ఎవర్నో చంపేశాడంట’ అంటే... ఎంత దరిద్రంగా ఉంటుందో చెప్పండి! fv -
కామెడీ, సాంగ్స్ లేకుండా యంగ్ హీరో ప్రయోగం
స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్, నటుడిగా మంచి మార్కులు సాధించినా, సక్సెస్ సాధించటంలో మాత్రం ఫెయిల్ అవుతున్నాడు. రొటీన్ ఫార్ములాకు భిన్నంగా సినిమాలు చేస్తున్న మనోజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఎల్టీటీయి నాయకుడు ప్రభాకరన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఒక్కడు మిగిలాడు’ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాకరన్ పాత్రతో పాటు విద్యార్థి నాయకుడిగా నటిస్తున్నాడు మనోజ్. సినిమా విశేషాలపై అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ సినిమాలో కామెడీ, పాటలు ఉండవని కేవలం ఒక్క బ్యాక్ గ్రౌండ్ సాంగ్ మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఈ సినిమాలో ప్రేమకథ కూడా ఉండదని తెలిపారు. అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 10న రిలీజ్ అవుతోంది. There's only 1 track(Song) in this film :) Only Emotion No commotion 😉 https://t.co/jUfVO0oSqq — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 29 October 2017 No comedy No Songs ... only BG songs .. it's an High Intense Emotional Drama Movie with a strong Realistic touch .. 'Untold True story'.. https://t.co/xgplZgzXXj — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 29 October 2017 -
'ఒక్కడు మిగిలాడు'కు అదే ప్రధాన ఆకర్షణ
మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేసిన ఒక్కడు మిగిలాడు చిత్రం నవంబర్ 10న విడుదల కాబోతోంది. పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ ఈ సీ బ్యానర్ల పై ఎస్ ఎన్ రెడ్డి, లక్ష్మీకాంత్ ఎన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి వివరించారు. 'ఈ చిత్రం లో 35 నిమిషాల పాటు సాగే సముద్ర ప్రయాణం ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుంది. కొత్త నటీనటుల హావభావాలు ఆకట్టుకుంటాయి. బతుకు పోరాటంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులు హృదయాలను కదిలిస్తాయి. ఈ సన్నివేశాలు చిత్ర ద్వితీయార్థం లో వస్తాయి. ప్రథమార్ధంలో వచ్చే యుద్ధ సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. మనోజ్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని దర్శకుడు తెలిపారు. చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది. ఛాయాగ్రహణం వికే రామరాజు పనితనం, శివ నందిగాం నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని అన్నారు. రెండు పాత్రల్లో మనోజ్ నటన అలరిస్తుంది. హీరోయిన్ అనీషా అంబ్రోస్, సుహాసిని మణిరత్నం, మిలింద్ గునాజీ, అజయ్, జెన్నిఫర్, రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ పీఎస్ వర్మ, గ్రాఫిక్స్ శ్రీనివాసులు, పాటలు గురుచరణ్, రామదుర్గం మధుసూధన్. -
మనోజ్ నెక్స్ట్ సినిమా ఏదో తెలుసా?
శరవేగంగా సినిమాలు పూర్తిచేస్తూ ఒకదాని తర్వాత మరో ప్రాజెక్టును వెంటవెంటనే ఓకే చేస్తున్న మంచుమనోజ్ తాజాగా చేస్తున్న సినిమా గురించిన విశేషాలను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇప్పటివరకు చేయని సరికొత్త పాత్రతో మనోజ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'ఒక్కడు మిగిలాడు' అనే టైటిల్‌తో అజయ్ ఆండ్రూస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మనోజ్ ఒక ఉద్యమకారుడి పాత్రను పోషిస్తున్నట్లు సినిమా ఫస్ట్ లుక్ చూస్తే తెలుస్తోంది. ఈ సినిమాలో తాను చాలా బరువైన, ఎమోషనల్ పాత్రను పోషిస్తున్నట్లు మనోజ్ వెల్లడించాడు. మనోజ్ సరసన రెజీనా చేస్తున్న ఈ సినిమాలో ఇంకా.. అజయ్, జెన్నీ, అల్లు రమేష్, భారతీరావు, ప్రేమిక తదితరులు నటిస్తున్నారు. కెమెరా: వీకే రామరాజు, సంగీతం: శివ ఆర్. నందిగం, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, కాస్ట్యూమ్స్: నీరజా కోన, ఎడిటర్ కార్తీక శ్రీనివాస్, నిర్మాతలు: ఎస్ఎన్ ఎడ్డి, లక్ష్మీకాంత్. అచ్చిబాబు ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇది కాక.. 'నా రాకుమారుడు' ఫేమ్ ఎస్.కె.సత్య దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఈ సొట్టబుగ్గల చిన్నోడు అంగీకరించాడు. రాజేంద్రప్రసాద్, సంపత్ కీలక పాత్రల్లో నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. My new film 'Okkadu Migiladu' directed by Ajay Andrews. Playing an intense & emotional character.. pic.twitter.com/XFPB7KXl6D — Manchu Manoj (@HeroManoj1) 3 August 2016