‘‘ఒక్కడు మిగిలాడు’ కథ వినగానే ఆ కథకి గౌరవం ఇవ్వాలి, ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని ముందుగానే నిర్ణయించుకున్నా. శ్రీలంకను బేస్ చేసుకుని తీసిన సినిమా కాదిది. బాధలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం చేసిన చిత్రం’’ అని హీరో మంచు మనోజ్ అన్నారు. మనోజ్, అనీషా ఆంబ్రోస్ జంటగా అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఒక్కడు మిగిలాడు’. ఎస్.ఎన్. రెడ్డి, లక్ష్మీకాంత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది.
హైదరాబాద్‌లో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో మనోజ్ మాట్లాడుతూ– ‘‘సిరియాలో ఓ చిన్నారి మృతదేహం నీటిలో కొట్టుకుని వచ్చిన ఫోటో చూసినప్పుడు ప్రపంచం ఉలిక్కి పడింది. ఓ ఫొటో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే, సినిమా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అనే ఆలోచనతో అజయ్ ఈ సినిమా చేశాడు. ఈ చిత్రానికి హీరో నేను కాదు... అజయ్ ఆండ్రూస్. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్న రోజునే మన దేశం ముందుకెళుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో మనోజ్ రెండు పాత్రలను అద్భుతమైన వేరియేషన్స్‌తో క్యారీ చేశాడు.
టీమ్ చేసిన ఈ మంచి ప్రయత్నం చలన చిత్ర చరిత్రలో నిలిచిపోవాలని కోరుకుంటున్నా’’ అని నారా రోహిత్ అన్నారు. ‘‘విజువల్స్ చూస్తుంటే మంచి ప్రయత్నం చేశారని తెలుస్తోంది. టీజర్‌లో మనోజ్ పర్ఫార్మెన్స్ చూసి థ్రిల్లయ్యా’’ అని దర్శకుడు ఎన్. శంకర్ తెలిపారు. అజయ్ ఆండ్రూస్ మాట్లాడుతూ – ‘‘సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే టెంపోలో ఉంటుంది. పాటలు ఉండవు. ఇలాంటి సినిమా చేయడానికి రెండు పిల్లర్స్ కావాలి.
మొదటి పిల్లర్ మనోజ్‌గారు. రెండో పిల్లర్ నిర్మాతలు. బ్రతకడానికి మనిషి ఎంత కష్టపడుతున్నాడనే సామాన్యుడి వేదన ఈ సినిమాలో కనపడుతుంది. నా ముత్తాత, తాతలు స్వాతంత్య్ర సమరయోధులు. నాన్న, మావయ్యలు ఆర్మీలో పనిచేశారు. అందుకనే ఈ డిఫరెంట్ కంటెంట్‌ను సినిమాగా తీశా’’ అన్నారు. ‘‘ఏడాదికి పైగా ఈ సినిమాతో జర్నీ చేశాం. సముద్రంలో ఎక్కువ రోజులు షూటింగ్ చేసిన మూవీ ఇదే’’ అన్నారు ఎస్.ఎన్. రెడ్డి. అనీషా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment