
బాబోయ్ సూర్యుడు...
సూర్యుడు లేకపోతే ఈ ప్రపంచమే లేదు. సూర్యుడంటే అందరికీ ఇష్టమే. కానీ సూర్య అనే యువకుడికి మాత్రం సూర్యుడంటేనే భయం. అడుగు బయటకు పెట్టాలంటే వణికిపోతాడు. అందరిలా ఉదయం తిరగలేడు. అందుకనే నిశాచరుడిలా తిరుగుతూ ఉంటాడు. అలాంటి యువకుడు ఒక అమ్మాయి ప్రేమలో పడితే..? దాని పర్యవసానాలు ఏమిటి...? అనే కథాంశంతో రూపొందుతోన్న ‘సూర్య వర్సెస్ సూర్య’. నిఖిల్, త్రిధ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. త్వరలో పాటలను, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘సూర్యుడి కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే వ్యాధితో బాధపడుతున్న యువకుడు తన జీవితలక్ష్యాన్ని ఎలా సాధించాడన్నది ఈ సినిమా ఇతివృత్తం. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: చందు మొండేటి.