surya Vs surya
-
ఈ విజయాలను ఎప్పటికీ మర్చిపోలేను : నిఖిల్
వరుస విజయాలతో నిఖిల్ మంచి జోష్ మీద ఉన్నారు. ఈ విజయాలకు కొనసాగింపుగా నిలిచే చిత్రాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఈ మూడు చిత్రాల విజయంతో హ్యాట్రిక్ సాధించిన నిఖిల్ ఆ ఆనందాన్ని పాత్రికేయులతో పంచుకున్నారు. నిఖిల్ మాట్లాడుతూ -‘‘భవిష్యత్తులో నేను ఎన్ని సినిమాలు చేసినా ఈ వరుస విజయాలను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. ‘హ్యాపీడేస్’తో ప్రారంభమైన నా కెరీర్ ‘స్వామి రారా’తో మంచి మలుపు తీసుకుంది. ఈ చిత్రం హీరోగా మంచి కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. భవిష్యత్తులో నేను చేసే చిత్రాలు కూడా జనరంజకంగా ఉండాలనుకుంటున్నాను. కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తున్నా’’ అన్నారు. నిఖిల్ నిర్మాతల హీరో అనీ, ‘సూర్య వర్సెస్ సూర్య’ విడుదలై 25 రోజులై, ఇంకా మంచి వసూళ్లు రాబడుతోందని ఆ చిత్రనిర్మాత మల్కాపురం శివకుమార్ తెలిపారు. నిఖిల్ హ్యాట్రిక్ సాధించడం ఆనందంగా ఉందని ‘స్వామి రారా’ దర్శకుడు సుధీర్‌వర్మ అన్నారు. నిఖిల్ ఒప్పుకుంటే ‘కార్తికేయ’కు సీక్వెల్ తీస్తానని ఆ చిత్రదర్శకుడు చందు మొండేటి పేర్కొన్నారు. ఈ సమావేశంలో చైతన్యకృష్ణ, చక్రి చిగురుపాటి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, రాజా రవీంద్ర, వైవా హర్ష తదితరులు పాల్గొన్నారు. -
లేడీస్ టైలర్ రోజులు గుర్తొచ్చాయి - తనికెళ్ల భరణి
అప్పట్లో ‘లేడీస్ టైలర్’ పెద్ద హిట్టయింది. దానికీ మేమంతా ఓ టీమ్‌లా కలసి మెలసి పనిచేశాం. ‘సూర్య వెర్సస్ సూర్య’ టీమ్‌తో వర్క్ చేస్తుంటే నాకా రోజులు గుర్తొచ్చాయి’’ అని తనికెళ్ల భరణి అన్నారు. నిఖిల్, త్రిధా చౌధురి జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ ప్లాటినమ్ డిస్క్ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. నిఖిల్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా పదకొండు రోజులకు పదకొండు కోట్లు వసూలు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు. విభిన్న నేపథ్యంలో చేసిన మా ప్రయత్నం ఇంత ఘన విజయం సాధించడానికి ప్రేక్షకులు కారణమని నిర్మాతలు చెప్పారు. సంగీత దర్శకుడు సత్య మహావీర్, రచయిత చందు మొండేటి, ‘తాగుబోతు’ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై ఏటా రెండు సినిమాలు
‘‘మధ్య తరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన నేను పలు వ్యాపారాలు చేశాను. నా బాల్య మిత్రుడు, నటుడు స్వర్గీయ శ్రీహరి ప్రోత్సాహం వల్లే సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ‘భద్రాద్రి’ మొదలుకుని ఇటీవల తీసిన ‘సూర్య వెర్సస్ సూర్య’ వరకు నా సినిమా ప్రయాణం బాగా సాగింది’’ అని నిర్మాత మల్కాపురం శివకుమార్ చెప్పారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నిఖిల్, త్రిధా చౌదురి జంటగా ఆయన నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ గత వారం విడుదలైంది. ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని శివకుమార్ చెబుతూ -‘‘సరికొత్త కథాంశానికి వినోదం, సందేశం జోడించి ఈ సినిమా రూపొందించాం. ఈ చిత్రానికి తల్లీ, కొడుకుల సెంటిమెంట్ హైలైట్‌గా నిలిచింది. అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే సినిమా తీసినందుకు ఆనందంగా ఉంది. నిఖిల్ నటన, కార్తీక్ దర్శకత్వ ప్రతిభ.. ఇలా అన్నీ బాగా కుదిరాయి. ఇక నుంచీ ఏడాదికి రెండు సినిమాలు నిర్మించాలనుకుంటున్నా. వచ్చే ఏడాది ఓ అగ్ర హీరోతో సినిమా నిర్మించబోతున్నా’’ అని తెలిపారు. ఏటా చిత్రపరిశ్రమ నుంచి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందనీ, ప్రభుత్వానికి పన్నుల రూపంలో సుమారు వంద కోట్లు అందుతున్నాయనీ, ఆ డబ్బు నుంచి సినిమా పరిశ్రమకు నిధులు కేటాయించాలనీ ఆయన సూచించారు. -
యూత్ కనెక్ట్ అయ్యారు : తనికెళ్ల భరణి
‘‘ ‘స్వామి రారా’, ‘ కార్తికే య’ చిత్రాల తరువాత నా సినిమాల మీద అంచనాలు బాగా పెరిగాయి. వాటిని నిలబెడుతూ ఈ సినిమా మంచి వసూళ్లతో నడుస్తోంది’’ అని నిఖిల్ చెప్పారు. నిఖిల్, త్రిధా చౌధురి జంటగా సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ ఇటీవల విడుదలైంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్‌మీట్‌లో తనికెళ్ల భరణి మాట్లాడుతూ -‘‘పిరికివాడు ధైర్యవంతుడిగా ఎలా మారాడు అని చూపించిన విధానానికి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. యంగ్ టీమ్‌ను నమ్మి ఈ సినిమా తీసిన నిర్మాతకు నా అభినందనలు . అన్ని పాత్రలకు మంచి స్పందన వస్తోంది’’ అన్నారు. కార్తీక్ మాట్లాడుతూ -‘‘క్వాలిటీ విషయంలో రాజీపడకుండా నిర్మాత చాలా బాగా సహకరించారు, సంభాషణల విషయంలో భరణి గారి తోడ్పాటు మర్చిపోలేను’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శివకుమార్, నటులు ప్రవీణ్, హర్ష పాల్గొన్నారు. -
త్రిధా చౌదరితో గెస్ట్ టైం!
-
మొదట్లో ఇబ్బంది అనిపించింది!
‘‘కలలో కూడా ఊహించనవి జరిగినప్పుడు.. అది కూడా మంచి విషయాలైనప్పుడు స్వీట్ షాక్‌లా ఉంటుంది. ‘సూర్య వెర్సస్ సూర్య’కు అవకాశం వచ్చినప్పుడు నాకలాంటి అనుభూతే కలిగింది. నా మాతృభాష బెంగాలీలో పలు చిత్రాల్లో నటించినా, ఓ కొత్త భాషలో అవకాశం రావడం ఆనందంగా ఉంది’’ అని త్రిధా చౌదరి అన్నారు. నిఖిల్ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ ఈ గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా త్రిధా కథానాయికగా పరిచయమయ్యారు. ఈ చిత్రం తనకు మంచి గుర్తింపు తెచ్చిందని త్రిధా చెబుతూ -‘‘వాస్తవానికి నేను పగటిపూటను ఇష్టపడినంతగా రాత్రిని ఇష్టపడను. కానీ, ఈ చిత్రం షూటింగ్ ఎక్కువగా రాత్రిపూట జరిగింది. దాంతో మొదటి రెండు, మూడు రోజులు ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాత అడ్జస్ట్ అయ్యా’’ అన్నారు. ప్రస్తుతం బెంగాలీలో ప్రముఖ దర్శకుడు కమలేశ్వర్ ముఖర్జీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాననీ, తెలుగు చిత్రాలకు సంబంధించి కథలు వింటున్నాననీ త్రిధా తెలిపారు. -
సినిమా రివ్యూ - సూర్య వర్సెస్ సూర్య
కాన్సెప్ట్‌ను మింగేసిన కథన లోపాలు చిత్రం - సూర్య వర్సెస్ సూర్య, తారాగణం - నిఖిల్, త్రిధా చౌధరీ, మధుబాల, తనికెళ్ళ భరణి, మాటలు - చందు మొండేటి, సంగీతం - సత్య మహావీర, కూర్పు - గౌతమ్ నెరుసు, నిర్మాత - మల్కాపురం శివకుమార్, రచన - ఛాయాగ్రహణం, దర్శకత్వం - కార్తీక్ ఘట్టమనేని కొత్త రకం కథలు రావడం లేదనేది ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు చేసే ఫిర్యాదు. అయితే, ఎంచుకున్న ఇతివృత్తం, తీసుకున్న కథ కొత్తగా ఉంటే చాలా? వాటికి న్యాయం చేకూర్చేలా స్క్రిప్టును తీర్చిదిద్దుకొని, కథనాన్ని నడిపించకపోతే? అప్పుడూ మళ్ళీ నిరాశ తప్పదు. మరి, రొడ్డకొట్టుడు సినిమాలు ఎక్కువగా వస్తున్న సమయంలో ఆ మూసను బద్దలుకొట్టుకొని, ఒక చిన్న వెరైటీ పాయింట్‌తో వచ్చిన సినిమా - ‘సూర్య వర్సెస్ సూర్య’. సూర్యరశ్మి పడని ఒక యువకుడి చుట్టూ తిరుగుతుందీ చిత్రకథ. కథ ఏమిటంటే... అనగనగా ఓ యువకుడు. పేరు సూర్య (నిఖిల్). కానీ, అతనికో విచిత్రమైన జబ్బు. సూర్యరశ్మి కాసేపు తగిలినా అతని ఒళ్ళు కాలిపోతుంది. ప్రాణాంతకమవుతుంది. శాస్త్రీయంగా ఆ జబ్బు పేరు మాటెలా ఉన్నా, అతని చిన్నప్పుడే ఆ సంగతి డాక్టర్ (రావు రమేశ్) ద్వారా తెలుసుకుంటుంది ధనికురాలైన అతని తల్లి (మణిరత్నం ‘రోజా’ ఫేమ్ మధుబాల). అప్పటి నుంచి పగటి పూట అతణ్ణి బయటకు పంపకుండా, ఇంట్లోనే పెంచుతుంది. సూర్యుణ్ణి చూడకుండా పెరిగే సూర్య జీవితమంతా సాయంత్రం 6.30 గంటల నుంచి తెల్లవారే ముందు దాకానే! అలాంటి సూర్య కాస్తా చదువు కోసం ఒక రాత్రిపూట కళాశాలలో చేరతాడు. లేటు వయసులో చదువు కోసం కాలేజీలో చేరిన కిరాణాషాపు యజమాని ఎర్రిసామి అలియాస్ ఎర్శామ్ (తనికెళ్ళ భరణి), ఆటో డ్రైవర్ అరుణ్‌సాయి (సత్య అక్కల) అక్కడ హీరోకు పరిచయమవుతారు. వాళ్ళతో స్నేహం పెరిగిన హీరో, రెండేళ్ళుగా తాను ప్రేమిస్తున్న టీవీ యాంకర్ సంజన (త్రిధా చౌధరీ) ప్రేమ గెలుచుకోవడానికి వాళ్ళ సాయం తీసుకుంటాడు. తన జబ్బు సంగతి మిత్రుల ద్వారానే ఆమెకు తెలియజేస్తాడు. దాంతో, ఆమె, జర్నలిస్టయిన ఆమె తండ్రి (సాయాజీ షిండే) కోపగిస్తారు. హీరోను దూరం పెడతారు. ఆ పరిస్థితుల్లో ప్రేమను గెలుచుకోవడానికి సూర్య ఏం చేశాడు? ఏమైందన్నది మిగతా కథ. ఎలా చేశారంటే... గతంలో ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ లాంటి విజయవంతమైన చిత్రాల రూపకల్పనకు కలసి కృషి చేసిన యువ బృందం మరోసారి చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఆ రెండు వరుస హిట్ల తరువాత ఇందులో సూర్య పాత్రలో నిఖిల్ ఎండ వేడిమికి తట్టుకోలేని వ్యాధి తాలూకు బాధను వ్యక్తం చేయడానికి ప్రయత్నించారు. తరచూ హుషారు పాత్రల్లోనే చూసే అతణ్ణి ఇలా చూడడం ప్రేక్షకులకు వెంటనే జీర్ణం కాదు. కథానాయికగా విభా నుంచి అందం, అభినయాలు ఆశించలేం. తల్లి పాత్రధారిణి మధుబాల మంచి నటి అయినా, అతిగా సన్నబడి, హీరో పాత్రకు కాదు... తల్లి పాత్రకే అనారోగ్యమేమో అనిపించేలా ఉండడం మైనస్. ఆ బలహీనతకు సన్నివేశాల్లోని బలహీనత తోడైంది. చాలాకాలం తరువాత తనికెళ్ళ భరణి ఒక పూర్తి నిడివి పాత్రలో సినిమా అంతా కనిపించారు. కొన్నిచోట్ల నటనలో తనదైన చమక్కులు చూపించారు. ఆటో డ్రైవర్ పాత్రధారి కూడా కాసేపు నవ్వించారు. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే, ఛాయాగ్రహణం నుంచి దర్శకత్వానికి ఓ మెట్టు ఎదిగిన కార్తీక్ ఘట్టమనేని తన మునుపటి చిత్రాల కెమేరా వర్క్‌కు తక్కువ కాకుండా ఈ సినిమాను నడిపించారు. దృశ్యపరమైన అందం, లైటింగ్ తెలుస్తూ ఉంటాయి. అది సినిమాకు కొంత ప్లస్ పాయింట్. పాటలు, సంగీతం ఫరవాలేదనిపిస్తాయి. కాకపోతే, పదే పదే వినడానికీ, ప్రేక్షకులను రప్పించడానికీ దోహదపడతాయా అన్నది సందేహం. ఫస్టాఫ్‌లో వచ్చే ‘హృదయం పరిగెడుతోందే...’ అనే గజల్ తరహా గీతంలో హార్మోనియమ్ ముందేసుకొని, పాట పాడుతూ గీత రచయిత రామజోగయ్యశాస్త్రి క్షణకాలం తళుక్కుమంటారు. సన్నివేశాలు, సంభాషణల రచనలో లేని పదునును ఎడిటింగ్ దగ్గర ఆశించలేం. ఎలా ఉందంటే... నటీనటులు తక్కువే అయినా, నైట్ ఎఫెక్ట్‌ల మధ్య నిర్మాణ విలువలు బాగానే అనిపించే సినిమా ఇది. ఎటొచ్చీ స్క్రిప్టును అల్లుకున్న తీరులో, కథను నడిపించిన తీరులో తడబాట్లు ఉన్నాయి. దర్శకుడు కొత్తవాడు కావడమూ కొంత కారణమేమో అనిపిస్తుంది. నిజానికి, ఫస్టాఫ్ మొత్తం ఫ్లాష్‌బ్యాక్‌లో హీరో తన ప్రేమ, ఆ ప్రేమను పొందడానికి పడే తపనతో సరిపోతుంది. ఎండ ఉండగా బయటకు రాలేని హీరో, ఆ సంగతి బయటపెట్టకుండానే, కష్టంలో ఉన్న హీరోయిన్ను కాపాడే సీన్ దగ్గర ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఫస్టాఫ్ కాస్తంత అటూ ఇటూగా ఉన్నా, బలమైన ఇంటర్వెల్ ఘట్టం లాంటివి తోడై ఫరవాలేదనిపిస్తుంది. తీరా సెకండాఫ్‌లో హీరోయిన్‌కు ఆ విషయాన్ని ఎలా తెలియజేశాడు, వాళ్ళకు ఎలాంటి కష్టాలు వచ్చాయి లాంటివి ఏమైనా చూపిస్తారేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తాం. కానీ, కథ అక్కడ గాడి తప్పినట్లనిపిస్తుంది. మామూలు ప్రేమ కథలాగే కొనసాగుతుంది. హీరోయిన్, ఆమె తండ్రి కలసి హీరోను ఎందుకు కాదన్నారు, చివరకు ఎందుకు సరే అన్నారన్నదానికీ బలమైన కారణం కనిపించదు. జనం లేని దీవి లాంటి చోట హీరో కథ, అక్కడ పడవ దొరకడం, టీవీ చానల్లో హీరో బృందం ప్రత్యక్ష ప్రసారం లాంటివన్నీ కథను ముందుకు నడపడం కోసం సినిమాటిక్‌గా బలవంతాన అల్లుకున్నట్లనిపిస్తాయి. అలా కాకుండా, కథలో సహజమైన పురోగతి ఉండేలా చూసుకుంటే బాగుండేది. నిజానికి, తల్లీ కొడుకుల అనుబంధం, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమకు అతని జబ్బు అనుకోని ఇబ్బందులు తేవడం, పగటి వేళ తప్పనిసరైన బయటకు రావాల్సి వచ్చిన హీరో దాన్ని తెలివిగా తప్పించుకొనే వైనం - ఇలా ఎన్నెన్నో అంశాలతో ఈ కాన్సెప్ట్‌ను మరింత బలంగా తీర్చిదిద్దుకొనే అవకాశం ఉంది. కానీ, దర్శక, రచయిత ఎందుకనో బంగారం లాంటి ఆ అవకాశాన్ని వదులుకున్నారు. బలహీనమైన సన్నివేశాలు, అనాసక్తికరమైన స్క్రీన్‌ప్లేతోనే సినిమా అయిందనిపించారు. వెరసి ఈ సినిమా కొత్త కాన్సెప్ట్‌ను ఎంచుకున్న చిత్రంగా గుర్తున్నా... చివరకు మంచి కాన్సెప్ట్ వర్సెస్ బలహీనమైన కథాకథనంగానే మిగిలిపోతుంది. - రెంటాల జయదేవ -
సూర్య vs సూర్య టీంతో చిట్‌చాట్
-
నిఖిల్ Vs సూర్య
-
సూర్యుడంటే పడదు...
ఆ యువకుడి పేరు సూర్య. కానీ అతనికి సూర్యుడంటే అస్సలు పడదు. పగలు బయట అడుగు పెట్టాడంటే అతను చనిపోవాల్సిందే. అందుకే రాత్రుళ్లే సంచరిస్తుంటాడు. మరి అతను అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించాడు అనేది తెలియాలంటే ‘సూర్య వెర్సెస్ సూర్య’ చూడాల్సిందే. సురక్ష్ ఎంటర్టైనమెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటడ్ పతాకంపై నిఖిల్, త్రిద జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని మార్చి 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ -‘‘ప్రేమ కథా నేపథ్యంలో వచ్చే ఓ విభిన్న చిత్రమిది. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ చిత్రాలను మించి పెద్ద హిట్ అవుతుంది’’ అని తెలిపారు. సూర్యుడికి, సూర్యకి మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రమని దర్శకుడు పేర్కొన్నారు. రచయిత చందు మొండేటి మాట్లాడుతూ -‘‘ప్రచార చిత్రాలకు, పాటలకు మంచి స్పందన వస్తోంది. నిఖిల్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రం అవుతుంది’’అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 700 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. -
నిఖిల్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్
-
దైవికంగా అంతా బాగా కుదిరింది : తనికెళ్ల భరణి
‘‘ద ర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు రాత్రిళ్లే షూటింగ్ ఉంటుందని గ్రహించాను. చాలా కష్టమనుకున్నాను. కానీ దైవికంగా అంతా బాగా కుదిరింది. కార్తీక్ చాలా అద్భుతంగా తీశాడు. భవిష్యత్తులో తను పెద్ద దర్శకుడు అవుతాడు’’ అని తనికెళ్ల భరణి చెప్పారు. నిఖిల్, త్రిదా జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో బేబి త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. సత్యమహావీర్ స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాద వ్ ఆవిష్కరించి, విభిన్న నేపథ్యంతో తీసిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలన్నారు. నిఖిల్ మాట్లాడుతూ- ‘‘ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. చందూ, కార్తీక్, నేను ఓ మంచి సినిమా తీయాలన్న ఆకాంక్షతో ఈ ప్రాజెక్ట్ చేశాం’’ అన్నారు. ఒక షార్ట్ ఫిలిం తీయడానికి ఆరు నెలలు తీసుకున్నాననీ, కానీ ఈ చిత్రాన్ని ఆరు నెలల్లోనే పూర్తి చేశాననీ, దీనికి చిత్రబృందం సహకారమే కారణమనీ దర్శకుడు అన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెస్ రాజు, సందీప్ కిషన్, వీరభద్రం, సుశాంత్, ఎన్.శంకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
ప్రేమానుభవం!
‘‘ఆ యువకుడి పేరు సూర్య. కానీ సూర్యరశ్మిని ఏమాత్రం తట్టుకోలేని వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అందుకే రాత్రిళ్లు మాత్రమే తిరుగుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో సూర్య ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ తరువాత అతని జీవితంలో ఎదురైన అనుభవాలు ఏంటో తెలుసుకోవాలంటే ‘సూర్య వర్సెస్ సూర్య’ చూడాల్సిందే’’ అని చిత్ర దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చెప్పారు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. ఈ సినిమా ఇటీవలే చిత్రీక రణ పూర్తిచేసుకుంది. సత్యమహవీర్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను ప్రేమికుల రోజైన ఈ నెల 14న విడుదల చేస్తున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: చందూ మొండేటి. -
సూర్య vs సూర్య మూవీ స్టిల్స్
-
బాబోయ్ సూర్యుడు...
సూర్యుడు లేకపోతే ఈ ప్రపంచమే లేదు. సూర్యుడంటే అందరికీ ఇష్టమే. కానీ సూర్య అనే యువకుడికి మాత్రం సూర్యుడంటేనే భయం. అడుగు బయటకు పెట్టాలంటే వణికిపోతాడు. అందరిలా ఉదయం తిరగలేడు. అందుకనే నిశాచరుడిలా తిరుగుతూ ఉంటాడు. అలాంటి యువకుడు ఒక అమ్మాయి ప్రేమలో పడితే..? దాని పర్యవసానాలు ఏమిటి...? అనే కథాంశంతో రూపొందుతోన్న ‘సూర్య వర్సెస్ సూర్య’. నిఖిల్, త్రిధ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. మల్కాపురం శివకుమార్ నిర్మాత. త్వరలో పాటలను, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘సూర్యుడి కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే వ్యాధితో బాధపడుతున్న యువకుడు తన జీవితలక్ష్యాన్ని ఎలా సాధించాడన్నది ఈ సినిమా ఇతివృత్తం. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: చందు మొండేటి. -
చాలా బాగుంటుంది!
‘‘నిఖిల్ నటించిన ‘కార్తికేయ’ చిత్రం చూసి, ఫోన్ చేసి అభినందించాను. ఈ చిత్రానికి కార్తికేయ చేసిన ఫొటోగ్రఫీ ఓ ప్లస్ పాయింట్. నిఖిల్ చేస్తున్న తాజా చిత్రం ‘సూర్య వెర్సస్ సూర్య’ ట్రైలర్స్ చూస్తుంటే మంచి సైకలాజికల్ థ్రిల్లర్ అనిపిస్తోంది. కార్తికేయ దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ సినిమా విజయం సాధించాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. నిఖిల్, త్రిద జంటగా బేబి త్రిష సమర్పణలో రూపొందుతున్న ‘సూర్య వర్సెస్ సూర్య’ ప్రచార చిత్రాన్ని వినాయక్ ఆవిష్కరించారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. వినూత్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని నిఖిల్ చెప్పారు. ఇప్పటివరకు చేసిన షూటింగ్ అవుట్‌పుట్ బాగా వచ్చిందని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రముఖులు యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. -
సర్ప్రైజింగ్ స్టోరీ
మరో ఛాయాగ్రాహకుడు మెగాఫోన్ పట్టారు. ‘కార్తికేయ’ చిత్రానికి ఛాయాగ్రహణం సమకూర్చిన కార్తీక్ ఘట్టమనేనిని దర్శకునిగా పరిచయం చేస్తూ నిఖిల్ హీరోగా ‘సూర్య వర్సెస్ సూర్య’ రూపొందుతోంది. బేబీ త్రిష సమర్పణలో మల్కాపురం శివకుమార్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. స్వామి రారా, కార్తికేయ చిత్రాల తరహాలో విభిన్నమైన ఇతివృత్తంతో వినోదాత్మకంగా ఈ సినిమా రూపొందుతోందని నిర్మాత తెలిపారు. ఇందులో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయని దర్శకుడు చెప్పారు. త్రిదా చౌదరి నాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: సత్యమహవీర్, మాటలు: చందు మొండేటి -
సూర్య వర్సెస్ సూర్య
నిఖిల్ కథానాయకునిగా, ఛాయాగ్రాహకుడు కార్తీక్ ఘట్టమనేనిని దర్శకునిగా పరిచయం చేస్తూ మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న చిత్రానికి ‘సూర్య వర్సస్ సూర్య’ అనే పేరును ఖరారు చేశారు. నేటి నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘‘స్వామి రారా’, ‘కార్తికేయ’ తరహాలోనే నిఖిల్ చేస్తున్న మరో భిన్నమైన సినిమా ఇది. ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. కథానాయికను త్వరలో ఎంపిక చేస్తాం’’ అని తెలిపారు. తనికెళ్ల భరణి, సత్య తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సత్యం.