ఇకపై ఏటా రెండు సినిమాలు
‘‘మధ్య తరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన నేను పలు వ్యాపారాలు చేశాను. నా బాల్య మిత్రుడు, నటుడు స్వర్గీయ శ్రీహరి ప్రోత్సాహం వల్లే సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. ‘భద్రాద్రి’ మొదలుకుని ఇటీవల తీసిన ‘సూర్య వెర్సస్ సూర్య’ వరకు నా సినిమా ప్రయాణం బాగా సాగింది’’ అని నిర్మాత మల్కాపురం శివకుమార్ చెప్పారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నిఖిల్, త్రిధా చౌదురి జంటగా ఆయన నిర్మించిన ‘సూర్య వెర్సస్ సూర్య’ గత వారం విడుదలైంది.
ఈ చిత్రం మంచి వసూళ్లు రాబడుతోందని శివకుమార్ చెబుతూ -‘‘సరికొత్త కథాంశానికి వినోదం, సందేశం జోడించి ఈ సినిమా రూపొందించాం. ఈ చిత్రానికి తల్లీ, కొడుకుల సెంటిమెంట్ హైలైట్‌గా నిలిచింది. అన్ని వర్గాలవారినీ ఆకట్టుకునే సినిమా తీసినందుకు ఆనందంగా ఉంది. నిఖిల్ నటన, కార్తీక్ దర్శకత్వ ప్రతిభ.. ఇలా అన్నీ బాగా కుదిరాయి.
ఇక నుంచీ ఏడాదికి రెండు సినిమాలు నిర్మించాలనుకుంటున్నా. వచ్చే ఏడాది ఓ అగ్ర హీరోతో సినిమా నిర్మించబోతున్నా’’ అని తెలిపారు. ఏటా చిత్రపరిశ్రమ నుంచి దాదాపు వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందనీ, ప్రభుత్వానికి పన్నుల రూపంలో సుమారు వంద కోట్లు అందుతున్నాయనీ, ఆ డబ్బు నుంచి సినిమా పరిశ్రమకు నిధులు కేటాయించాలనీ ఆయన సూచించారు.