సినిమా: ఆ నటుడెంత మంచి వాడో అని ప్రశంసల వర్షం కురిపిస్తోంది నటి నిత్యామీనన్. మాతృభాష మలయాళం నుంచి, తమిళం, తెలుగు అంటే పాత్ర నచ్చితే అది ఎలాంటిదైనా నటించడానికి రెడీ అనే నటి నిత్యామీనన్. అందుకే దక్షిణాదిలో ఈ బ్యూటీకి నటిగా మంచి పేరు ఉంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో విజయ్, సూర్య, విక్రమ్ వంటి స్టార్ హీరోలందరితోనూ జత కట్టేసింది. ఈ మధ్య విజయ్‌కు జంటగా మెర్శల్ చిత్రంలో నటించి ఇతర హీరోయిన్లు, సమంత, కాజల్‌అగర్వాల్ కంటే మంచి పేరు కొట్టేసింది. తాజాగా నయనతార, త్రిష వంటి ప్రముఖ నటీమణులను దాటి దివంగత ముఖ్యమంత్రి జయలలిత పాత్రలో నటించే అవకాశం ఈ అమ్మడిని వరించింది. ఈ సందర్భంగా ఈ బ్యూటీతో చిన్న చిట్‌చాట్..
ప్ర: నిత్యామీనన్ మీది ఎలాంటి క్యారెక్టర్?
జ: చాలా సహజంగా ఉంటాను. ఆహారం, నిద్రించే స్థలం లాంటి వాటి విషయంలో చాలా సర్దుకుపోయే స్వభావం నాది. అదే విధంగా నేను చాలా సెన్సిటివ్ కూడా.
ప్ర: చిత్రాల ఎంపికలో ఎలా?
జ: ముందు చిత్ర కథ నన్ను ఆకట్టుకోవాలి. అలాంటి కథా చిత్రాల్లోనే నటించడానికి అంగీకరిస్తాను. ఈ విషయంలో నా నిర్ణయాన్ని ఇప్పటి వరకూ మార్చుకోలేదు. చాలా చిత్రాల కంటే మంచి కథా చిత్రాల్లోనే నటించాలని కోరుకుంటాను. అలా మంచి కథా పాత్రలు లభించడం కూడా యథేచ్ఛగానే జరుగుతోంది.
ప్ర: మీ దృష్టిలో కోలీవుడ్ హీరోలు?
జ: నటుడు విజయ్ చాలా ప్రశాంతంగా ఉంటారు. షూటింగ్ స్పాట్‌లో ఆయన ఉన్నట్టే తెలియనంతగా వ్యవహరిస్తారు. చాలా మితభాషి. ఇక విక్రమ్‌లా పాత్రగా మారిపోవడానికి శ్రమించే నటుడిని మరొకరిని చూడలేదు. అంతగా శ్రద్ధ చూపుతారు. ఆయన మాదిరి నటించాలని ఆశ పడుతున్నాను. నటుడు దుల్కర్‌సల్మాన్ నేను మంచి స్నేహితులం. ఇకపోతే నేను చూసిన వారిలోనే ఎంతో మంచి వ్యక్తి సూర్య.ఆయనతో కలిసి నటిస్తున్నప్పుడు చాలా పాజిటివ్ అనిపించింది.
ప్ర: మీకు అత్యంత సన్నిహితురాలు ఎవరూ?
జ: నటి రోహిణి. నేను చెన్నై వస్తే ఆమె ఇంట్లోనే బస చేస్తాను. భోజనం కూడా అక్కడే.అంత సన్నిహితురాలు రోహిణి.
ప్ర: గోల్ అంటూ ఏమైనా ఉందా.
జ: నిజం చెప్పాలంటే నేను మొదట్లో జర్నలిస్ట్‌ను కావాలని ఆశ పడ్డాను. అందుకే జర్నలిజం చదివాను. అలా పత్రికా విలేకరిగా కొత్త కొత్త విషయాలను చేయాలనుకున్నాను. ఆ తరువాత ఛాయాగ్రాహకురాలిని అవ్వాలని అనుకున్నాను. అసలు నటినవ్వాలని కోరుకోలేదు. ఇప్పుడు దర్శకత్వం చేపట్టాలన్న ఆశ ఉంది. వాస్తవ సంఘటనలో చిత్రాలు చేయాలనుకుంటున్నాను.
Comments
Please login to add a commentAdd a comment