వర్మ అంటే నాకేమీ కోపం లేదు: అమితాబ్
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటే తనకేమీ కోపం లేదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెప్పారు. వీళ్లిద్దరూ కలిసి సర్కార్, సర్కార్ రాజ్, రాంగోపాల్ వర్మా కీ ఆగ్, డిపార్ట్మెంట్ లాంటి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. 'బుడ్డా హోగా తేరా బాప్' సినిమా గురించి వర్మ తిడుతూ ట్వీట్లు చేసిన తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడాయి. తర్వాత డిపార్ట్మెంట్ సినిమా మధ్యలోంచి అభిషేక్ బచ్చన్ వెళ్లిపోవడంపై వర్మ ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డాడు. తర్వాత ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.
అయితే, తాజాగా 'సత్య 2' సినిమా ప్రమోషన్ కోసం వర్మ ఇచ్చిన ఓ పార్టీకి అమితాబ్ కూడా హాజరయ్యారు. సినిమాలు ఫ్లాప్ అయినంత మాత్రాన సంబంధాలు దెబ్బతింటాయనుకుంటే అది తప్పని, వర్మ అంటే తనకేమాత్రం కోపం లేదని ఈ సందర్భంగా అమితాబ్ అన్నారు. పైపెచ్చు, వర్మతో కలిసి పనిచేయడం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. గతంలో తాను హృషికేశ్ ముఖర్జీతో కలిసి ఎక్కువ సినిమాలు చేశానని, కానీ వర్మ ఇప్పుడు ఆ జాబితా దాటేశారని తెలిపారు. షూటింగ్ సమయంలో తామిద్దరి మధ్య మంచి అవగాహన ఉండటంతో చాలా మంచి వాతావరణం ఏర్పడుతుందని, అందుకే తాను మళ్లీ మళ్లీ వర్మ సినిమాల్లో నటిస్తుంటానని అమితాబ్ చెప్పుకొచ్చారు.