వెండితెర సమ్మోహన రూపానికి వజ్రోత్సవం | NTR 92 birthday anniversary on wednesday | Sakshi
Sakshi News home page

వెండితెర సమ్మోహన రూపానికి వజ్రోత్సవం

Published Tue, May 27 2014 10:14 PM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

వెండితెర సమ్మోహన రూపానికి వజ్రోత్సవం

వెండితెర సమ్మోహన రూపానికి వజ్రోత్సవం

వెండితెరపై కొన్ని పాత్రలకు కొంతమంది నటీనటులదే పేటెంట్. ఎన్నాళ్ళయినా, ఎన్నేళ్ళయినా ఆ పాత్రల పేర్లు చెప్పగానే వారే గుర్తుకొస్తుంటారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన అలాంటి పాత్రలంటే పౌరాణికాలే. ఇక, పాత్రధారి అంటే... పురాణ పాత్రలకు ప్రాణం పోసిన స్వర్గీయ నందమూరి తారక రామారావే స్ఫురిస్తారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శ్రీమహావిష్ణువు, పరమ శివుడు మొదలు ప్రతినాయకులైన రావణుడు, దుర్యోధనుడు దాకా ఏ పాత్ర పేరు చెప్పినా ఇవాళ్టికీ ఆయనే మదిలో మెదులుతారు.
 
 ముగ్ధమోహనరూపంతో, పాత్రోచితమైన ఆహార్యం, వాచికాలతో ఆనాడు వాళ్ళు అచ్చం ఇలాగే ఉన్నారేమో అని అందరూ అనుకొనేలా చేయడం ఆ మహానటుడు చేసిన అసాధారణ విన్యాసం. ఒక తెలుగు నటుడు వింధ్యకు ఇటు వైపునే కాక, అటు వైపునూ తన పాత్రలతో మెప్పించి, అంతర్జాతీయ సినీ చరిత్రకారులను సైతం అబ్బురపరచడం మనకు గర్వకారణమే. బెంగాలీయుల్ని కూడా కదిలించిన ఎన్టీఆర్ పౌరాణిక, జానపద చిత్రాలు, ఎన్టీఆర్‌తో సినిమా చేయాలనుకున్న శాంతారామ్ లాంటి దర్శకులే అందుకు నిదర్శనం. పౌరాణికాలు, చారిత్రకాలు, జానపదాలు, సాంఘికాలు - ఇలా అన్ని తరహా చిత్రాల్లో మెప్పించినా, ముఖ్యంగా శ్రీకృష్ణుడంటే ఇప్పటికీ ఎన్టీఆరే.
 
 1953లో షూటింగ్ మొదలైన ‘ఇద్దరు పెళ్ళాలు’లో మూడుపదుల వయసులో ఓ స్వప్నగీతంలో తెరపై కృష్ణుడిగా తొలిసారిగా కనిపించారాయన. అప్పటి నుంచి యాభై ఆరేళ్ళ వయసులో ‘శ్రీతిరుపతి వెంకటేశ్వర కల్యాణం’ (’79) దాకా ఇరవై ఏడేళ్ళ వ్యవధిలో ఒకే పాత్రను సుమారు 30 చిత్రాల్లో పోషించడం, జనాన్ని మెప్పించడం ఓ చరిత్ర. ప్రపంచ సినీ చరిత్రలో అలా ఒకే పాత్రను అన్నేళ్ళ పాటు చేసిన నటుడు ఇంకొకరు లేరు. ఇక, తెరపై ఓ నిర్దిష్టమైన వయసులోనే కనిపించే కృష్ణ పాత్రను వయసులో వచ్చిన మార్పులకు అతీతంగా మెప్పించడమూ ఆయనకే చెల్లింది. తెలుగునాట ఈ నటరత్నం జన్మించి, ఇవాళ్టితో 91 ఏళ్ళు నిండుతున్నాయి. ఇక, ఆయన తొలిసారిగా తెరపై శ్రీకృష్ణ పాత్రలో కనిపించి, ఈ ఏటితో 60 వసంతాలు పూర్తవుతున్నాయి. ఈ వజ్రోత్సవ పాత్రతో తెరపై ఆయన ఎప్పటికీ చిరంజీవే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement