సాక్షి, ముంబై : గోవాలో ఈ ఏడాది జరగబోయే ఇఫ్ఫీ 2017 వేడుకల్లో ప్రదర్శన కోసం ఎంపికైన రెండు చిత్రాలను తొలగించటం చర్చనీయాంశంగా మారింది. జ్యూరీ సభ్యులకు కూడా తెలీకుండా వాటిని సాంకేతిక సమాచార శాఖ తొలగించాల్సిన అవసరమేంటన్నదే అసలు ప్రశ్నగా మిగిలింది. ఈ పరిణామాలతోనే కలత చెందిన జ్యూరీ చీఫ్ సుజోయ్ గోష్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
చిత్రాలు-వాటి నేపథ్యం...
నటరంగ్, టైమ్‌పాస్, బాంజో వంటి చిత్రాలను అందించిన రవిజాదవ్ ‘న్యూడ్’ చిత్రానికి దర్శకుడు. ఓ గృహిణి తన కుటుంబానికి, కొడుక్కి తెలీకుండా రహస్యంగా నగ్న మోడల్ కావాలనుకుని ఆ దిశగా చేసే ప్రయత్నాలు.. ఆ క్రమంలో ఆమె ఎదుర్కునే కష్టాలు... అసలు ఆ రంగం ఎలా ఉంటుందన్న విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించాడు జాదవ్. కళ్యాణి ములాయ్, ఛయ్యా కదమ్ లీడ్ రోల్స్ పోషించగా... వెటరన్ నటుడు నసీరుద్దీన్ షా కూడా కళాకారుడిగా ఓ చిన్న పాత్రలో మెరిశారు.
అర్థరాత్రి ఓ యువతి ఎదుర్కున్న పరిస్థితుల నేపథ్యంలో మళయాళ చిత్రం ఎస్(సెక్సీ) దుర్గను సనాల్, శశిధరన్‌లు తెరకెక్కించగా... కన్నన్ నాయర్, రాజశ్రీ దేశ్‌పాండే ప్రధాన పాత్రాల్లో నటించారు. గతంలోనే ఈ చిత్ర టైటిల్ పై పెను దుమారం రేగగా.. ఆపై దానిని ఎస్ దుర్గగా మార్చేశారు. అయితే ఈ రెండు చిత్రాలు మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. ఇఫ్ఫీ జ్యూరీ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేసి రెండు నెలల క్రితం ఆ ప్రతిపాదనను సమాచార ప్రసార శాఖకు పంపించారు. ఇందులో న్యూడ్ ను తొలి చిత్రంగా ప్రదర్శించాలని నిర్ణయించారు. అయితే ఇంతలో ఏం జరిగిందో తెలీదుగానీ.. ఆ రెండు చిత్రాలను జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
‘‘కనీసం ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వమనే నేను అడుగుతున్నా. ప్రారంభ చిత్రంగా దీన్ని ఎంపిక చేయటం నేను గర్వంగా భావించా. కానీ, ఇప్పుడు వాళ్లు తీసుకున్న నిర్ణయం దిగ్భ్రాంతిని కలిగించింది’’ అని రవిజాదవ్ కోరుతున్నారు. ఈ మేరకు ఆయన ఐబీ మంత్రిత్వ శాఖకు లేఖ కూడా రాశారు. మరోవైపు ఎస్ దుర్గ దర్శకులు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైపోతున్నారు.
కారాణాలేంటి?
అయితే వాటి పేర్లు.. అభ్యంతరాలు వ్యక్తం కాకూడదన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే చివరి నిమిషంలో ఆ రెండు చిత్రాలను తొలగించి వాటి స్థానంలో మరో రెండు చిత్రాలకు చోటు కల్పించారని చెబుతున్నారు. ఈ నేఫథ్యంలోనే ఐఎఫ్‌ఎఫ్‌ఐ జ్యూరీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ దర్శకుడు సుజోయ్ గోష్ తన పదవికి రాజీనామా చేశారు.
అయితే ఈ వివాదంపై స్పందించిన గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ న్యూడ్ చిత్రానికి అసలు సెన్సార్ సర్టిఫికెట్ లేదని చెప్పటం విశేషం. మరో పక్క సెక్సీ దుర్గను ఇది వరకే మామి, కేరళ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించగా.. అక్కడ కొన్ని కట్లు పడ్డాయి. తర్వాత దానిపేరును ఎస్ దుర్గాగా మార్చేశారు. కానీ, ఇక్కడ చిత్రాన్ని ఎటువంటి కట్‌లు లేకుండా ప్రదర్శించాల్సి ఉంటుంది, పైగా ఇదివరకే దాని టైటిల్‌పై మతపరమైన వివాదాలు తెలెత్తాయి. అందుకే ఆ చిత్రాలను తొలగించి ఉంటారన్న అభిప్రాయం పారికర్ వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఇండియాకు ఇలాంటి చిత్రాలే అవసరం ఉందంటున్న పలువురు.. వాటిని ఇఫ్ఫీ పనోరమ ప్రదర్శన నుంచి తొలగించటం సిగ్గు చేటు అంటూ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment