
ఏడాది పాటు నాటకాలు వేశా!
‘‘చిన్నప్పుడు నేను చేసిన అల్లరిని పెద్దయ్యాక అప్పుడప్పుడూ అమ్మ చెబుతుంటుంది. అప్పుడు భలేగా ఉంటుంది. అందుకే వీలు చిక్కినప్పుడల్లా మా అమ్మను నా చిన్నప్పటి విశేషాలు చెప్పమని అడుగుతుంటా’’ అన్నారు తమన్నా. ఇటీవల ఓ సందర్భంలో తమన్నా తన చిన్ననాటి విశేషాలను గుర్తు చేసుకుంటూ -‘‘చిన్నప్పుడు నాటకాల్లో నటించాను. ముంబయ్‌లోని ప్రసిద్ధ పృథ్వీ థియేటర్‌లో దాదాపు ఏడాది పాటు నాటకాల్లో నటించాను. నాటకాల్లో ఉన్న వెసులుబాటు ఏమిటంటే.. ప్రేక్షకుల స్పందన అప్పటికప్పుడు తెలిసిపోతుంది.
నాకు చిన్నప్పుడు నాటకాలతో పాటు సినిమాలంటే కూడా బోల్డంత ఇష్టం. ముంబయ్‌లో మా ఇంటి చుట్టుపక్కల దాదాపు నాలుగైదు థియేటర్లు ఉండేవి. రిలీజైన ప్రతి సినిమా చూసేదాన్ని. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలకెళ్లేదాన్ని. ఒకవేళ ఇంటిపట్టున ఉంటే... ఒకే రోజు వరుసపెట్టి ఆరు సినిమాలు చూసేసేదాన్ని. మా అమ్మగారైతే ‘నీకు సినిమా పిచ్చి పట్టింది’ అనేవారు. అసలు అన్నేసి సినిమాలు అప్పుడు ఎలా చూశానో నాకే అర్థం కావడం లేదు’’ అని నవ్వేశారు.