
రీమేక్ కాదు.. ఫ్రీమేక్ కూడా కాదు...
‘అంకుశం’, ‘ఆహుతి’, ‘మహంకాళి’.. ఇలా రాజశేఖర్‌కి యాంగ్రీమ్యాన్ ఇమేజ్ తీసుకొచ్చినవి పోలీస్ క్యారెక్టర్లే. మరోసారి ఆయన పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ‘చందమామ కథలు’, ‘గుంటూర్ టాకీస్’ చిత్రాల దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఆయన్ను పోలీస్‌గా చూపించడానికి రెడీ అయ్యారు. అయితే ప్రచారంలో ఉన్నట్టు హాలీవుడ్ మూవీ ‘డై హార్డ్’కి ఫ్రీమేకో.. రీమేకో కాదట. ఆ చిత్రంలో బ్రూస్ విల్లీస్ పాత్ర తరహాలో రాజశేఖర్ క్యారెక్టర్ ఉంటుందని దర్శకుడి సన్నిహిత వర్గాలు తెలిపాయి.
రాజశేఖర్‌తో పాటు పలువురు కొత్త, పాత నటీనటులు ఈ చిత్రంలో నటించనున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఆల్రెడీ స్క్రిప్ట్ రెడీ అయ్యింది. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల రాజశేఖర్ నటించిన చిత్రాలు ఆశించిన విజయాలు సాధించలేదు. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించనున్న తాజా చిత్రం ఆ కొరతను తీర్చే విధంగా ఉంటుందని ఈ స్క్రిప్ట్ గురించి తెలిసినవాళ్లు అంటున్నారు.