
ఖల్‌నాయక్ అవుతున్న డాన్సింగ్ స్టార్
తమిళసినిమా: సినిమా కలర్ మారిపోతోందనడం సరికాదేమో కానీ, అందులోని తారల్లో మాత్రం మార్పు రావడం స్పష్టంగా కనిపిస్తోంది. విలన్ పాత్రదారులు హీరోలుగా నటించడం ప్రమోట్‌గా భావిస్తే, ఇప్పుడు హీరోలు విలన్‌గా నటించడాన్ని ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. డాన్సింగ్‌స్టార్ ప్రభుదేవా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పటి వరకూ ఈయన్ని ఒక కథానాయకుడిగానూ, దర్శకుడిగానూ చూశాం. తాజాగా ప్రతినాయకుడిగా చూడబోతున్నామనే టాక్ కోలీవుడ్‌లో స్ప్రెడ్ అయ్యింది.
ప్రభుదేవాకు బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా పేరుంది. అలాంటి ఆయన చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌కు దేవి చిత్రం ద్వారా కథానాయకుడిగా రీఎంట్రీ అయ్యి సక్సెస్ అయ్యారు. తాజాగా బ్యూటీ హన్సికతో కలిసి గులేభాకావళి, నటి లక్ష్మీమీనన్‌తో జత కట్టి యంగ్ మంగ్ జంగ్ చిత్రాల్లో రొమాన్స్ చేస్తున్నారు. వీటిలో గులేభాకావళి చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. తాజాగా ఆయన నాయక్ నహీ ఖల్‌నాయక్ మేహూ అంటున్నారు.
అవును మెర్కురీ చిత్రంలో ప్రభుదేవా ప్రతినాయకుడిగా నటిస్తున్నారన్నది తాజా సమాచారం. వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న ఇందులో బుల్లితెర నటుడు సనత్‌రెడ్డి హీరోగా నటిస్తున్నారు.దీపక్ పరమేశ్, రమ్యానంబీశన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ మెర్కురీ చిత్రం కూడా చాలా సైలెంట్‌గా చిత్రీకరణను పూర్తి చేసుకుని, నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇందులో ప్రభుదేవా విలనిజాన్ని చూడడానికి ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారని ప్రత్యేకంగా చెప్పాలా?