
ప్రసుతం ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా సినీ లెజండ్‌ల బయోపిక్‌లకు మంచి ప్రజాదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలీవుడ్‌లో ఎంజీఆర్, జయలలితల బయోపిక్‌లు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా వాటి సరసన దివంగత ప్రముఖ నటుడు చంద్రబాబు బయోపిక్ చేరనుంది. ఇందులో ‘డ్యాన్సింగ్ కింగ్’ ప్రభుదేవా చంద్రబాబు పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. దర్శకుడు రాజేశ్వర్ తెరకెక్కించనున్న చంద్రబాబు బయోపిక్‌లో ప్రభుదేవా ఆయన పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి ‘జేపీ ది లెజండ్ ఆఫ్ చంద్రబాబు’ అనే పేరును నిర్ణయించారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రభుదేవా నటించిన తాజా చిత్రం చార్లీచాప్లిన్–2 ఇటీవలే తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ప్రభుదేవా ‘దేవి–2’, ‘యంగ్ మంగ్ ఛంగ్’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.
చంద్రబాబు 1950-60 ప్రాంతంలో ఆటా, పాటా, నటన అంటూ అదరగొట్టిన నటుడు. అప్పట్లో చంద్రబాబు ఉంటే ఆ చిత్రం హిట్టే అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. ‘శభాష్ మీనా’ అనే చిత్రంలో నటించినందుకుగాను శివాజీగణేశన్ కంటే ఒక్క రూపాయి అధికంగా పారితోషికం తీసుకున్న నటుడిగా పేరుపొందారు. ఈయనకు చెన్నై, ఆర్ ఏ.పురంలో బ్రహ్మాండమైన ఇల్లు ఉండేది. అందులో రెండో అంతస్తు వరకూ కారు వెళ్లేలా మార్గాన్ని ఏర్పాటు చేశారట. అంత ఆడంబర జీవితాన్ని అనుభవించిన చంద్రబాబు 47 ఏళ్లకే జీవితాన్ని చాలించుకున్నారు. చివరికి ఆస్తులన్నీ పోగొట్టుకుని, తాగుడుకు బానిసై, అప్పుల బారిన పడి, అనారోగ్యానికి గురై జీవితాన్ని నాశనం చేసుకున్నారు. అలాంటి చంద్రబాబు బయోపిక్ వెండితెరకెక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment