
ప్రియాంకా చోప్రా ఇప్పుడు దేశీ స్టార్ మాత్రమే కాదు.. అమెరికన్ సిరీస్ ‘క్వాంటికో’ ద్వారా చిన్ని తెరకు వెళ్లి, ఇంటర్నేషనల్ లెవల్ పాపులార్టీ సంపాదించుకున్నారు. పాపులార్టీతో పాటు ప్రియాంక సంపాదన కూడా ఎవరూ ఊహించనంతగా పెరిగిపోయింది. గత ఏడాది జూన్1 నుంచి 2017 జూన్ 1 వరకు ఎక్కువ సంపాదించిన టీవీ నటీమణుల జాబితాను ఫోర్బ్స్ పత్రిక బయటపెట్టింది.
అందరూ హాలీవుడ్ తారలు ఉన్న ఈ లిస్టులో మన ప్రియాంకా చోప్రా పేరు ఉండటం విశేషం. టీవీ షోస్, యాడ్స్ ద్వారా ఈ బ్యూటీ దాదాపు 70 కోట్లు సంపాదించి, ఎనిమిదో స్థానంలో నిలిచారని సదరు పత్రిక పేర్కొంది. కాగా, కొలంబియా నటి సోఫియా వెర్గరా ఎక్కువ సంపాదిస్తున్న తారగా ఆరేళ్లుగా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారు. ప్రియాంకా చోప్రాకన్నా నాలుగింతలు.. అంటే దాదాపు 280 కోట్లు సోఫియా సంపాదిస్తున్నారట. ఏదేమైనా విదేశీ తారల జాబితాలో దేశీ తార ప్రియాంక ఉండడం అభినందనీయమే.