
మూడు నెలల్లో సూపర్ స్టార్ రెండు సినిమాలు
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త ఏడాదిలో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. షార్ట్ గ్యాప్ లో రెండు సినిమాలను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల కాలం రజనీ ఏడాది ఒక్క సినిమా చేయటమే గగనమైపోయింది. కథ ఎంపిక, షూటింగ్ ల కోసం ఎక్కువ సమయం కేటాయించటంతో సూపర్ స్టార్ సినిమాల సంఖ్య భారీగా తగ్గిపోయింది.
అయితే 2018లో మూడు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు రజనీ. ఇప్పటికే జనవరి 25న రోబో సీక్వల్ 2.ఓ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న కాలా షూటింగ్ కూడా 70 శాతానికి పైగా పూర్తయింది. మరో రెండు షెడ్యూల్స్ లో నవంబర్ నెలాఖరుకి షూటింగ్ మొత్తం పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు కాలా టీం.
ఈ సినిమాను కూడా 2.ఓ రిలీజ్ అయిన మూడు నెలలోపే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ నిర్మాణంలో కబాలి ఫేం పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రజనీ ముంబై మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఎక్కువ భాగం ముంబైలోనే షూట్ చేస్తున్నారు.