మా కష్టాలను చూడడం లేదు : రకుల్‌ | Rakul Preet About Her Fitness Secrets | Sakshi
Sakshi News home page

కష్టాలు చూడడం లేదు!

Published Thu, Jun 13 2019 8:03 AM | Last Updated on Tue, Jul 16 2019 4:38 PM

Rakul Preet About Her Fitness Secrets - Sakshi

తమిళసినిమా: మా కష్టాలను ఎవరూ చూడడం లేదని వాపోతోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. నిజమే పీత కష్టాలు పీతవి అన్న సామెత ఉండనే ఉందిగా! అంతే కాదు నటీమణుల జీవితాలు అద్దాల మేడలాంటివని సినిమాల్లోనే చూపించారు కూడా. సరే తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో నటించేస్తూ యమ క్రేజీగా వెలిగిపోతున్న ఈ ఉత్తరాది బ్యూటీ రకుల్‌ప్రీత్‌సింగ్‌కు కష్టాలేమిటటా? అన్నది తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉందా? ముఖ్యంగా అందాలను కాపాడుకోవడానికి నిరంతరం కసరత్తులు చేయడం సాధారణ విషయం కాదంటోందీ బ్యూటీ. అయితే అవన్నీ కష్టమైనా ఇష్టంగా చేస్తానని చెప్పుకొచ్చింది. తనకు జిమ్‌ చేయడం చాలా ఇష్టం అని చెప్పింది. నిత్యం గంట పాటు కసరత్తులు చేస్తానని, అలా హిందీ చిత్రం కోసం కేవలం 45 రోజుల్లోనే 8 కిలోల బరువు తగ్గానని చెప్పింది. ఇక అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటానని, వ్యాయామం చేసే ముందు ఒక కప్పు కాఫీలో ఒక స్పూన్‌ నెయ్యి కలుపుకుని తాగుతానని తెలిపింది.

ఆరేళ్లుగా తాను సినిమాల్లో కొనసాగడంలో రహస్యం ఏమిటని అడుగుతున్నారని, అందుకు ప్రధాన కారణం సినిమా అంతా తానే ఉండాలి, తానే పేజీలు పేజీలు డైలాగ్స్‌ చెప్పాలి, తానే డాన్స్‌ చేయాలి, మొత్తంగా సినిమా అంతా తానై ఉండాలి అని ఎప్పుడూ భావించనని చెప్పింది. కథ నచ్చిందా, తన పాత్ర బాగుందా అన్నది మాత్రమే చూసుకుంటానని తెలిపింది. ఇక ప్రస్తుత రాజకీయాల గురించి అడుగుతున్నారని, నేటి తరం యువతకు రాజకీయాలపై ఆసక్తి పెరుగుతోందని అంది.అందుకే ఇటీవల ఎన్నికల్లో ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని పేర్కొంది. రాజకీయాలపై మంచి అవగాహన, సమాజంపై అక్కర ఉన్న వారు రాజకీయాల్లోకి వస్తే మంచి చేయవచ్చునని చెప్పింది. ఇక సినిమా తారల గురించి చెప్పాలంటే కెమెరా వెనుక తాము పడే కష్టాలను ఎవరూ చూడడం లేదని, జయాపజయాలనే కొలమానంగా తీసుకుంటున్నారని ఆవేదనను వ్యక్తం చేసింది. అయితే అభిమానులను అలరించడమే ముఖ్యం కాబట్టి అలాంటి కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటించడానికి ప్రయత్నిస్తామని చెప్పింది. అయినా కొన్ని సార్లు ఫలితం దక్కుతుంది, కొన్ని సార్లు దక్కదని అని అంది. కాగా ప్రస్తుతం తెలుగులో నాగార్జునకు జంటగా మన్మథుడు 2 చిత్రంలోనూ, హిందీలో అజయ్‌దేవ్‌గన్‌కు సరసన ఒక చిత్రం చేస్తోంది. ఇక కోలీవుడ్‌లో శివకార్తికేయన్‌తో ఒక చిత్రంలో నటిస్తోంది.త్వరలో ఇళయదళపతికి జంటగా నటించే అవకాశాన్ని దక్కించుకుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement