వర్మ ఇచ్చిన షాకులు అన్నీ ఇన్నీ కావు | ram gopal varma good director said mohan babu | Sakshi
Sakshi News home page

వర్మ ఇచ్చిన షాకులు అన్నీ ఇన్నీ కావు

Published Sat, Apr 5 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

వర్మ ఇచ్చిన షాకులు అన్నీ ఇన్నీ కావు

వర్మ ఇచ్చిన షాకులు అన్నీ ఇన్నీ కావు

అయిదొందల పైచిలుకు చిత్రాల్లో నటన, యాభైకి పైచిలుకు చిత్రాల నిర్మాణం...  అసాధారణమైన ట్రాక్ రికార్డ్ మోహన్‌బాబుది. ‘రెస్పెక్ట్’ ఇచ్చి పుచ్చుకోవడం, ముక్కుసూటిగా మాట్లాడటం ఆయన నైజం. ఆ నైజానికి దగ్గరగా ఉండే పాత్రను ‘రౌడీ’లో పోషించారాయన. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా మోహన్‌బాబుతో మాటామంతీ.
 
 తొలిసారిగా రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నటించారు. ఆ అనుభవం ఎలా ఉంది?
 వర్మని అర్థం చేసుకునేవారికంటే... అపార్థం చేసుకునే వాళ్లే ఎక్కువ. నిజానికి వర్మ క్రమశిక్షణ గల వ్యక్తి. పని తప్ప వేరే ఆలోచన ఉండదు. నేటి దర్శకుల్లో అమోఘమైన ప్రతిభాశాలి తను. వర్మతో నాది ఇప్పటి పరిచయం కాదు. వాళ్ల నాన్న నాకు మంచి మిత్రుడు. వర్మ దర్శకుడైన కొత్తల్లో సినిమా చేద్దామని అడిగాను.
 
 
  అప్పుడు కుదర్లేదు. రెండు మూడు నెలల క్రితం సడన్‌గా వర్మను ఇంటికి తీసుకొచ్చాడు విష్ణు. ‘సినిమా చేద్దామా’ అని అడిగా. మూడ్రోజులు టైమ్ అడిగాడు. సరిగ్గా మూడ్రోజుల్లో వచ్చి ‘రౌడీ’ కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. మళ్లీ రెండ్రోజులు టైమ్ తీసుకొని వచ్చి... నాకు ఇంత బడ్జెట్ కావాలి, ఆర్టిస్టులుగా వీళ్లు కావాలి, లొకేషన్లు ఇవి కావాలి.. అని లిస్ట్ చెప్పాడు. నేను షాక్. కథ ‘ఓకే’ అయ్యాక ఇంత పకడ్బందీగా ముందుకెళ్లే దర్శకులు ఈ జనరేషన్లో కూడా ఉన్నారని వర్మను చూశాక తెలిసింది.
 
 అల్లుడుగారు, అసెంబ్లీరౌడీ సినిమాలు 27 - 30 రోజుల్లో తీశాం. ‘రౌడీ’ సినిమాను వర్మ 35 రోజుల్లో తీస్తానని చెప్పి, 30 రోజుల్లోనే తీసేశాడు. అనుకున్న బడ్జెట్ కంటే 50 లక్షల తక్కువలోనే నిర్మాణం ముగించాడు. ఈ సినిమా టైమ్‌లో వర్మ ఇచ్చిన షాకులు నాకు అన్నీ ఇన్నీ కావు. అతనిది బాలీవుడ్ కల్చర్. ఉదయం 9 గంటలకు షూటింగ్ స్టార్ట్ చేయడం అతనికి అలవాటు. కానీ... నా కోసం నెల రోజుల పాటు ఉదయం 7.30  కల్లా తొలి షాట్ తీసేసేవాడు. ఒంటిగంటకు బ్రేక్ ఇచ్చేవాడు. నాక్కూడా తెలీకుండా దాసరిగారిని ఎడిటింగ్ రూమ్‌కి తీసుకెళ్లి సినిమా చూపించాడు. దాసరి, కె.రాఘవేంద్రరావు, బాపు లాంటి గొప్ప దర్శకుల్లో ఉన్న ప్రతిభ, సిన్సియారిటీ వర్మలో కూడా ఉన్నాయి. ఇందులో విష్ణు నాకు పోటీగా నటించాడంటే... కారణం వర్మ. విగ్, మేకప్ లేకుండా నేను నటించడం ఇదే ప్రథమం. ఈ సినిమా విజయానికి ప్రథమ కారకుడు వర్మ అయితే, రెండో స్థానం విష్ణుది.
 
 వర్మ సినిమాల్లో కనిపించని కుటుంబ బంధాలు ఈ చిత్రంలో కనిపించాయి. ఇది మీ ప్రభావమా?
 మా కుటుంబంలో ఉండే అనుబంధాలను చూసి స్ఫూర్తి పొంది ఈ సన్నివేశాలు తీశానని అతనే ఓ సందర్భంలో చెప్పాడు. ఆల్‌మోస్ట్ నా మెంటాలిటీకి దగ్గరగా ఉండే పాత్ర ‘అన్న’ పాత్ర. కొడుకుని మందలించే సన్నివేశం, భార్య చనిపోయిన సన్నివేశం... ఇలా ఇందులోని ప్రతి సన్నివేశం నాకు నచ్చింది. ముఖ్యంగా జయసుధ నటన అమోఘం. అన్ని తరగతుల వారూ ఈ సినిమాను ఆదరిస్తున్నారు. స్త్రీలు కూడా ఇష్టపడుతున్నారు. తొలిరోజే నాలుగు కోట్ల రూపాయల పై చిలుకు షేర్ వచ్చింది.
 
 ఈ కథలో ‘సర్కార్’ పోలికలున్నాయని కొందరంటున్నారు.
 ‘సర్కార్’ చూశాను. పొలికలు ఉండొచ్చేమో. నా అయిదొందల చిత్రాల్లో సన్నివేశాన్ని పోలిన సన్నివేశాలు ఎన్ని లేవు? తండ్రీ కొడుకుల సన్నివేశాలు మాత్రం ‘సర్కార్’ పోలికలతో ఉంటాయి. అంతే..
 
 ‘సర్కార్’ చూసి కూడా అమితాబ్ బచ్చన్ ప్రభావం పడకుండా ఆ పాత్ర రక్తికట్టించడం కత్తి మీద సామే...
  హీరో, విలన్, కామెడీ విలన్, సపోర్టింగ్ యాక్టర్.. ఇలా ఏ పాత్రయినా, ఎంత కష్టతరమైన పాత్రయినా కానీయండి. ఆ పాత్ర పోషణలో దేశంలోని ఏ నటుణ్ణైనా నాకు పోటీగా రమ్మనండి. ఫస్ట్ మార్క్ నేను సాధించకపోతే చూడండి. ఇది నమ్మకంతో చెబుతున్న మాట. సినిమా చూశాక ప్రేక్షకులు బయటకొచ్చి నా పాత్ర గురించి మాట్లాడకపోతే ఇన్నాళ్ల నా నట జీవితం వ్యర్థం.
 
 ‘ఏ పాత్ర అయినా.. నేనే ఫస్ట్ అనిపించుకుంటాను’ అన్నారు. త్వరలో ‘రావణ’ చేయనున్నారు. ఆ పాత్ర అంటే... గుర్తొచ్చేది మహానటుడు ఎన్టీఆర్. మరి ఆయనను కూడా డామినేట్ చేస్తానంటారా?
 అన్నయ్యను అధిగమిస్తానని జోక్‌గా కూడా అనను. ఆ దరిదాపులకు వెళ్లగలనేమో ప్రయత్నిస్తా. ఆయన మహానటుడు. ఆ రూపం వేరు, నా రూపం వేరు. ఆ అభినయం వేరు, నా అభినయం వేరు. ప్రస్తుతం ‘యమలీల-2’లో యముడిగా చేస్తున్నాను. నా పాత్ర చిత్రణ పూర్తి కావొచ్చింది.
 
 మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. మీరు, మీ మిత్రుడు రజనీకాంత్ కలిసి ఓ సినిమా చేయొచ్చుగా?
 అన్నీ కుదరాలి. అయినా ఈ పరిస్థితుల్లో అది తేలికైన విషయం కాదు. త్వరలో ‘కొచ్చడయాన్’ ఆడియో వేడుక హైదరాబాద్‌లో జరగనుంది. ఆ కార్యక్రమాలన్నింటినీ మా లక్ష్మీప్రసన్న చూస్తోంది.
 
 మీ ఫ్రెండ్ రజనీకాంత్‌ని బాలీవుడ్ హీరోలు సైతం అభిమానించడంపై మీ కామెంట్?
 దాన్ని కాకా పట్టడం అంటారు. చాలా ఏళ్ళ క్రితం తమిళనాట బాలీవుడ్ చిత్రాలపై నిషేధం ఉండేది. తరువాత క్రమంగా పరిస్థితి మారింది. ఏమైనా, ఈ నేపథ్యంలో సౌత్‌లో నంబర్‌వన్ హీరోను కాకా పడితే.. మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఎదురుకావ.ని వారి ప్లాన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement