సినిమాలు చూసి కొట్టుకునేంత మూర్ఖులు లేరు: వర్మ
ప్రముఖ దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మ శనివారం ఉదయం వంగవీటి రాధ, రత్నకుమారిలను కలిసిన అనంతరం మధ్యాహ్నం దేవినేని నెహ్రుతో చర్చలు జరిపారు. నెహ్రుతో సమావేశం తరువాత మీడియా ముందుకు వచ్చిన వర్మ... వంగవీటి రాధతో జరిగిన చర్చలపై స్పందించేందుకు నిరాకరించారు.
అయితే రాధ ‘వంగవీటి’ సినిమా విడుదలపై అభ్యంతరాలు తెలిపారని, ఓ ఫిలిం మేకర్‌గా తనకు స్వేచ్ఛ ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా విషయంలో తాను వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. వంగవీటి రంగ మరణించిన రోజుకు కేవలం మూడు రోజుల ముందే సినిమా రిలీజ్ నిర్ణయం కేవలం యాధృచ్చికమే అన్నారు. వంగవీటి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అన్న వర్మ ఎన్ని అడ్డంకులు ఎదురైనా సినిమాపై తన ఆలోచనను మార్చుకోనన్నారు. కేవలం సినిమాలో సన్నివేశాల కారణంగా వివాదాలు పెంచుకునేంత మూర్ఖులెవరు లేరని ఆయన అన్నారు. (చదవండి....నవ్వుతూనే వార్నింగ్ ఇచ్చారు: వర్మ)
ఈ సమావేశంపై మీడియాతో మాట్లాడిన దేవినేని నెహ్రు... వర్మ తనకు కేవలం ఒకటిన్నర నిమిషం ట్రైలర్ మాత్రమే చూపించారని, మురళి, నెహ్రుల లుక్ ఎలా ఉందన్న విషయం మాత్రమే తాను అడిగారని తెలిపారు. అలాగే ఫిలిం మేకర్స్‌కు ఏదైనా తీసే హక్కు ఉందన్న నెహ్రు, వర్మ సినిమా ఎలా తీసినా ఎవరు చేయగలిగేది ఏం లేదన్నారు. గతంలో వర్మను కలిసినపుడు కమ్మ కాపు పాట తీసేయటం మంచిదని చెప్పానన్నారు. వంగవీటి సినిమా తరువాత విజయవాడలో మరోసారి గొడవలు జరిగే పరిస్థితి లేదని, ప్రస్తుతం సినిమాలు చూసి కొట్టుకు చచ్చే పరిస్థితిలో సమాజం లేదన్నారు.