మళ్లీ వర్మతో... వివేక్ ఓబె'రాయ్'
కర్ణాటకకు చెందిన మాజీ గ్యాంగ్‌స్టర్ ముత్తప్ప రాయ్ జీవితం ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రాయ్’. వర్మ ‘రక్తచరిత్ర’లో నటించిన వివేక్ ఓబెరాయ్ టైటిల్ రోల్ చేస్తున్నారు. దాసరి కిరణ్ కుమార్ సమర్పణలో సీఆర్ మనోహర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను బెంగళూరులో విడుదల చేశారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ- ‘‘30 రూపాయలతో ప్రారంభమవుతుంది అతని జీవితం. 30 ఏళ్ల నేర జీవితంలో 30 వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? ఇరవై హత్య కేసుల్లో నుంచి 21 నెలల్లో ఎలా బయటపడ్డాడు? ‘నేరస్థుడి జీవితం చీకటి’ అని చరిత్ర చెబితే, ‘కాదు.
వేయి సూర్యుల వెలుగు’ అని ఎలా నిరూపించాడు? నేరాలు చేసినతణ్ణి కోట్ల మంది ప్రజలు ఎందుకు అభిమానిస్తున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘యాభై ఐదు కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోన్న చిత్రం ఇది. హిందీ హక్కులను రాజు చద్దా, సునీ లుల్లా, తమిళ హక్కులను సౌతిండియన్ ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గంగరాజు సొంతం చేసుకున్నారు’’ అని నిర్మాత చెప్పారు. ముత్తప్ప రాయ్, వివేక్ ఓబెరాయ్, దాసరి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.