
కాలా కథపై క్లారిటీ ఇవ్వాల్సిందే!
► రజనీ, ధనుష్, రంజిత్‌లకు నోటీసులు..
రజనీకాంత్ ‘కాలా’ కథలో రీల్‌పై ఎన్ని మలుపులు కనిపిస్తాయో కానీ.. రియల్‌గా మాత్రం పలు మలుపులు ఎదుర్కొంటోంది. ముంబయ్ అండర్ వరల్డ్ డాన్ హాజీ మస్తాన్ జీవితం ఆధారంగా ఈ సినిమా చేస్తున్నారేమోననే సందేహంతో ఆయన్ను గాడ్‌ఫాదర్‌లా భావించే సుందర్ శేఖర్ వివాదం రేపారు. చివరికి చిత్రబృందం ఇది వేరే కథతో తీస్తున్న సినిమా అనడంతో ఆ వివాదం సద్దుమణిగింది.
ఆ తర్వాత ‘ఈ కథ నాది’ అంటూ ‘జీఎస్‌ఆర్ విన్‌మీన్ క్రియేషన్స్ అధినేత, రచయిత ఎం. రాజశేఖరన్ చెన్నై సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ని పరిశీలించిన న్యాయస్థానం.. దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, చిత్రకథానాయకుడు రజనీకాంత్ , దర్శక–నిర్మాతలు పా. రంజిత్, ధనుష్‌లు ఈ నెల 15కల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇంతకీ తన పిటిషన్‌లో రాజశేఖర్ ఏం పేర్కొన్నారనే విషయానికి వస్తే.. టైటిల్, స్టోరీ తనదేనంటున్నారాయన.
‘కరికాలన్’ పేరుతో సినిమా తీయాలనుకుని దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలిలో టైటిల్‌ను నమోదు చేశానని, రజనీకాంత్ అభిమాన సంఘం అధ్యక్షుడు సత్యనారాయణకు కథ చెప్పానని రాజశేఖరన్ అంటున్నారు. ఇప్పుడు ‘కాలా’ అని టైటిల్ పెట్టి, కరికాలన్ అని క్యాప్షన్ పెట్టారని, తాను చెప్పిన కథతోనే ఈ సినిమా తీస్తున్నారని ఆయన ఆరోపించారు. సౌతిండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ టైటిల్‌ను రెన్యూ చేయలేదన్నారు. కొందరు ప్రముఖ వ్యక్తుల కోసం ఒక టైటిల్‌ను రెన్యూవల్, క్యాన్సిల్ చేసే హక్కు మండలికి లేదన్నారు. మరి.. రాజశేఖరన్ ఆరోపణలకు ‘కాలా’ బృందం ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.