
విడిపోయిన రంజిత్, ప్రియారామన్
నటుడు రంజిత్, నటి ప్రియారామన్ దంపతులు విడిపోయారు. వీరు కోర్టు ద్వారా చట్టబద్దంగా వివాహ రద్దు పొందారు. తమిళంలో పొన్ విళంగు, సింధునదీ పూ, వట్టాకుడి ఇరణియన్ తదితర చిత్రాల్లో
నటుడు రంజిత్, నటి ప్రియారామన్ దంపతులు విడిపోయారు. వీరు కోర్టు ద్వారా చట్టబద్దంగా వివాహ రద్దు పొందారు. తమిళంలో పొన్ విళంగు, సింధునదీ పూ, వట్టాకుడి ఇరణియన్ తదితర చిత్రాల్లో నటించిన రంజిత్, సూర్య వంశం, పొన్‌మనం, హరిచంద్ర, పుదుమై పిత్తన్, చిన్న రాజా చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన ప్రియా రామన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి 1999లో నేశం పుదుసు అనే చిత్రంలో నటించారు.
ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొలకెత్తింది. ఈ చిత్రంలోని పెళ్లి సన్నివేశం కోసం రంజిత, ప్రియారామన్‌ల నిజ వివాహాన్ని చిత్రీకరించారు. వీరికి ఆదిత్య, ఆకాష్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో గత ఏడాది రంజిత్, ప్రియారామన్ మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారు. అలాగే చట్టబద్ధంగా విడాకులు పొందాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. దీంతో తాంబరం కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులు పిటిషన్ దాఖలు చేసుకున్నారు.
ఈ కేసు విచారించిన కోర్టు ఈ నెల ఆరో తేదీన రంజిత్ ప్రియారామన్‌కు విడాకులిస్తూ తీర్పునిచ్చిందని నటుడు రంజిత్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తాను ప్రియారామన్ 15 ఏళ్ల పాటు కలిసి జీవించామన్నారు. అలాంటిది తమ మధ్య భావసారూప్యం కొరవడిందని అనుభవపూర్వకంగా తెలియడంతో ఆపై భార్య భర్తలుగా జీవించలేకపోయామన్నారు. అయితే మంచి స్నేహితులుగా గడపవచ్చనే నమ్మకం ఏర్పడిందని తెలిపారు. ఈ విషయాల్లో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి విడిపోయామని తెలిపారు. పిల్లలు ప్రియారామన్‌తోనే ఉంటున్నారని చెప్పారు. మనస్పర్థల కారణంగా నటనపై దృష్టి సారించలేకపోయానని ఇకపై పూర్తిగా నటనపై శ్రద్ధ చూపిస్తానని రంజిత్ తెలిపారు.