సాక్షి, సిటీబ్యూరో :ఆమె బుల్లి తెరపై చిన్న దుస్తులకు తెరలేపారు. వెండితెరపైనా వన్నె చిన్నెలు ఆరబోశారు. నటిగా పరిచయమైనా గ్లామర్ తారగానే రాణిస్తున్నారు. టీవీ వీక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు... సినీ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్తగాపరిచయమయ్యే అందాల హోరు... రష్మీ గౌతమ్. గత కొంతకాలంగా హాట్ స్టార్ ఇమేజ్‌ను సినిమా సినిమాకీ పెంచుకుంటూ పోతున్న రేష్మీ... ఇప్పుడు ‘అంతకు మించి’ హీట్‌పంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం సండే సెలబ్రిటీ రష్మీ ‘సాక్షి’తో పంచుకున్న ముచ్చట్లివీ...
? సుధీర్ విషయంలో రూమర్లపై మీ స్పందన.
మీరే అంటున్నారు కదా రూమర్ అని. అదే నా సమాధానం. మేము కలిసి నటించాం. సహ నటీనటులం. అంతే.. అంతకు మించి ఏమీ లేదు. కాబట్టి చెప్పడానికి కూడా ఏమీ లేదు.
? పెళ్లి టైమ్ వచ్చిందా.
తాతగారు అంటారు... చావు, పెళ్లి రెండూ చెప్పిరావు. అవి వచ్చే టైమ్ వస్తే ఆపలేం అని. చూద్దాం రానివ్వండి.
? మీ తాజా చిత్రం గురించి...
‘అంతకు మించి’ ఫుల్ లెంగ్త్ కమర్షియల్ మూవీ. హారర్, గ్లామర్ రెండూ పుష్కలంగానే ఉంటా యి. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇది నాకు థర్డ్ హారర్ మూవీ.
? ఎలాగైతేనేం సెక్స్ సింబల్ సాధించారు.
అవును.. ఆ ముద్ర పడిపోయింది. అయితే ఆ ముద్ర కావాలని నేను డెలిబరేట్‌గా చేయలేదు. కళాకారులుగా మేము ప్రయోగాలు చేయాలనుకుంటాం. మొదట్లో కరెంట్, ప్రస్థానం లాంటి సినిమాలు చేశాను. అప్పటి నుంచి అన్నీ అలాంటి సైడ్ రోల్స్, ఫ్రెండ్ క్యారెక్టర్స్ వచ్చాయి. అంటే నా గ్రోత్ అక్కడితో ఆగిపోయింది. సినిమాల్లోకి ఎవరైనా లీడ్ రోల్స్ చేయాలనే వస్తారు. కొందరికి కుదురుతుంది. కొందరికి కుదరదు. అంతమాత్రానా ఆగిపోవాలనుకోరుగా... నేనూ అలాగే వచ్చాను. కానీ ఇండస్ట్రీలో ఎవరూ తెలిసిన వారు లేరు. దీంతో వచ్చిన ఆఫర్లు వచ్చినట్టు చేసుకుంటూ వెళ్లాను. తొలి సినిమాల తర్వాత అలా కాదని, డిఫరెంట్‌గా ఉందని ‘గుంటూర్ టాకీస్’ ట్రై చేశాను. అది క్లిక్ అయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లామర్ అనేది త్వరగా ఎక్కుతుంది. ఆర్టిస్ట్‌గా నేను ప్రయత్నించాను. అవి క్లిక్ కాలేదు. ఇలా క్లిక్ అయిపోయింది. కరెంట్, ప్రస్థానం సినిమా టైమ్‌లో ఆ స్టాంప్ పడిపోయింది. ఇప్పుడు ఈ స్టాంప్ పడింది.
? మరి ఆ ముద్ర నుంచి బయటకు రావాలని లేదా.
ఈ స్టాంప్ నుంచి బయటకు రావడానికి నేనేమీ ప్రయత్నం చేయడం లేదు. నా మీద నమ్మకం ఉంచి పెట్టుబడి పెట్టి సినిమాలు నిర్మించే నిర్మాతకు డబ్బులు రావాలి. వాళ్లు సేఫ్‌గా ఉండాలి. అలా జరగాలంటే నాకు వీలైనంతగా నావైపు నుంచి సహకారం అందించాలి. హారర్, గ్లామర్ డోస్ ఉండే సినిమాలు మాస్‌కి నచ్చుతాయి. ఆ స్టాంప్ నుంచి బయటకు రావాలని కాకపోయినా... కొత్తగా కనపడాలనే ప్రయత్నమైతే కచ్చితంగా చేస్తాను. అందుకే ఈ సినిమా అయిపోయాక ఇకపై హారర్ మూవీ చేయనని డిసైడ్ అయిపోయాను.
? ప్రస్తుతం జర్నీ ఎలా ఉంది.
చాలా బాగుందండీ. అటు సినిమా, ఇటు టీవీ, ఇంకా పబ్లిక్ ఈవెంట్లు. కాకపోతే ఇండస్ట్రీలో సినిమా సినిమాకు కాస్త గ్యాప్ వస్తే చాలు... ఏమిటి సినిమాల్లేవా అంటూ అడుగుతారు. అరె.. నేను వారానికి రెండుసార్లు టీవీలో, ఈవెంట్లలో కనిపిస్తూనే ఉన్నాను. అయినా అలా అనేస్తుంటారు.
? టీవీల్లోనూ పొట్టి దుస్తుల ట్రెండ్ సెట్టర్ మీరే కదా.
థ్యాంక్స్ అండీ. టీవీ షోస్‌లో కూడా మేమేమీ కావాలని అనుకొని చేయలేదు. కొత్తదనం కోసం కొన్ని ప్రయోగాలు చేస్తాం. ఆడియన్స్ యాక్సప్టెన్స్‌ని బట్టి మా నెక్టŠస్ స్టెప్ ఉంటుంది. మీరే అన్నారుగా.. ట్రెండ్ సెట్టర్ అని. ఇప్పుడు టీవీలో చాలామంది పొట్టి డ్రెస్సులు వేసుకుంటున్నారు. అంటే అది చూసే వారికి నచ్చుతుందనేగా. గతంలో టీవీ అంటే చిన్న చూపు ఉండేది. (అయితే ఇప్పుడు చిన్న డ్రెస్సింగ్ చూపు వచ్చిందంటారా? అని అడిగితే... ఆ అవును అంటూ నవ్వులు). ఇది టూ సైడెడ్ థింగ్. ఆల్ అబౌట్ డిమాండ్ అండ్ సప్లయ్.. అంతే.
? మీ హాబీలు, ఫిట్‌నెస్ వర్కవుట్.
పర్సనల్ హాబీలన్నీ ప్రొఫెషన్స్ అయిపోయాయి. స్విమ్మింగ్ అనుకున్నా.. డ్యాన్స్ అనుకున్నా... అవన్నీ సినిమాల్లో చేస్తున్నాను. గార్డెనింగ్ బాగా ఇష్టం. ఇక ఫిట్‌నెస్ కోసం యోగా రెగ్యులర్‌గా చేస్తుంటాను.
? హైదరాబాద్‌లో సెటిలైనట్టేనా..
నాకొక బేస్ లేదు. డిఫరెంట్ లాంగ్వేజెస్‌లో మూవీస్ చేస్తున్నాను. ప్రస్తుతం వైజాగ్‌లో ఫ్యామిలీ ఉంటోంది. నేను తరచూ ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఏదేమైనా తెలుగు ఇండస్ట్రీలో ఉండాలంటే హైదరాబాద్‌లో ఉండాలి. గతంలో వైజాగ్ నుంచి వస్తూ.. వెళ్తూ ట్రై చేశాను. ముంబై నుంచి ఫ్లైట్ టికెట్ ఇవ్వాలంటే ఓకే.. కానీ వైజాగ్ నుంచి కొంచెం కష్టం.
? ఇప్పుడు కొందరికి సక్సెస్ చాలా తేలిగ్గా వచ్చేస్తున్నట్టుంది.
ఒకప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఓవర్‌నైట్ స్టార్స్ బాగా వచ్చేస్తున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియా... చాలా ఎక్స్‌పోజర్ వచ్చేసింది. ఒకప్పుడు సినిమా, టీవీలో చూస్తే చూసినట్టు లేకపోతే లేదు. ఇప్పుడు అలా అని లేదు. చాలా ప్లాట్‌ఫామ్స్ వచ్చేశాయి.
? రేష్మీ అంటే కేవలం గ్లామరేనా? అంతకు మించి ఉందా!
లేదు.. అంతకు మించి ఉంది. దీనిని నేను నమ్ముతున్నాను. మీరూ నమ్మండి. అన్ని భాషల్లో కలిపి నేను 25కు పైగా సినిమాలు చేశాను. ప్రస్థానం, కండైన్ (తమిళం), గురు (కన్నడ) సినిమాలకు, యువ సీరియల్‌కు నాకు ఎంతో మంచి పేరొచ్చింది. నా మీద, నా ప్రతిభ మీద నమ్మకం ఉంది.. కాబట్టే నేను ఇండస్ట్రీలో ఉండగల్గుతున్నాను.
? అమ్మాయిలు కొన్ని పనులు చేస్తే పైకి వస్తారా?
ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఎక్కడైనా సరే... సక్సెస్‌ఫుల్, తనకంటూ ఒక మార్కు వేసిన ప్రతి అమ్మాయి విషయంలో ఇలాంటి దురభిప్రాయం చాలా మందిలో చూస్తున్నాను. సినిమాల్లో అయితే ఏముందీ... ఎక్స్‌పోజ్ చేసి వచ్చింది. వీరితో పడుకుంది.. వారితో పడుకుందీ.. అందుకే అలా పైకి వచ్చేసింది అంటూ ఈజీగా అనేస్తుంటారు. కానీ ఎవరైనా సరే ప్రతిభ ఉంటేనే రాణిస్తారు. అంతే తప్ప పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎవరూ పైకి రాలేరు.
Comments
Please login to add a commentAdd a comment