
సైనా నెహ్వాల్‌పై సినిమా
హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు క్రీడాకారుల జీవితకథా చిత్రాల సీజన్‌లా ఉంది. అథ్లెట్ మిల్ఖా సింగ్ కథతో ‘భాగ్ మిల్ఖా భాగ్’, బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ కథతో ‘మేరీ కోమ్’ తరువాత ఇప్పుడు తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వంతు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఈ బ్యాడ్మింటన్ సంచలనం జీవితం ఆధారంగా ఓ చిత్రం చేయాలని దర్శకుడు మహేశ్ భట్ యోచిస్తున్నారు. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో అగ్రతారగా భాసిల్లుతోన్న దీపికా పదుకొనేతో సైనా పాత్ర ధరింపజేయాలని ఆయన భావిస్తున్నారు.
మిత్రుడొకరు ఈ ఆలోచన చెప్పారనీ, ఈ చిత్ర ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉందనీ మహేశ్‌భట్ వ్యాఖ్యానించారు. అయితే, భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన సైనా మీద సినిమా తీస్తే, అది ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. సైనా సైతం ఇటీవల మాట్లాడుతూ, తెరపై తన పాత్రకు దీపిక బాగుంటుందని కామెంట్ చేశారు. మరింకేం! బ్యాడ్మింటన్‌తో అనుబంధమున్న పదుకొనే వంశ వారసురాలైన దీపిక నటనతో సైనా నిజజీవిత కథ మరింత వన్నెలద్దుకొంటే ఆశ్చర్యం లేదు.
ఓ పక్క సైనా గురువు పుల్లెల గోపీచంద్ జీవితంపై తెలుగు దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రయత్నిస్తుంటే, మరోపక్క శిష్యురాలైన సైనాపై మహేశ్‌భట్ ఆలోచించడం యాదృచ్ఛికమే అయినా, విశేషం. ఈ సినిమాలు కార్యరూపం ధరిస్తే, ఒక క్రీడకు సంబంధించిన గురుశిష్యులిద్దరి కథలూ తెరకెక్కడం ఇదే మొదటిసారి అవుతుంది. పైగా, ఆ ఇద్దరూ తెలుగు గడ్డ మీద నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ‘మనవాళ్ళు’ కావడం మనకు మరీ గొప్ప కదూ!