
ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారనే అభిప్రాయం కొందరిలో ఉంది.. మీ ఒపీనియన్?
వర్మ: అవును. వెన్నుపోటు పొడిచారు.
ఎంతో స్ట్రాంగ్‌గా ఉండే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అంత సులువుగా ఎలా ప్రవేశించగలిగారు?
వర్మ: అప్పుడు ఆయన జీవితంలో ఓ శూన్యం ఏర్పడింది. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ శూన్యం. ఆ సమయంలో మానసిక స్థితి ఓదార్పు కోరుకునే అవకాశం ఉంది. అలాంటి టైమ్‌లోనే లక్ష్మీపార్వతిగారు ఆయన జీవితంలోకి ప్రవేశించారు. ఒక ఎమోషనల్ స్టేట్‌లో ఇది జరిగి ఉంటుందని నా అభిప్రాయం.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ప్రారంభించిన సందర్భంగా దర్శకుడు రాంగోపాల్ వర్మంతో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ..
ఎన్టీఆర్ కథను లక్ష్మీపార్వతి యాంగిల్‌లో చెప్పాలని మీకు ఎందుకు అనిపించింది? ఆమె మీద ఉన్న అభిమానమా?
వర్మ: నాకు లక్ష్మీపార్వతిగారి మీద ఎలాంటి ఇంప్రెషన్ లేదు. ఇలా చెప్పడానికి ముఖ్యకారణం ఏంటంటే ఎన్టీఆర్‌గారు మహా మహా అందగత్తెలతో నటించారు. అలాంటి ఆయనకు ఈవిడ ఎక్కడ దొరికారా? అని ఫస్ట్ ఫీలింగ్. ఇంకో డౌట్ ఏంటంటే ఎన్టీఆర్‌గారు ఆ అందగత్తెలను పెళ్లి చేసుకోకుండా ఈవిణ్ణి చేసుకోవడమేంటి? అనిపించేది. అలా లక్ష్మీపార్వతిగారి మీద నా ఫీలింగ్ నెగటివ్ ఇంప్రెషన్‌తో స్టార్ట్ అయింది. పొలిటికల్‌గా కూడా ఆవిడ్ని పెద్దగా ఫాలో అవ్వలేదు. కానీ ఎన్టీఆర్ పెద్ద స్టార్‌గా మనందరికీ తెలుసు. ఆయన్ని అభిమానించాం. ఆయన మాట్లాడే విధానం మనకు తెలుసు. పాలసీల కోసం ఆయన తీసుకున్న స్టెప్స్‌ని మనం ఎక్కడా చూడలేదు. అందరూ ఆయన్ను పొగుడుతారు. ఎక్స్‌ట్రార్డినరీ మనిషి, మేధస్సు కలిగిన మనిషి. మొత్తం పొలిటికల్ సిస్టమ్‌నే మార్చేశారు అంటుంటారు. అయితే ‘ఈ ఒక్క విషయంలో... ’ అని అంటారు. ఈ ఒక్క విషయంలో అంటే? అనే విషయాన్ని సిన్సియర్‌గా ఆలోచించడం మొదలు పెట్టా. ఆ విషయాన్నే సినిమాగా తీయాలనుకున్నా.
‘ఆ ఒక్క విషయం’ గురించి చాలా సర్వేలు చేసి ఉంటారు. మీకెలాంటి ఫీడ్‌బ్యాక్ వచ్చింది?
ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి మనుషులని కలవడం స్టార్ట్ చేశాను. ఎన్టీఆర్‌గారు ఉన్నప్పుడు పని చేసిన ఆఫీసర్స్, స్టాఫ్, ఆయనతో పరిచయం ఉన్న చుట్టుపక్కల వాళ్లతో మాట్లాడాను. ఒక మనిషి గురించి ఐదుగుర్ని అడిగితే ఐదుగురు ఐదు రకాలుగా చెబుతారు. ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం అని మనం చెప్పలేం. ఏది నిజం అని తెలియదు. చిట్టచివరిగా నాకో ప్రత్యక్ష సాక్షి దొరికారు. ఆయనే ఎన్టీఆర్‌గారు. ఆయన చనిపోయే వారం రోజుల ముందు ఓ వీడియోలో లక్ష్మీపార్వతిగారి గురించి ఎక్స్‌ట్రార్డినరీ గౌరవాభిమానాలతో మాట్లాడారు. అప్పుడు నాకు అనిపించిందేంటంటే.. వీళ్లందరూ ఆయన ఎంతో గొప్ప మనిషి అంటారు. మరి ఆయనే గౌరవించే మనిషిని తప్పుబట్టడం లాజికల్‌గా తప్పు కదా. అప్పుడు కొంచెం డీప్‌గా వెళ్లి, ఆమె మీద ఎందుకు నెగటివ్ దృష్టి వచ్చింది? ఎంతసేపూ ఆవిడ గురించి బయటవాళ్లు చెప్పిన మాటలు వింటున్నాం కానీ ఎన్టీఆర్ దృష్టిలో ఆమె ఏంటి? అని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ని బయోపిక్ అనలేమేమో? ఆయన జీవితంలో లక్ష్మీపార్వతి ఎంటరైనప్పటి నుంచి ఈ సినిమా మొదలవుతుందా?
బయోపిక్ అనేది ఆ వ్యక్తి తాలూకు సక్సెస్ అయినా ఉండాలి, ప్రోగ్రెస్ టు సక్సెస్ అయినా ఉండాలి. గాంధీ బయోపికే తీసుకుందాం.. బ్రిటిష్ అనే విలన్ ఉన్నాడు. బ్రిటిష్ లేకపోతే ఆ బయోపిక్‌కి ఆ విలువ ఉండదు. అలాగే ఎన్టీఆర్ చాలా స్ట్రగుల్ అయ్యి సక్సెస్ సాధించారా అంటే నాకు చాలా డౌట్. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి చేతులు కట్టుకుని సినిమా ఆఫీసుల బయట నిలబడి ఉంటారా? అనిపిస్తుంది. ఆయన పుట్టుకతోనే చాలా సక్సెస్‌ఫుల్ అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు ‘మేము మేము’ అని అనేవారు. ఎంతో ఆత్మవిశ్వాసం, ఎంతో కన్విక్షన్ లేకపోతే అలా ఉండలేరు మనుషులు. ఒకవేళ స్ట్రగుల్ ఉన్నా కూడా మనం నోటీస్ చేయగలిగే స్ట్రగుల్ ఉండదని నా ఉద్దేశం. స్ట్రగుల్ ఫర్ సక్సెస్ లేకుండా, విలన్ లేకుండా బయోపిక్ ఎలా వస్తుంది? ఆయన లైఫ్‌లోకి శత్రువులు వచ్చి ఉంటే లక్ష్మీపార్వతిగారి రాకతో వచ్చి ఉండాలి. ఆ శత్రువులు ఎవరనేది నేను చెప్పను. అది రకరకాల పరిస్థితుల వల్ల అవ్వచ్చు. ఆవిడ జీవితంలో ప్రవేశించినప్పటి నుంచి విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎవరి జీవితంలో అయినా వాళ్ళు కలిసిన మనుషులు, జరిపిన సంభాషణలు, జరిగిన సంఘటనలు వాళ్ల జీవితాన్ని పూర్తి చేస్తాయి. నా దృష్టిలో రామారావుగారి లైఫ్‌లో అలాంటి డైనమిక్ ఫేజ్ లక్ష్మీ పార్వతిగారు ఎంటరైనప్పటి నుంచే. దాంట్లో మీకు ఆనందం ఉండచ్చు, దుఃఖం ఉండచ్చు. మోసం, కోపం ఏదైనా ఉండచ్చు. ఆ ఫేజ్‌లో అవన్నీ ఉన్నాయి. నా సినిమా బయోపిక్ కాదు.. ఒక ఘట్టం. లక్ష్మీ పార్వతిగారు ప్రవేశించినప్పటి నుంచి ఒక ఘట్టం స్టార్ట్ అయింది అంటాను.
లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ పెళ్లి చేసుకోవడం కరెక్టేనంటారా?
ఆయన వ్యక్తిగత నిర్ణయాన్ని జడ్జ్ చేయడానికి నేనెవర్ని? ఆయనకు ఎవరు నచ్చారు? ఎందుకు నచ్చారు? ఏ కారణంతో మరో పెళ్లి చేసుకున్నారు అన్నది ఆయన నిర్ణయం. మనం ఎవరం అడగటానికి? మనం రామారావుగారిని గౌరవిస్తే ఆయన గౌరవించే వాళ్లను గౌరవించడం మన బాధ్యత అన్నది నా పాయింటాఫ్ వ్యూ.
ఆ విధంగా మీకు లక్ష్మీ పార్వతిగారి మీద గౌరవం ఉంది అంటారు.
100 శాతం. అలాగే నేను గౌరవిస్తానని ఆమెకు సంబంధించిన ప్రతి విషయాన్నీ ఏకీభవిస్తానని కాదు. గౌరవం వేరు, ఏకీభవించడం వేరు.
అసలు ఈ సినిమాలో హీరో ఎవరు?
నిజం. సినిమాలో నిజమే కథానాయకుడు.
ఇద్దరి లవ్ గురించే ఎక్కువ స్టోరీ ఉంటుందా?
లవ్ అనే పదం చాలా వేగ్ అయిపోయింది. ప్రతిదానికి వాడే పదం అయిపోయింది. ఈ పదాలు దాటి వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధాన్ని చూపించాలన్నదే ఈ సినిమా తీయాలనుకోవడానికి ముఖ్య కారణం.
ఆ బంధాన్ని చూపించడం కోసం మీరు లక్ష్మీపార్వతి నుంచి విషయాలు తెలుసుకున్నారా?
నా ఉద్దేశంలో వాళ్లిద్దరూ సోల్‌మేట్స్. ఆవిడ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. చాలా మాట్లాడేశారు. దాచేయాలనుకుంటే నాతో కూడా పంచుకోరు కదా. ఆవిడతో ప్రత్యేకంగా మాట్లాడి తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. చాలా పుస్తకాలు, ఆర్టికిల్స్ చదివాను. రామారావుగారు పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆవిడ ఏ పనిలోనూ కలగజేసుకోలేదని ఓ ఆఫీసర్ చెప్పారు. ఇంకొకరేమో ప్రతిదాంట్లో కలగజేసుకునేవారు అన్నారు. ఇప్పుడు ఎవరు కరెక్ట్? ఎవరు తప్పు అని ఎలా చెప్పగలం?
మరి మీరు ఎలా చూపించబోతున్నారు?
బాగా దగ్గరిగా ఉండి సలహా ఇవ్వడం వేరు, కలగజేసుకోవడం వేరు అంటాను. మన అభిప్రాయాలను వేరే వాళ్ల మీద రుద్దడం అనేది నా దృష్టిలో కలగజేసుకోవడం. లక్ష్మీపార్వతిగారు అలా ఇంటర్‌ఫియర్ అయ్యారంటే అప్పుడు రామారావుగారి ఆలోచన ఏమైనట్టు? ఆయన్ను అనాలా? ఈవిడ్ని అనాలా? ఒకవైపేమో ఎన్టీఆర్ చాలా గొప్పవాడు అంటూ ఆయన మీద పార్టీలు నడుపుతున్నారు. ఆయన ఆమె మాట విని రాష్ట్రానికి సంబంధించిన పనులు చేస్తున్నారంటే ఎవరి తప్పు? లక్ష్మీ పార్వతిదా? ఎన్టీఆర్‌దా? నా పాయిం టాఫ్ వ్యూలో అడుగుతున్నా.
ఒకరు చెబితే ఇన్‌ఫ్లుయన్స్ అయ్యే గుణం ఎన్టీఆర్‌కి ఉందంటారా?
అస్సలు కాదు. ఆయన చాలా విజనరీ. ఆయన అనుకున్నది ఆయన చేస్తాడు. అందరూ కూడా చేతులు కట్టుకొని ఓట్లు అడుక్కుంటుంటే ఒరేయ్ ఓట్లు వేయకపోతే మీ ఖర్మ అని స్పీచ్‌లు ఇచ్చి మరీ గెలిచిన వ్యక్తి ఆయన. ఎవరి మాట వినరు అని ఓ పేరుంది. అనుకున్నదే చేస్తారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్‌ని తగ్గించి లక్ష్మీపార్వతిని గ్లోరిఫై చేస్తే గొడవలు ఏమైనా అవుతాయంటారా?
గొడవలంటే ఏం చేస్తారు? మహా అంటే టీవీల్లో అరుస్తారు. అంతకు మించి ఏమీ ఉండదు. ఈ సినిమాను ఆపాలంటే స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్‌గారే ఆపాలి.
మీ ఇంటి దగ్గరకు వచ్చి గొడవలు లాంటివి?
మా ఇంటికి వచ్చినా అరుస్తారు.. అంతే. అరిచేవాళ్లు ఏమీ చేయలేరు.
లక్ష్మీపార్వతిని ఎక్కువగా చూపించాలని మీరు అనుకుంటున్నారని కొందరు ఊహిస్తున్నారు.
ఆవిడ్ని ఎక్కువగా చూపిస్తే ఎవరికి ఉపయోగమో నాకు అర్థం కావడం లేదు. సడన్‌గా లక్ష్మీపార్వతిగారు ఇంకో పార్టీ పెట్టేస్తారా? లక్ష్మీపార్వతిగారి మీద ఈ సినిమా తీయడం లేదు. లక్ష్మీపార్వతిగారితో ఆయనకున్న సంబంధం మీద సినిమా తెరకెక్కిస్తున్నా. సెంట్రల్ క్యారెక్టర్ లక్ష్మీపార్వతిగారు అయితే కాదు.
సెట్స్ మీద ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ ఆయన ముఖ్యమంత్రి అవ్వడంతో పూర్తవుతాయట. ఈ సినిమా దానికి సీక్వెల్‌గా ఉంటుంది అంటారా?
100 శాతం అనుకోవచ్చు. బయోపిక్ అనేది పుట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఉండేది. వాళ్ల ఉద్దేశమేంటో నాకు తెలియదు. అలాగే ఆ సినిమాల గురించి నేను మాట్లాడకూడదు. నేను విన్నది ఏంటంటే.. రామారావుగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిపోతుందట. నా సినిమా దాని తర్వాత మొదలవుతుంది. ఈ మూడు సినిమాలు చూస్తే ఎన్టీఆర్ బయోపిక్ చూసేసినట్టే. ఆ విధంగా రామారావుగారికి న్యాయం చేసినట్టే.
పబ్లిక్ పర్సనాలిటీ చనిపోయాక ఆ వ్యక్తి గురించి సాధారణంగా నెగటివ్‌గా మాట్లాడరు. అయితే ఈ సినిమాలో అలాంటి అంశాలు కొన్ని ఉండొచ్చేమో?
నెగటివ్ అనేది మనిషి చూసే కోణాన్ని బట్టి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఒక మనిషి అలా చేయాల్సి వచ్చింది? ఆ పరిస్థితి తెలిసిన వాడికి అది నెగటివ్‌గా అనిపించకపోవచ్చు. అలాగని పాజిటివ్‌గానూ అనిపించకపోవచ్చు. నెగటివ్ అంటే క్రిమినల్ ఆలోచనతో చేశాడా? స్వార్థంతో చేశాడా? ఒక యాక్ట్ జరిగినప్పుడు మనం మనకు తోచినట్టుగా ఏదేదో ఊహించుకుంటాం. ఇందుకు చేశారు... అందుకు చేశారని. అక్కడ ఏ ఉద్దేశంతో చేశారన్నది మనకు అర్థం అయినప్పుడు హిస్టారికల్ కోణం వస్తుంది.
రెగ్యులర్ ఫార్మాట్ మూవీలో ఉన్నట్టు పాటలు, ఫైట్లు?
ఫైట్లు, కామెడీ ఉండవు. పాటలు ఉంటాయి. అవి కూడా కేవలం బ్యాగ్రౌండ్‌లో వస్తుంటాయి. పొయిటిక్‌గా ఉంటాయి. కల్యాణి మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఒక పాట రికార్డ్ చేశాం.
మీరు పాడబోతున్నారా?
లేదు. ఆ విషయంలో మీరు ఆనందించవచ్చు.
‘కత్తులతో సావాసం..’ అని ‘రక్త చరిత్ర’లో పాడారు. వాయిస్ బాగానే ఉంటుంది కదా?
నా వాయిస్ కొంతమందికి నచ్చుతుంది. కొంతమంది ‘నీ వాయిస్‌తో పెట్టకు రా బాబు’ అంటుంటారు.
మీ పాత హిట్స్ ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా ఓ రియలిస్టిక్ ఈవెంట్‌తో సినిమా తీస్తున్నా అని ప్రకటించగానే ఓ బజ్ క్రియేట్ అవ్వడం ఎలా అనిపిస్తోంది?
నా పాయింట్ ఏంటంటే.. తనకు వచ్చిన గొప్ప రోల్ వల్ల ఓ ఆర్టిస్ట్ గొప్ప యాక్టర్ అవుతాడు. తను టేకప్ చేసిన సబ్జెక్ట్ వల్ల దర్శకుడు గొప్పవాడు అవుతాడు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్‌లో ఉన్న విషయం వల్ల వీడు ఈ ప్రాజెక్ట్‌ని బాగా టేకప్ చేయగలడు, బాగా హ్యాండిల్ చేయగలడు అనిపిస్తుంది. దాంట్లో నుంచి బజ్ వస్తుంది. అదే నేను ఇంట్రస్ట్ లేని వేరే ఏదైనా సబ్జెక్ట్ టేకప్ చేస్తే ఇంత ఉండకపోవచ్చు. ఇది ప్రపంచంలోని అందరి దర్శకులకు వర్తిస్తుంది. ‘గాడ్ ఫాదర్’ దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా 40 సినిమాలు తీస్తే, నాకు గుర్తున్నవి నాలుగే. ఎందుకంటే ఆ 4 సినిమాల సబ్జెక్ట్ డిఫరెంట్‌గా, ఇంట్రస్ట్‌గా ఉండటమే.
ఎన్టీఆర్ మీద రెండు సినిమాలు వస్తున్నాయి. వాటిలో వారసులు నటిస్తున్నారు. మీ సినిమాలో లేరు. ఎందుకని?
వారసుల పాత్రలు ఈ సినిమాలో పూర్తి స్థాయిలో కనిపించవు. కానీ వాళ్ల ప్రస్తావన ఉంటుంది. వాళ్ల వ్యక్తిగతం మాత్రం ఉండదు. అందుకే నాకు అవసరంలేదనిపించింది. పాత్రకు తగ్గ నటీనటులను తీసుకుంటాను. స్టార్స్ అయ్యుండాల్సిన అవసరం లేదు.
సినిమా తీస్తున్నా అని వాళ్లను పర్మిషన్ అడిగారా?
లేదు. ఈ సినిమాకు అవసరం కూడా లేదు.
అడగలేదు అంటున్నారంటే.. ఈ సినిమా వాళ్లకు వ్యతిరేకం అనుకోవచ్చా?
వ్యతిరేకం కాదు. నా స్క్రిప్ట్‌కు అవసరం లేదంతే.
మరి.. లక్ష్మీపార్వతి పర్మిషన్ అడిగారా?
ఒక పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో ఉన్న వ్యక్తి గురించి సినిమా తీసేటప్పుడు పర్మిషన్ అవసరంలేదు. అందుకే అడగలేదు.
ఇందులో ఎవరెవరి పాత్రలు ఉంటాయి?
అప్పుడు లక్ష్మీపార్వతిగారు ఎన్టీఆర్ జీవితంలోకి ఎంటరయ్యాక ఉన్న పాత్రలన్నీ ఉంటాయి. అయితే వాటి గురించి ఇప్పుడు చెప్పను. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చూసి తెలుసుకోవాల్సిందే.
ఈ సినిమా కారణంగా పొలిటికల్‌గా వచ్చే ఎన్నికల్లో ఏదైనా మార్పు వస్తుందంటారా?
అసలు నేను అంత దూరం ఆలోచించలేదు.
ఒకవేళ ప్రాజెక్ట్ మధ్యలో ఆపేసే పరిస్థితులు వస్తే..?
ఆపను. ఈ ప్రాజెక్ట్‌కి స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయి. ఆయన తప్ప ఈ ప్రాజెక్ట్‌ని ఎవరూ ఆపలేరు.
ఎన్టీఆర్ పేరు పలికినప్పుడల్లా స్వర్గంలో ఉన్నారు అంటున్నారు. మీకెలా తెలుసు.. ఆయన స్వర్గంలోనే ఉన్నారని?
నాకు దేవుడు చెప్పాడు. ఎన్టీఆర్ లాంటి వ్యక్తి స్వర్గానికి వెళ్లకపోతే ఇక స్వర్గానికి ఎవరు వెళ్తారు?
ఆయన్ను అంత పాజిటివ్‌గా చూస్తున్నారా?
అవును.. 100 శాతం. రాజకీయాల్లో పెను మార్పుకి కారణమైన వ్యక్తి. అనుకున్నది సాధించగల ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి.
మీరు ఆడవాళ్లను ‘సెక్స్ సింబల్’లా మాత్రమే చూస్తారని కొందరి ఫీలింగ్?
కొందరిది కాదు అందరిదీ. నా ఫీలింగ్ కూడా అదే.
అంటే.. స్త్రీ అంటే అంతేనా? వాళ్ల టాలెంట్ ఇంపార్టెంట్ కాదా? ఎన్నో సాధిస్తున్నారు కదా?
సాధించేది ఎవరైనా సాధిస్తారు. ఏదైనా సాధించాలంటే అది జెండర్‌తో సంబంధం లేదు. స్త్రీ పైలట్ అవ్వగలదు, ఇంకోటి అవ్వగలదు. ఇంకోటి సాధించగలదు. అది మగవాడు కూడా అచీవ్ చేస్తాడు. అయితే స్త్రీకి ఉన్న మహా శక్తి ఏంటంటే.. అట్రాక్షన్. కానీ మగవాడు ఎప్పటికీ స్త్రీలా ఆకర్షణీయంగా అవ్వలేడు. స్త్రీ అంత అందంగా ఉండలేడు. అందుకే స్త్రీలను పొగుడుతాను కానీ కించపరచాలనే ఉద్దేశంతో అనను. అసలు స్త్రీలను ఎప్పుడూ తక్కువ దృష్టితో చూడను, చూడలేను.
‘మీటూ’ అంటూ తమపై జరిగిన లైంగిక దాడులను బయటకు చెప్పుకోవడానికి ఫీమేల్ ఆర్టిస్టులు వెనకాడటంలేదు? ఎవరి దగ్గరైనా మీరు తేడాగా ప్రవర్తించి ఉంటే అది బయటకు వచ్చే అవకాశం ఉందా?
ఇప్పటివరకూ చాలామంది పేర్లు బయటకు వచ్చాయి. నా పేరు ఎక్కడైనా వినిపించిందా? నేను ఏ ఆర్టిస్టునీ ఎప్పుడూ దేనికీ ఫోర్స్ చేయలేదు. నా లైఫ్‌లో ఒక స్త్రీని బలవంత పెట్టడం కానీ తనతో తప్పుగా ప్రవర్తించడం కానీ చేయలేదు.. చేయను కూడా.
చెడుగా ప్రవర్తించే మగవాళ్లను ఏమంటారు?
స్త్రీలంటే వాళ్లకు గౌరవం లేదు. యాక్చువల్‌గా ‘మీటూ’ అంటే ఓన్లీ సెక్సువల్ హెరాస్‌మెంట్ మాత్రమే కాదు. ‘నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను’ అనే పొగరు కొందరు మగవాళ్లకు ఉంటుంది. ఆ పొగరుతో స్త్రీలను తక్కువగా చూస్తారు.. వేధిస్తారు. అది ‘మీటూ’ ఉద్యమానికి దారి తీసింది. దీనివల్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే అవగాహన స్త్రీలకు వస్తుంది. నేను ‘మీటూ’కి పూర్తిగా మద్దతు తెలుపుతున్నాను.
‘మీటూ’ వల్ల మార్పొస్తుందనుకుంటున్నారా?
చాలా మంచి ఉద్యమం. ఇప్పుడు మగవాళ్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తిస్తారు అనుకుంటున్నాను. కొంత మార్పు తప్పకుండా వస్తుందని అనిపిస్తోంది. అదే విధంగా చాలా ఉద్యమాల్లా ‘మీటూ’ కూడా శ్మశాన వైరాగ్యం అవుతుందేమో. కొన్ని రోజుల్లో దీన్ని కూడా మరచిపోయే అవకాశం ఉంది.
మీరు దేవుణ్ణి విమర్శిస్తారు. మరోవైపు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా కోసం ఏకంగా తిరుమల వెళ్లారు. మళ్లీ తెలివిగా ఆ ఎన్టీఆరే వెళ్లేలా చేశారన్నారు? ఇలా మాటలు తిప్పే నేర్పు ఎక్కడ్నుంచి వస్తుంది? ఏం తింటారు?
తిండి తింటే తెలివితేటలు రావు. అసలు శ్రద్ధగా తిండి తినడం, పిల్లల్ని కనడం, వాళ్లని పెంచడం లాంటి వాటితో నేను నా టైమ్‌ని వేస్ట్ చేసుకోను. నా టైమ్‌ని తెలివితేటలు ఎలా పెంచుకోవాలా? అని ఆలోచించుకోవడానికి మాత్రమే స్పెండ్ చేస్తాను. నేను పుస్తకాలు విపరీతంగా చదువుతాను. చదవడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి.
సమాజం ఎంతో విలువనిచ్చే పెళ్లి వేస్ట్ అంటారా?
సమాజం అంటే ఏంటి? మనుషులే కదా? ఎక్కడో ఎవరో ఏదో అంటారు. మీరు గుడ్డిగా పాటిస్తారు. నేను గుడ్డివాణ్ణి కాదు.. కళ్లున్నాయి.
ఒకసారి పెళ్లి చేసుకున్నారుగా?
అప్పుడు గుడ్డివాణ్ణి. ఆ తర్వాత జ్ఞానోదయం అయింది.
నూటికి 99 మంది పాటించే దాన్ని మీరెందుకు తప్పు అంటారు?
నేను చాలా స్పెషల్ కాబట్టి.
స్పెషల్ అనుకోవడం వల్ల స్పెషల్ అవుతారా? లేక మీ స్వభావమే అంతా?
అటెన్షన్ సీకింగ్ అంటే ఇష్టం. నేను పొద్దున నిద్ర లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకోబోయే వరకూ నాకు ఆనందాన్ని ఇచ్చే పనులే చేస్తుంటాను.
ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారనే అభిప్రాయం కొందరిలో ఉంది.. మీ ఒపీనియన్?
అవును. వెన్నుపోటు పొడిచారు.
ఎంతో స్ట్రాంగ్‌గా ఉండే ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి అంత సులువుగా ఎలా ప్రవేశించగలిగారు?
అప్పుడు ఆయన జీవితంలో ఓ శూన్యం ఏర్పడింది. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ శూన్యం. ఆ సమయంలో మానసిక స్థితి ఓదార్పు కోరుకునే అవకాశం ఉంది. అలాంటి టైమ్‌లోనే లక్ష్మీపార్వతిగారు ఆయన జీవితంలోకి ప్రవేశించారు. ఒక ఎమోషనల్ స్టేట్‌లో ఇది జరిగి ఉంటుందని నా అభిప్రాయం.
ఫైనల్లీ.. మీరన్నట్లు అన్నీ నిజాలే చెబుతారా?
నిజం మాత్రమే చెప్పాలని తీస్తున్నాను.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment