ఎల్లా! నమితతో శరత్‌బాబు పెళ్లా? అని శుక్రవారం ఒకటే చర్చ. ఇద్దరూ లవ్‌లో ఉన్నారట అని ఫిల్మ్‌నగర్‌లో గాసిప్పురాయుళ్లు ప్రచారం చేసిన వార్త కాసేపు బాగానే షికారు చేసింది. కలిసి పని చేస్తున్న ఓ హీరో–హీరోయిన్ మధ్య ఎఫైర్ ఉందనే వార్త వస్తే... అందులో ఎంతో కొంత నిజం ఉంటుందనే అనుమానం రాక మానదు. నమిత ఉంటున్నది చెన్నైలో. శరత్‌బాబు ఇటు హైదరాబాద్ అటు చెన్నై.. బెంగళూరుల్లో ఉంటుంటారు. అఫ్‌కోర్స్ షూటింగ్స్ ఉన్నప్పుడు వేరే ప్లేసులకు కూడా వెళతారనుకోండి. ఆ సంగతి పక్కన పెట్టి ‘పెళ్లి న్యూస్’కి వచ్చేద్దాం. ‘
ఇది నిజమా?’ అని శరత్‌బాబుకి ‘సాక్షి’ ఫోన్ చేస్తే, గట్టిగా నవ్వేశారు. రెండు మూడేళ్ల క్రితం మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ‘పెళ్లి చేసుకుంటే ముందు మీకే చెబుతా’ అన్నారు అంటే, ‘ఆ మాటే ఇప్పుడూ అంటున్నా. తప్పకుండా చెబుతా’ అన్నారు. మరి.. నమితతో ప్రేమ, పెళ్లి అనే వార్త గురించి ఏమంటారు? అని శరత్‌బాబుని అడిగితే – ‘‘రావణాసురుడు సీతను ఎత్తుకుపోతే అదంత పెద్ద టాపిక్ కాదు... ఎందుకంటే రావణాసురుడు అలానే చేస్తాడని ఓ క్లారిటీ ఉంది.
రాముడు శూర్పణఖను ఎత్తుకుపోయాడంటే అది కచ్చితంగా హాట్ టాపిక్కే. రాముడికి క్లీన్ ఇమేజ్ ఉంది కాబట్టి, ‘అలా చేసాడా’ అని వింతగా చెప్పుకుంటారు. ఎప్పుడైనాసరే క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్ల గురించి ఏదైనా కథ అల్లి చెబితే, దానికి వచ్చే క్రేజే వేరే. ఇప్పుడు అలానే జరిగింది.
రాసిందెవరో కానీ, ఆ వ్యక్తి అంటే నాకే మాత్రం కోపం లేదు. ఒకవేళ రాసింది మేల్ జర్నలిస్ట్ అయితే, అతనికి పెళ్లయ్యుంటే భార్యాపిల్లలను పోషించుకోవడం కోసం ఏదో వార్త రాసాడని సరిపెట్టుకుంటా. ఆ విధంగా అతనికి ఉపయోగపడినందుకు ఆనందపడుతున్నా. ఒకవేళ ఫీమేల్ జర్నలిస్ట్ అయితే, నా వార్త రాసి, లాభపడినందుకు ‘ఐయామ్ హ్యాపీ’. నిజంగా సెలబ్రిటీలు గ్రేట్ అండి. ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికి ఉపయోగపడతారు. ఇలా ఏదేదో ఊహించేసి, రాసుకోవడానికి ఉపయోగపడతారు’’ అన్నారు శరత్‌బాబు. సో.. ఈ పుకారు షికారుకి ఫుల్‌స్టాప్ పడిపోతుంది కదూ.
నమితని చూసి ఎనిమిదేళ్లయింది
‘‘నమితను చూసి, దగ్గర దగ్గర ఎనిమిదేళ్లయింది. అప్పుడెప్పుడో ఓ తమిళ సినిమాలో మేమిద్దరం నటించాం. పేరు కూడా సరిగ్గా గుర్తు లేదు. ఇప్పుడు తనెక్కడ ఉందో కూడా తెలియదు. సడన్‌గా మా గురించి ఇలాంటి ఓ ప్రచారం మొదలు కాగానే నా ఫ్రెండ్స్ అంతా ‘యు స్టిల్ క్యారీ ది రొమాంటిక్ ఇమేజ్’ అని నవ్వారు. నేనూ హాయిగా నవ్వుకున్నా. ఫైనల్లీ నేను చెప్పొచ్చేదేంటంటే... శుక్రవారం నా గురించి వచ్చిన వార్తలో ఏ మాత్రం నిజం లేదు. అది నూటికి నూరు పాళ్లు అబద్ధం’’ అన్నారు శరత్‌బాబు.
Comments
Please login to add a commentAdd a comment